ఆ మద్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు: సత్తిబాబు

ABN , First Publish Date - 2020-06-03T21:19:51+05:30 IST

రాష్ట్రంలో అక్రమ మద్యం, ఇసుక రవాణాను నియంత్రించేందుకు..

ఆ మద్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు: సత్తిబాబు

అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం, ఇసుక రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సింబంధించి వివిధ జిల్లాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ డీసీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో ఈ టీమ్ మొత్తం పనిచేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ ఆఫీసర్‌గా సత్తిబాబును ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయన్నారు. బయట నుంచి వచ్చే మద్యంలో స్ఫూరియాస్ లిక్కర్ ఉండే అవకాశముందని, దానివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పువచ్చే ప్రమాదముందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక నష్టం జరిగే అవకాశముందన్నారు.


అక్రమ మద్యం ఎక్కువగా నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి ఏపీకి వస్తుందని, దీంతో బోర్డర్‌లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సత్తిబాబు తెలిపారు. నిరంతరాయంగా తనికీలు చేస్తున్నామని, చాలా వరకు అక్రమ మద్యాన్ని పట్టుకుంటున్నామని, అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇసుక అక్రమ రవాణాపై కూడా చర్యలు చేపట్టామని, నిబంధనల ప్రకారం 18 టన్నుల ఇసుకను మించి ఒక్క టన్ను ఎక్కువ ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని సత్తిబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-03T21:19:51+05:30 IST