కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా

ABN , First Publish Date - 2021-06-27T08:59:25+05:30 IST

పార్టీలో అందరితో కలిసి పని చేస్తానని, తెలంగాణలో కాంగ్రె్‌సను తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా

  • అందర్నీ కలుపుకొని పోతా.. కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తా
  • సోనియా, రాహుల్‌ ఆలోచన మేరకు పనిచేస్తా
  • బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి: రేవంత్‌రెడ్డి


హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పార్టీలో అందరితో కలిసి పని చేస్తానని, తెలంగాణలో కాంగ్రె్‌సను తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్లందరినీ కలుస్తానని, నిన్నమొన్నటి వరకూ అభిప్రాయ భేదాలున్నవారినీ కలిసి మాట్లాడతానని చెప్పారు. అందరినీ కలుపుకొని పోతూ, అందరి అభిప్రాయాలను తీసుకుని పనిచేస్తానని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం, అమరవీరుల ఆశయాల కోసం కృషి చేస్తానని చెప్పారు. సోనియా, రాహుల్‌ ఆలోచనల మేరకు పని చేస్తానన్నారు.  


కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిదని, ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయని, కానీ.. అవి భేదాభిప్రాయాలు కావని తెలిపారు. కోమటిరెడ్డి సోదరులు తన కుటుంబమన్నారు. ఉత్తమ్‌, భట్టి, జానా తదితరులతో మాట్లాడుతూ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ప్రజల మనసు గుర్తెరిగి పనిచేస్తామని చెప్పారు. కేఎల్‌ఆర్‌తోనూ మాట్లాడతానని, అసలు తనకు ఎంపీ సీటు ఇవ్వాలని చెప్పిందే కేఎల్‌ఆర్‌ అని అన్నారు. అనంతనం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలకు ప్రాధాన్య ఉంటుందని, కాంగ్రెస్‌ అంటే కార్యకర్తల పార్టీ అని నిరూపిస్తానని చెప్పారు. 


ఈటలను బీజేపీలోకి పంపిందే కేసీఆర్‌ 

ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి పంపిందే సీఎం కేసీఆర్‌ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కిషన్‌రెడ్డి రాత్రికి రాత్రి వచ్చిన చార్టర్డ్‌ ఫ్లైట్‌ ఓ కాంట్రాక్టరుదని అన్నారు.

Updated Date - 2021-06-27T08:59:25+05:30 IST