హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

ABN , First Publish Date - 2022-10-03T08:14:16+05:30 IST

పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ ప్రేరేపిత ఉగ్రవాదులు హైదరాబాద్‌ నగరంపై మళ్లీ గురి పెట్టారు.

హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

  • ముగ్గురు ఐఎస్‌ఐ ఉగ్రవాదుల అరెస్టు
  • జాహెద్‌ పేరు మళ్లీ తెరపైకి
  • అతని ఇద్దరు అనుచరులకూ బేడీలు
  • నగరంపై మళ్లీ ఐఎస్‌ఐ గురి
  • మతకల్లోలాలకు భారీ ప్లాన్‌!
  • ‘నిఘా’ అప్రమత్తతతో తప్పిన ముప్పు
  • చిక్కిన ఉగ్రవాదుల ఖాతాల్లోకి పాక్‌ నుంచి నగదు.. అక్కడి నుంచే గ్రనేడ్లు
  • విధ్వంసం సృష్టించాలని ఆదేశాలిచ్చిన ఫర్హతుల్లా ఘోరీ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ ప్రేరేపిత ఉగ్రవాదులు హైదరాబాద్‌ నగరంపై మళ్లీ గురి పెట్టారు. రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా గ్రనేడ్‌ దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి.. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాలు, టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు, సీసీఎస్‌ పరిధిలోని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) బృందాలు.. పాకిస్థాన్‌ నుంచి నాలుగు గ్రనేడ్లతో వచ్చిన ఓ పార్సిల్‌ను ట్రాక్‌ చేసి మరీ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆటను కట్టించారు. గతంలో ఉగ్రవాద కేసులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అబ్దుల్‌ జాహెద్‌తోపాటు.. అతను రిక్రూట్‌ చేసుకున్న ఇద్దరు ఉగ్రవాదులు-- సమీయుద్దీన్‌, మాజ్‌ హసన్‌లను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు ఆదివారం ప్రకటించారు. వీరి నుంచి నాలుగు హ్యాండ్‌ గ్రనేడ్లు, రూ. 5.41 లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం గ్రనేడ్ల పార్సిల్‌ను ట్రాక్‌ చేసిన పోలీసు బృందాలు అర్ధరాత్రి నగరంలోని మలక్‌పేట్‌, సైదాబాద్‌, మూసారాంబాగ్‌, అక్బర్‌బాగ్‌, మెహిదీపట్నం, హుమయూన్‌నగర్‌.. ఇలా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. జాహెద్‌కు పాకిస్థాన్‌లో ఉంటున్న హైదరాబాదీ ఫర్హతుల్లా ఘోరీతో నేరుగా సంబంధాలున్నాయని, అతని ద్వారానే పేలుడు పదార్థాలు నగరానికి చేరాయని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించాయి. ఐఎస్‌ఐతో నేరుగా సంబంధాలున్న ఘోరీ సూచనల మేరకు హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో గ్రనేడ్‌ దాడులకు, మతకల్లోలాలకు జాహెద్‌, అతని ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు.


ముందు నుంచే ఐఎస్‌ఐతో..

మూసారాంబాగ్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ జాహెద్‌ అలియాస్‌ మోటు ముందు నుంచే  ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదిగా పోలీసుల రికార్డుకెక్కాడు. 2005లో బేగంపేట్‌లోని అప్పటి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు(బంగ్లాదేశ్‌కు చెందిన డాలిన్‌) దాడి కేసులోనూ జాహెద్‌ నిందితుడిగా ఉన్నాడు. పలు కేసుల్లో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న జాహెద్‌.. పాకిస్థాన్‌లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరీతో సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఘోరీ ఆదేశాలతో నగరంలో కుట్రలకు పథకం రచించి.. దాన్ని అమలు చేసేందుకు కొందరు యువకులను రిక్రూట్‌ చేసుకున్నాడని, సమీయుద్దీన్‌, హసన్‌ను అలాగే నియమించుకున్నాడని పోలీసులు గుర్తించారు. జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ను పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. జాహెద్‌ రిక్రూట్‌ చేసుకున్న ఇతర యువకులు ఎవరు? వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. దాంతోపాటు.. ఈ ముగ్గురి బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ డేటాను విశ్లేషిస్తున్నారు.


ఎవరీ ఫర్హతుల్లా ఘోరీ?

సైదాబాద్‌ సమీపంలోని కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్‌ అబూ సూఫియాన్‌కు 24 ఏళ్ల ఉగ్రవాద చరిత్ర ఉంది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన టాప్‌-24 మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. గతంలో ఇతను అరెస్టయినా.. ఆ తర్వాత దుబాయ్‌ పారిపోయాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు మకాం మార్చాడు. ఇతను 1998లో ఐఎ్‌సఐ ప్రేరేపిత ఉగ్రవాదిగా మారాడు. యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించేవాడు. 2002లో గుజరాత్‌లోని అక్షరాధామ్‌పై జరిగిన దాడితో మొదటిసారి ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు ఇతను పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 2005లో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడిలోనూ ఘోరీ ప్రధాన నిందితుడు. 2002లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం పేలుడు, ముంబైలోని ఘాట్‌కోపర్‌ వద్ద బస్సును పేల్చిన ఘటన, 2004లో సికింద్రాబాద్‌ గణేశ్‌ టెంపుల్‌ వద్ద పేలుడుకు ఫర్హతుల్లా కారణమని పోలీసులు గుర్తించారు.


15 ఏళ్ల తర్వాత మళ్లీ..!

ఐఎ్‌సఐతో నేరుగా సంబంధాలున్న ఉగ్రవాదుల ఉనికి నగరంలో మళ్లీ 15 ఏళ్ల తర్వాత వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది..! గులాం యాజ్దానీ, అబూ హంజా, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నయీం, ఫర్హతుల్లా ఘోరీ.. ఇలా 2007కు ముందు వరకు ఐఎ్‌సఐతో నేరుగా సంబంధాలున్న ఉగ్రవాదులు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించారు. 2005 నుంచి సిమీ ఉగ్రవాదం పెరగ్గా.. 2007లో ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) పురుడుపోసుకుని, గోకుల్‌ చాట్‌, లుంబినీపార్క్‌ జంట పేలుళ్లు జరిపాక..  ఐఎస్‌ఐతో నేరుగా సంబంధాలున్న ఉగ్రమూకలు కనుమరుగయ్యాయి. ఆ తర్వాత వికార్‌ అహ్మద్‌(జనగాం వద్ద ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు) తహ్రీక్‌-ఎ-గల్బా ఇస్లాం(టీజేఐ) పేరుతో సొంత ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసి.. లోన్‌ వోల్ఫ్‌(ఒంటరి) దాడులు చేశాడు. 2013 హైదరాబాద్‌ జంటపేలుళ్ల సూత్రధారులు కూడా ఐఎం ఉగ్రవాదులే. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో ‘‘దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా హైదరాబాద్‌తో సంబంధాలుంటాయి’’ అనే మచ్చ తొలగిపోయింది. హైదరాబాద్‌లో అణువణువూ నిఘా పరిధిలోకి వచ్చేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాక.. స్లీపర్‌సెల్స్‌ కూడా దాదాపుగా కనుమరుగయ్యాయి. ఆ తర్వాతి కాలంలో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎ్‌స)లో చేరేందుకు కొందరు నగర యువకుల ప్రయత్నాలను ముందే పసిగట్టిన రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు.

Updated Date - 2022-10-03T08:14:16+05:30 IST