దళిత కుటుంబానికి పది లక్షలు
ABN , First Publish Date - 2021-06-28T08:55:17+05:30 IST
దళితుల స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షన జరిగిన అఖిలపక్ష సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
- తొలి దశలో నియోజకవర్గానికి 100 కుటుంబాల ఎంపిక
- రాష్ట్రవ్యాప్తంగా 11900 కుటుంబాలకు లబ్ధి
- రైతుబంధు మాదిరి నేరుగా ఖాతాల్లోనే జమ
- దళిత సాధికారతకు ఈ ఏడాది రూ.1200 కోట్లు
- 2, 3 ఏళ్లలో రూ.40 వేల కోట్లతో సాధికారత
- ‘సీఎం దళిత సాధికారత’ మిషన్ మోడ్‌లో అమలు
- సాధికారతపై సీఎంవోలో ప్రత్యేక అధికారి
- దళితుల భూముల వివరాలతో 15 రోజుల్లో నివేదిక
- భూమిలేని దళితులకు కూడా బీమా సౌకర్యం
- లైసెన్సులు, పెట్టుబడుల్లోనూ రిజర్వేషన్లు పరిశీలిస్తాం
- ఉద్యోగులకు పదోన్నతులు 10-15 రోజుల్లో పూర్తి
- సఫాయి కార్మికులకు పీఆర్సీ మాదిరి ప్రయోజనం
- దళితులపై దాడి చేస్తే పోలీసులకు ఉద్వాసన
- దళితుల అసైన్డ్ భూముల లెక్కతీయాలి: సీఎం
- సీఎం కేసీఆర్‌పై అఖిలపక్ష నేతల ప్రశంసల జల్లు
వ్యవసాయం, సాగు నీటి రంగాలను చక్కదిద్దినట్లుగానే దళితుల సాధికారత కోసం కూడా పట్టుదలతో పని చేయాలని నిర్ణయించాం. దళితుల అభ్యున్నతికి ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకాన్ని’ పటిష్ఠంగా అమలు చేయాలనుకుంటున్నాం. ఈ పథకానికి రూ.1200 కోట్లు కేటాయించాం. మరో 500 కోట్లు పెంచడానికీ సిద్ధంగా ఉన్నాం. రాబోయే 3, 4 ఏళ్లలో రూ.35-40 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని యోచిస్తున్నాం. ఎస్సీ సబ్ ప్లాన్ కు ఈ నిధులు అదనం. - కేసీఆర్
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజోతి): దళితుల స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షన జరిగిన అఖిలపక్ష సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ పథకం కింద తొలిదశలో నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేసి, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని, ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోనే వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని 11,900 దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ పథకం కింద దాదాపు రూ.1200 కోట్ల ఆర్థిక సాయాన్ని రైతుబంధు పథకం మాదిరిగానే అందించాలని సమావేశం నిర్ణయించింది. దళిత సాధికారతపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో 11 గంటలపాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ పార్టీల నేతలు, దళిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దళిత సాధికారత, స్వావలంబన కింద ఆర్థిక సాయానికి అర్హులైన, ఎంపిక చేసిన కుటుంబాలు తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోవాలని.. తమ పథకాలను తామే నిర్వహించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. దళారులు లేకుండా రైతుబంధు పథకం, ఆసరా పెన్షన్ ల మాదిరి నేరుగా అత్యంత పారదర్శకంగా ఆర్థిక సాయం అందేల సూచనలు చేయాలని ప్రతినిధులను సీఎం కేసీఆర్ కోరారు.
దళిత సమాజం వద్ద భూమి గణన!
‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ పథకంలో అర్హులైన దళిత కుటుంబాలను గణన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ‘‘అట్టడుగున ఉన్న వారి నుంచి సాయాన్ని ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలి. దళిత సాధికారత కోసం ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పని చేయాలని నిర్ణయించింది. అందరూ కలిసి రావాలి. భగవంతుడిచ్చిన సర్వ శక్తులను ఉపయోగించి ఈ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నదే నా ధృఢ సంకల్పం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలని, ఆ లెక్కలను స్థిరీకరించి సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే 10, 15 రోజులు దళితుల భూముల గణన మీదనే పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో 7,79,902 మంది దళితుల వద్ద 13.85 లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు. ‘రాష్ట్రంలో దళితుల వద్ద ఉన్న అసైన్డ్ భూముల్లో ఉన్నవెన్ని? పోయినవెన్ని? లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎస్సీల భూముల్లో నీళ్లున్న, నీళ్లులేని భూములను కలిగిన కుటుంబాలను గుర్తించాలి’ అని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదే సిద్ధం చేసుకోవాలన్నారు ఎటువంటి బ్యాంకు గ్యారంటీ లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారమందిస్తామన్నారు. ‘‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సామాజికంగా, ఆర్థికంగా పీడితవర్గాలు దళితులే. ఈ బాధ పోవాలి. వారి బాధలు పోయేందుకు దశలవారీగా కార్యాచరణను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని చెప్పారు. ప్రాజెక్టులు, ఇతర ప్రజావసరాల కోసం భూ సేకరణలో భాగంగా పట్టా భూములకు చెల్లిస్తున్నట్లుగానే అసైన్డ్ భూములకూ ఖరీదును సర్కారు చెల్లిస్తోందని గుర్తు చేశారు.

పైరవీలు లేకుండా..
‘‘దళిత సాధికారతకు పైరవీలకు వీలు లేని పారదర్శక విధానాన్ని అమలు చేద్దాం నిధుల బాధ్యత నాది. రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ బాధ్యతను అందరమూ తీసుకుందాం’’ అని అఖిల పక్ష సమావేశ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ పేర్నొన్నారు. పంటల ఉత్పత్తి ఆధారంగా ఇన్నేళ్లు జీవనోపాధి సాగిందని, మారిన పరిస్థితులలో పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలని సూచించారు. గోరటి వెంకన్న రాసి, పాడిన... గల్లీ చిన్నది అనే పాటను వింటే దళితుల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడిగా గుర్తించి, వాటి పరిష్కారాలు వెతకాలని సూచించారు. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి, సమష్టి కృషితో సమాధానాలు సాఽధించాలన్నారు. అద్దాల అంగడి మాయాలోకపు పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దళితులు తమ నైపుణ్యాన్ని, సామర్థ్యాలను పెంచుకోవాలని, అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు .
ఆటాపాటలతో చైతన్యం
దళితులు సాధికారత సాధించే దిశగా అవకాశాలు అందుకునేలా ఆ సమాజం చైతన్యం తేవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాటలు, కళారూపాల ప్రదర్శన, ఎలకా్ట్రనిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గోరటి వెంకన్న వంటి కవులను, సాంస్కృతిక సారధి తదితర కళాకారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దళిత యువత ఆలోచనా ధృక్ఫథంలో గుణాత్మక మార్పులకు, ఆత్మన్యూనత నుంచి ఆత్మస్థయిర్యం పెరిగేందుకు ఉన్నత స్థాయి ఓరియంటేషన్ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యా స్కాలర్‌షిప్ పొందేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయం సీలింగ్‌ను సడలించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. వ్యాపార నిర్వహణ కోసం ఇతర స్వయం ఉపాధి రంగాల ఏర్పాటు కోసం ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్సులు, అందించే పెట్టుబడులు తదితర అంశాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్‌ః కోటా అమలు చేసే అంశాన్ని పరశీలిస్తామని తెలిపారు. కాగా ఈ అఖిలపక్ష సమావేశం 11 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది.
సమావేశంలో పాల్గొన్నవారు..
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రైతు బంధు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ, ఎంఐఎం ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్‌పాషా ఖాద్రి, ఎంపీలు బి.వెంకటేశ్ నేత, పోతుగంటి రరాములు, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, డి.రాజేశ్వర్‌రావు, గోరటి వెంకన్న, రాజేశ్వరరావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్ , దుర్గం చిన్నయ్య, హన్మంతుషిండే, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ , క్రాంతికిరణ్, కె.మాణిక్‌రావు, కాలే యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, గువ్వల బాలరాజు, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్‌కుమార్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్ , సండ్ర వెంకటవీరయ్యతో పాటు మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాధం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు.
భూముల విలువ మేరకు కంపెనీలో వాటా ఇవ్వాలి: భట్టి
అసైన్‌డ భూములను వెనక్కి తీసుకుంటే ఆ భూముల విలువను నిర్ధారించి, సంబంధిత కంపెనీలలో రైతులకు షేర్ల ద్వారా వాటా ఇవ్వాలి. దళిత సాధికారత పథకం ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందిస్తే... దళితులు వారి అభివృద్ధిని వారే నిర్ణయించుకోగలుగుతారు. ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. మరియమ్మ విషయంలో దళిత సమాజానికి ఒక భరోసాను, ధైర్యాన్ని సీఎం కేసీఆర్ అందించారు. పోలీసుల ప్రవర్తనలో ఇకనైనా మార్పు రావాలి. దళితుల పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి. కేసీఆర్ ఆలోచనలను అధికారులు పటిష్టంగా అమలు చేస్తారన్న విశ్వాసం మాకు ఉంది.
నేరుగా సాయమందించాలి: మోత్కుపల్లి
దళిత సాధికారతలో దళితులకు రైతు బంధు మాదిరిగా నేరుగా ఆర్థిక సాయం అందించాలి. తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయాలకు గురైన దళిత కుటటుంబాలను ఆదుకుని, వారికి రక్షణ చర్యలు ప్రకటించాలి.మరియమ్మ లాక్‌పడెత్ విషయంలో తీసుకుంటున్న చర్యలతో దళితుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగింది. ప్రస్తుత సమావేశంతో మా సలహాలు తీసుకోవడం వల్ల దళిత సమాజంలో మానసిక ఉత్తేజం కలిగింది. యాదగిరిగుట్టను ప్రపంచం గుర్తించే స్థాయిలో తీర్చిదిద్దుతున్నందుకు కృతజ్ఞతలు. దళితుల అభివృద్ధికి తపిస్తున్న మీకు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.
చిత్తశుద్ధితో అమలు చేయాలి: తమ్మినేని
ద ళిత సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది. దళిత సాధికారతకు తీసుకుంటున్న చొరవ, ధృఢ నిశ్చయం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మరియమ్మ లాక్‌పడెత్ కేసులోనూ తీసుకుంటున్న చర్యలు దళిత సమాజంలో ఆత్మ స్థైర్యాన్ని పెంచింది.
సీఎం ముందుకు రావడం సంతోషం: చాడ
దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం సంతోషంగా ఉంది. 2003లోనే కేసీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దళిత సాధికారత కోసం చర్చించడం ఇంకా నాకు గుర్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయి.
సఫాయి కార్మికులకు పీఆర్సీ తరహా ప్రయోజనం
రాష్ట్రంలో సఫాయి కార్మికులకు కూడా పీఆర్సీ తరహా ప్రయోజనం జరిగేలా చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం అమలు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘సఫాయన్నకు సలాం... అనే నినాదం మాది, సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ’’ అని అన్నారు. ఎవరూ డిమాండ్ చేయకపోయినా ప్రతీసారి సఫాయి కార్మికుల జీతాలు పెంచుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

దళిత సాధికారతపై సమావేశంలో నిర్ణయాలు, ఆదేశాలు
పథకాన్ని పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించేలా ఎస్సీ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలి. అధునాతన సాంకేతిక విధానాలను అవలంబించి ప్రతీ లబ్ధిదారునికి ఒక కార్డును అందించాలి. బార్ కోడ్‌ను కేటాయించాలి. లబ్ధిదారుడి పూర్తి వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.
ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్ తయారు చేయాలి.
దళితుల్లో రైతు బంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలి. ఆ రైతులకు రైతు బంధుతో పాటు అర్హత కలిగిన వారికి ‘సాధికారత’ వర్తింపు.
సాధికారత కోసం సీఎంవోలో ప్రత్యేకాధికారి నియామకం.. ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహణ.
పెండింగ్‌లో ఉన్న దళిత ఉద్యోగుల పదోన్నతులను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి.
భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం.
‘సాధికారత’ విషయంలో దళిత శాసనసభా సంఘం బాధ్యత తీసుకోవాలి.
సివిల్ సర్వీసె్‌సతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణందించేలా దళిత అభ్యర్థుల కోసం వీలైనన్ని హై క్వాలిఫైడ్ సర్కిల్స్‌ను, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీతో కలిసి ఏర్పాటు. స్టడీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి.
దళితులపై పోలీసుల దాడులు జరిగితే ఆ పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి.
జూలై 1 నుంచి పది రోజుల పాటు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతిలో రెండు రోజులు దళిత వాడల సందర్శన, వారి సమస్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అవసరాలపై వివరాల సేకరణ.
జూలె 1లోగా ఎస్సీ శాసనసభా సంఘం సమావేశం జరిపి ఒక జిల్లాను ఎంచుకొని రైతుబంధు పొందుతున్న దళిత రైతుల గురించి విచారించి ఎదురయ్యే ఇబ్బందులు గుర్తించాలి.
దళితులకు 100% డబుల్‌ఇళ్లకోసం ప్రత్యేక వ్యూహం.
జూసాధికారత అమలు కోసం రిటైర్డ్ దళిత ఉద్యోగులు, ఎన్ జీవోల సహకారం.