Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Ukraine Crisis: క్షణం క్షణం.. భయం భయం.. తెలుగు విద్యార్థుల వేదన!

twitter-iconwatsapp-iconfb-icon
Ukraine Crisis: క్షణం క్షణం.. భయం భయం.. తెలుగు విద్యార్థుల వేదన!

యుద్ధం... ఒక బీభత్సం!

విమానాల రొద, బాంబుల పేలుళ్లు

వణికించే చలిలో కిలోమీటర్లు నడిచాం

‘ఆంధ్రజ్యోతి’తో తెలుగు విద్యార్థుల వేదన

దేశంకాని దేశం! వణికించే, గడ్డ కట్టించే చలి వాతావరణం! ఆపైన... యుద్ధం! ఏ క్షణాన ఏ క్షిపణి మీద పడుతుందో! ఎటు వైపు నుంచి ఏ బుల్లెట్‌ దూసుకొస్తుందో! క్షణం క్షణం... భయం భయం! స్థానికులనే దిక్కు తోచని స్థితిలో పడేసిన యుద్ధం! మరి... అక్కడ చదువుకోవడానికి వెళ్లిన భారతీయుల పరిస్థితి ఏమిటి? ఈ యుద్ధాన్ని వాళ్లు ఎలా ‘ఎదుర్కొన్నారు?’ ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించింది. యుద్ధ భూమి నుంచి ఇప్పటికే సొంత నేలకు చేరిన, ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు చేరుకున్న పలువురు తెలుగు విద్యార్థులను పలకరించింది. 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ‘‘యుద్ధాల సినిమాలు చాలా చూశాను. నిజమైన యుద్ధం ఎంత బీభత్సంగా ఉంటుందో... ఎంత భయ పెడుతుందో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకున్నాను’’.... ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన అనిశెట్టి ఉదయ కుమారి చెప్పిన మాట! ఆమె కీవ్‌లో మెడిసిన్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. తన స్నేహితులతో కలిసి, అష్టకష్టాలు పడి... ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి, హంగరీకి చేరుకున్నారు. ‘‘నాలుగు రోజులు నరకం చూశాం. చెవులు దద్దరిల్లే శబ్ధంతో యుద్ధ విమానాలు... బాంబుల మోత... ఎగసిపడే మంటలు! ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాం’’ అని ఉదయ కుమారి తెలిపారు.

గురువారం తెల్లవారుజామున 3 గంటలకు యుద్ధం మొదలైంది. ఆపై మూడు గంటల్లోనే ఉక్రెయిన్‌లోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను రష్యా స్వాధీనం చేసుకుంది. సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. సైరన్‌ ఒకసారి మోగితే బంకర్లలోకి వెళ్లి దాక్కోవాలని, రెండుసార్లు మోగితేనే బయటకు రావాలని ఇలా ప్రకటనల హోరు మొదలయ్యింది. శుక్రవారం నుంచే సరిహద్దు దేశాలకు భారతీయ విద్యార్థులు, స్థానికులు ప్రయాణమయ్యారు.

Ukraine Crisis: క్షణం క్షణం.. భయం భయం.. తెలుగు విద్యార్థుల వేదన!

ప్రయాణం... ఒక పరీక్ష

ఒకవైపు యుద్ధం జరుగుతుండగానే... బంకర్ల నుంచి బయటికి వచ్చి, బస్సులు, రైళ్లు, కాలి నడక ద్వారా సరిహద్దులను చేరడమంటే ఆషామాషీ కాదు. బంకర్లలో తలదాచుని బయటకు రావడం ఒక ఘట్టం. అక్కడి నుంచి బస్సులు ఎక్కి సరిహద్దుల వరకు రావడం మరో ఘట్టం. ఈ రెండు దాటుకుని సరిహద్దుల వద్దకు చేరుకున్నా దాన్ని దాటడం అంత సులువు కాదు. ఇక్కడే తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఇరుక్కుపోయారు. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పోలాండ్‌, హంగరీ, రుమేనియా సరిహద్దులకు వైద్య విద్యార్థులు రైళ్లు, బస్సుల్లో చేరుతున్నారు.


అయితే... ఆయా దేశాల సరిహద్దులకు పది కిలోమీటర్ల దూరంలోనే బస్సులను ఆపేస్తున్నారు. అక్కడి నుంచి వణికించే చలిలో సరిహద్దుల వరకు నడిచి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడికి చేరుకున్న వెంటనే వారిని లోపలకు బలగాలు అనుమతించడం లేదు. రోజుకు 200 మందిని మాత్రమే సరిహద్దులు దాటిస్తున్నారు. కొద్దిరోజులుగా మంచు కురవడం ఎక్కువైంది.


విమానాశ్రయాలకు, రైల్వే స్టేషన్లకు చేరుకున్న విద్యార్థులు ఆకలితో అలమటిస్తుంటే, సరిహద్దుల వద్ద ఆగిపోయిన వారు మాత్రం చలికి వణికిపోతున్నారు. రుమేనియాలోని విమానాశ్రయంలోనే మంగళవారం నాటికి 3వేల మంది భారతీయ విద్యార్థులున్నారు. ‘‘రుమేనియాలో 120 మంది విద్యార్థులకు ఒక షెల్టర్‌ ఇచ్చారు. వచ్చి మూడు రోజులైంది. భారత్‌కు ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలూ లేవు’’ అని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరుకు చెందిన జ్యోత్స్న తెలిపారు. 


ఉక్రెయిన్‌ సైన్యం దురుసుతనం

అష్టకష్టాలు పడి ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకున్న భారతీయ విద్యార్థులపైన ఉక్రెయిన్‌ సైనికులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ‘మా దేశంలోని మీ పౌరుల భద్రత గురించి ఆలోచించండి’ అని ఇప్పటికే ఉక్రెయిన్‌ పరోక్షంగా భారత్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. భారతీయులంతా క్షేమంగా సరిహద్దులు దాటడం తమకు ఇష్టం లేదన్నట్లుగా సైనికులు వ్యవహరిస్తున్నారు. ‘‘రుమేనియా సరిహద్దు గేటు వద్ద భారతీయులు ఎక్కువ మంది లేనప్పుడే ఇదీ పరిస్థితి. మన వాళ్ల సంఖ్య పెరిగేకొద్దీ ఉక్రెయిన్‌ సైనికుల అరాచకాలు మరింత పెరిగాయి’’ అని క్షేమంగా తన సొంత ఊరు నెల్లూరుకు చేరుకున్న శ్రీచైతన్య తేజ తెలిపారు. ఇల్లు చేరి 24 గంటలు గడిచినా షాక్‌లోనే ఉన్నానని తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన సుదేశ్‌ మోహన్‌దీ ఇదే అనుభవం.  


ఆకలితో చనిపోతామనిపిస్తోంది: కార్తీకరుమేనియా చేరుకోవడానికి కన్సల్టెంట్లు బస్సులు ఏర్పాటు చేశారు. ఖర్చులు మేమే పెట్టుకున్నాం. అష్టకష్టాలు పడి రుమానియాలోని బుకారె్‌స్టకు చేరుకున్నాం.  నాలుగు రోజులుగా  విమానాశ్రయానికి పది కిలోమీటర్ల దూరంలోని ఒక షెల్టర్‌లో ఉన్నాం. రెండు రోజుల నుంచి ఆహారం లేదు. మా వద్ద ఉన్న బిస్కెట్లు తిని బతుకుతున్నాం. ఏదైనా కొనుక్కుందామనుకుంటే బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. యుద్ధంతో భయంతో కాదు... ఆకలి, మంచుకు చనిపోతామేమో అనిపిస్తోంది.’’ -కార్తీక, విజయవాడ

Ukraine Crisis: క్షణం క్షణం.. భయం భయం.. తెలుగు విద్యార్థుల వేదన!

ఇంటికి వెళ్తామా అని భయమేసింది

‘‘ఉక్రెయిన్‌లోని జానవిక్స్‌ ప్రాంతంలో మెడిసిన్‌ రెండో ఏడాది చదువుతున్నా. యుద్ధం మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయని, ఆహారం, నీళ్లు, డబ్బులు నిత్యావసర సరుకులు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏటీఎం వద్ద  5 గంటలు పడిగాపులు కాయాల్సి వచ్చేది. మన అధికారుల సహాయంతో... క్షేమంగా ఇంటికి చేరుకున్నాను!’’-సాయి స్కందన, ఆదోని, కర్నూలు జిల్లా


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.