Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్ఫ్‌ వెళ్లేదెలా? సమస్యంతా నిబంధనలతోనే..!

వలస పక్షులపై కరోనా ఎఫెక్ట్‌

జిల్లాకు తిరిగొచ్చిన 10 వేల మంది

ఏడాదిన్నర తర్వాత అందిన శుభవార్త

నేటి నుంచి గల్ఫ్‌ దేశాలకు అనుమతులు

పాతవారికే.. కొత్తవారికి నో ఎంట్రీ

వ్యాక్సిన సర్టిఫికెట్‌ తప్పనిసరి

మల్దీవ్‌లలో క్వారంటైనలలో ఉండాలి

పెరిగిన ఖర్చులతో సతమతం

నెల్లూరు (వైద్యం), ఆగస్టు 21:  కరోనా పుణ్యమా అని స్వదేశానికి చేరిన జిల్లావాసులు తిరిగి గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆదివారం నుంచి తిరిగి తమ దేశాలకు  రావొచ్చని ఆయా దేశాలు పేర్కొన్నా నిబంధనలు తలకుమించిన భారమయ్యాయి. ఉపాధి అవకాశాల కోసం ఎంతో మంది వివిధ రంగాలకు చెందిన కార్మికులు గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసి ఆయా దేశాలకు వెళ్లి ఎంతో కొంత సంపాదించి జిల్లాలోని కుటుంబ సభ్యులకు పంపించే వారు. అయితే కరోనా ప్రభావంతో దుబాయ్‌, కువైట్‌, సౌదీ అరేబియా, యుఏఈ, మస్కట్‌ వంటి గల్ఫ్‌ దేశాలలో  పనిచేస్తున్న కార్మికులను భారత వెళ్లాలని ఆయా దేశాలు ఆదేశించాయి. దీంతో జిల్లాకు చెందిన 10 వేల మంది కార్మికులు ఏడాదిన్నర క్రితం విడతల వారీగా తిరిగి వచ్చేశారు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ కొందరు.. గల్ఫ్‌లో సంపాదించి దాచుకున్నది ఖర్చు చేస్తూ గడిపారు. అయితే  అనేక మంది కార్మికులు తిరిగి ఆయా దేశాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి భారత నుంచి కార్మికులు రావచ్చని ఇందుకు విమానాలు అందుబాటులో ఉంచామని ఆయా గల్ఫ్‌ దేశాల నుంచి అనుమతులు లభించాయి. అయితే కొత్త వారు కాకుండా గతంలో పని చేస్తున్న వారే రావాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నాయి.  


సమస్యంతా నిబంధనలతోనే..

దుబాయ్‌, సౌదీ అరేబియా, కువైట్‌, యునైటెడ్‌ ఎమరేట్‌ గల్ఫ్‌ దేశాలలో జిల్లాకు చెందిన 30వేల మందికి పైగా వివిధ రంగాలలో అక్కడ పని చేస్తున్నారు. అయితే, కరోనా కారణంగా 10 వేల మంది తిరిగొచ్చేశారు. ఇప్పుడు తాము పని చేస్తున్న ప్రదేశాలకు వెళ్లేందుకు వీసా సిద్ధం చేసుకుని విమాన టిక్కెట్లు కొనే దశలో ఆయా దేశాలు ఎన్నో నిబంధనలు విధించింది. ప్రత్యేకించి సౌదీకి వెళ్లేందుకు చెన్నై నుంచి రూ.23 వేలు విమాన టిక్కెట్టుకు  వెచ్చించాలి. వ్యాక్సిన రెండు డోసులు వేసుకున్నట్టు సర్టిఫికెట్‌ అందజేయాలి. ఇదంతా బాగానే ఉన్నా సౌదీ అరేబియా మరో మెలిక పెట్టింది. చైన్నె విమానాశ్రయంలో మరోసారి కరోనా పరీక్ష చేయాలని నిబంధనలు విధించింది. నేరుగా సౌదీకి రాకుండా కరోనా ప్రభావం తక్కువగా ఉన్న మాల్దీవ్‌, దోహా, ఖత్తర్‌ దేశాలకు ముందుగా వెళ్లి అక్కడ 14 రోజులు క్వారంటైనలో ఉండాలి. రెండు వారాలపాటు అక్కడ హోటళ్లలో ఉండాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుంది. ఇంత పెద్ద మొత్తం ఎలా భరించాలో తెలియక కార్మికులు నానా అగచాట్లు పడుతున్నారు. మరోవైపు ఉపాఽధి కోసం కార్మికులు రావచ్చని కువైట్‌ ప్రకటించినా నిబంధనలు ఎలాంటివో స్పష్టం చేయలేదు. అరబ్‌ ఎమరేట్స్‌ (అబుదాబి, దుబాయ్‌, షార్జా) అనుమతులు రావడంతో అక్కడకు వెళ్లేందుకు జిల్లాకు చెందిన అనేక మంది దరఖాస్తు చేసుకోగా 75 శాతం మందికి అనుమతులు  లభించలేదు. దీంతో గల్ఫ్‌ దేశాలకు తిరిగి వెళ్లాలని అనుకున్న కార్మికులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. ప్రభుత్వం చొరవ చూపి బాధితులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. 


ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నా 

సౌదీ అరేబియాలోని జిద్దాలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ ఏడాదిన్నర క్రితం ఇక్కడకు వచ్చేశా.  ఈ నెల 22వ తేదీ నుంచి రావచ్చని సౌదీ ప్రకటన బాగానే ఉన్నా నేరుగా రాకుండా మాల్దీవ్‌, ఖత్తర్‌ వంటి కరోనా లేని దేశాలలో 14 రోజులు క్వారంటైనలో ఉండి రావాలని ఆంక్షలు విధించింది. దీనివల్ల మరో రూ. 2లక్షల వరకు అదనపు భారం భరించాలి. ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా పనుల్లేక దాచుకున్నదంతా ఖర్చు చేసేశాం. ఇప్పడు మళ్లీ అక్కడకు వెళ్లాలంటే అప్పులు చేయాల్సి వస్తోంది. -షేక్‌ మస్తానబాషా, వెంకటేశ్వరపురం, నెల్లూరు


నిబంధనలు చెప్పని కువైట్‌

కువైట్‌లో ఓ సేట్‌ దగ్గర కారు డ్రైవర్‌గా పని చేస్తూ గత ఏడాది నవంబరులో జిల్లాకు వచ్చాను. కొవిడ్‌ తగ్గడంతో తిరిగి రావాలని కువైట్‌ ప్రభుత్వం ఆహ్వానించినా ఎలాంటి నిబంధనలు పాటించాలో స్పష్టత లేదు. విమాన టిక్కెట్ల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కరోనా లేకపోయి ఉంటే అక్కడే 9 నెలల్లో కనీసం రూ.4 లక్షలయినా సంపాదించి ఉండే వాడ్ని. -సూరు మల్లిఖార్జున, అనంతసాగరం


మరళా వేళ్లేందుకు సిద్దంగా ఉన్నా

సౌదీలోని రియాద్‌లో ఐదేళ్లుగా బేల్దారి పని చేస్తున్నా.  9 నెలల క్రితం కరోనా కారణంగా భారతకు వచ్చేశాను. తిరిగి సౌదీ వెల్లేందుకు ముందుగా మాల్దీవ్‌లలో 14 రోజులు క్వారంటైనలో ఉండేందుకు సిద్ధపడి విమాన టికెట్లు బుక్‌ చేస్తున్నా. గతంలో కేవలం సౌదీకి వెళ్లేందుకు రూ.25 వేలు సరిపోయేవి. ఇప్పడు మాల్దీవ్‌లలో ఉండి వెళ్లాలంటే రూ.2.50 లక్షలు ఖర్చు అవుతుంది. విధిలేని స్థితిలో అప్పులు చేయాల్సి వస్తోంది. -ఎద్దులు రవితేజ, మర్రిపాడు మండలం, చిలకపాడు గ్రామం


జిల్లావాసులకు ఎన్నో ఇబ్బందులు

గల్ఫ్‌ దేశాలలో జిల్లాకు చెందిన వారు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్నారు. కరోనా కారణంగా 10 వేల మంది వరకు తిరిగి జిల్లాకు వచ్చారు. మరళా తిరిగి వెళ్లాలని కార్మికులు ఎదురు చూసినా ఆయా దేశాలు అనుమతులు ఇవ్వక పోవటంతో ఎదురు చూపులే దక్కాయి. ప్రస్తుతం వారికి సంబందించి వీసాలు సిద్దం చేశాం. విమాన టిక్కెట్లు కూడా కొనుగోలు చేస్తున్నాం. అయితే సౌధీ వంటి దేశాల నిబంధనలు వల్ల తిరిగి వెళ్లే కార్మికులకు ఆర్ధిక భారం 10 రేట్లు పెరిగి పోతుంది. చేసేది లేక కుటుంబాల సంరక్షణ కోసం తిరిగి వెలుతున్నారు. -ఎంఎస్‌ ఘని, రాయల్‌ అసోసియేట్స్‌, కన్సల్టెన్సీ, నెల్లూరు 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement