Telugu Expat: సౌదీలో ప్రవాస తెలుగు వ్యాపారి అరెస్టు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-28T12:56:05+05:30 IST

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా పార్టీ నిర్వహించిన ప్రవాసీ వ్యాపారిని సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు పది రోజుల తర్వాత అతడిని విడుదల చేశారు. సాధారణంగా గల్ఫ్‌ దేశాల్లో అనుమతి తీసుకోకుండా సభలు, సమావేశాలు..

Telugu Expat: సౌదీలో ప్రవాస తెలుగు వ్యాపారి అరెస్టు.. కారణం ఏంటంటే..

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిందుకే

ఎట్టకేలకు పది రోజుల తర్వాత విడుదల

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా పార్టీ నిర్వహించిన ప్రవాసీ వ్యాపారిని సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు పది రోజుల తర్వాత అతడిని విడుదల చేశారు. సాధారణంగా గల్ఫ్‌ దేశాల్లో అనుమతి తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధం. గల్ఫ్‌ దేశాల్లోని భారతీయ ఎంబసీలు సైతం స్ధానిక అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి, అనుమతి తీసుకున్నాకే సభలు, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. అయితే, రియాద్‌లో హైదరాబాదీ వంటకాలు వడ్డించే గ్రూప్‌ రెస్టారెంట్ల నిర్వాహకుడు.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వేడుకల గురించి ప్రచారం చేశారు. హైదరాబాదీలు అధికంగా నివసించే హరా ప్రాంతంలోని తన రెస్టారెంట్‌లో ఆగస్టు 15న రాత్రి ఆనందోత్సవాల మధ్య కేక్‌ కట్‌ చేస్తుండగా సౌదీ పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో అక్కడకు వచ్చిన వారు కూడా గుట్టుచప్పుడు కాకుండా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అతడి తరఫున కొందరు స్థానికులు ఉన్నతాధికారులతో మాట్లాడగా, రెండు రోజుల క్రితమే అతడిని విడుదల చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కార్యక్రమానికి అతిథులుగా వెళ్లిన వారిని కూడా పోలీసు అధికారులు ప్రశ్నించారని తెలిసింది.


అంతేకాదు.. భారత త్రివర్ణ పతాకంపై రెస్టారెంట్‌ పేరును రాసి ప్రదర్శించడం ద్వారా జాతీయ పతాక చట్ట ఉల్లంఘనకు ఆ వ్యక్తి పాల్పడ్డాడని ఆ వర్గాలు చెప్పాయి. దీనిపైనా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. సౌదీలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది మక్కాలో ఒక భారతీయ మహిళ త్రివర్ణ పతాకాన్ని పట్టుకోని ఫొటో దిగినందుకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆ ఫొటోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయకపోవడంతో ఐదు రోజుల తర్వాత విడుదల చేశారు.

Updated Date - 2022-08-28T12:56:05+05:30 IST