ఓటీటీల వైపు మన కెప్టెన్లు!

ABN , First Publish Date - 2020-08-16T05:30:00+05:30 IST

ఒకప్పటి సినిమాల లెక్క వేరు. ఇప్పుడొస్తున్న సినిమాల లెక్క వేరు. పెరుగుతున్న మాధ్యమాల వల్ల మేకర్స్‌లో పోటీ పెరుగుతోంది. వేదిక ఏదైనా తమని తాము నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు...

ఓటీటీల వైపు మన కెప్టెన్లు!

ఒకప్పటి సినిమాల లెక్క వేరు. ఇప్పుడొస్తున్న సినిమాల లెక్క వేరు. పెరుగుతున్న మాధ్యమాల వల్ల మేకర్స్‌లో పోటీ పెరుగుతోంది. వేదిక ఏదైనా తమని తాము నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు విభిన్న కథాంశాలతో దుమ్మురేపిన సినీ కెప్టెన్లు ఇప్పుడు ఓటీటీల్లో అదరగొట్టడానికి సిద్థమవుతున్నారు. కొందరు దర్శకత్వం వహిస్తుంటే... ఇంకొందరు కథలు, కథా సహకారం అందిస్తూ, నిర్మాణంలోనూ భాగస్వాములవుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ ఎలా ఉందో  ఓ లుక్కేద్దాం...



భవిష్యత్తుకు నాందిగా... 

‘డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌దే ఫ్యూచర్‌’ అని దేవకట్టా నాలుగేళ్ల ముందే చెప్పారు. అందుకు నాందిగా ఆయన యప్‌ టీవీతో కలిసి లక్ష్మణ్‌ కార్య దర్శకుడిగా ‘ఎందుకిలా’ వెబ్‌సిరీస్‌ నిర్మించారు. అప్పట్లో ట్రెండ్‌ అయిన సిరీస్‌ అది. రొటీన్‌గా వచ్చే రొమాంటిక్‌ కామెడీ కథల్ని వెబ్‌సిరీ్‌సకి తీసుకొస్తే మెయిన్‌ స్ర్టీమ్‌ సినిమా కథలు బలపడతాయని ఆయన నమ్మకం. దాంతోనే నెట్‌ఫ్లిక్స్‌లో విజయం సాధించిన ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’, ‘హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌’ ఇన్స్‌పిరేషన్‌తో కొన్ని సిరీ్‌సలు చేయాలనుకున్నారు. అవి కార్యరూపంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వై.ఎ్‌స.రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు మధ్య మైత్రీ, రాజకీయ వైరం నేపథ్యంలో ‘ఇంద్రప్రస్థం’ రూపొందించనున్నారు. అయితే ఇది వెబ్‌ సిరీ్‌సకు, ఫీచర్‌ సినిమాకు సరిపడే కథ. బడ్జెట్‌ లెక్కలు కూడా చూసుకొని ఎలా విడుదల చేయాలో ప్లాన్‌ చేసుకుంటారని సమాచారం. అలాగే అమేజాన్‌, మహేశ్‌బాబు జీఎమ్‌బీ సంస్థల్లో ఓ  వెబ్‌ సిరీస్‌ చేయడానికి దేవకట్టా ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొదటి సీజన్‌కు 80 శాతం కథ సిద్ధమైంది.  ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి. 


ముందే ఊహించిన నందిని...

ఓటీటీలు ప్రారంభం కాకముందే డిజిటల్‌ మీడియా అభివృద్ధి చెందుతుందని, వెబ్‌ సిరీ్‌సల హవా పెరుగుతుందని ఊహించారు నందినీరెడ్డి. అందుకే వెబ్‌ సిరీ్‌సలు చేసిన దర్శకుల గురించి మాట్లాడుకుంటే.. తొలుత ప్రస్తావించాల్సిన పేరు నందినీరెడ్డి. 2017లోనే ‘మన ముగ్గురి లవ్‌స్టోరీ’ కథ రాసి శశాంక్‌ ఏలేటి దర్శకుడిగా యప్‌ టీవీ కోసం ఈ సిరీస్‌ అందించారు. 2018లో ‘గ్యాంగ్‌స్టార్స్‌’ అనే వెబ్‌సిరీ్‌సను రూపొందించారామె! 12 ఎపిసోడ్‌లతో రెండేళ్ల క్రితం క్రైమ్‌ డ్రామాగా రూపొందిన ఈ సిరీ్‌సకు అప్పట్లో మంచి స్పందనే వచ్చింది. అజయ్‌ భుయాన్‌ ఈ సిరీ్‌సగా దర్శకత్వం వహించగా జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేశ్‌ తదితరులు నటించారు. 


‘మస్తీ’ చేశారు...

కథాబలం, భావోద్వేగం ఉన్న సినిమాలు తీయడంలో క్రిష్‌కు ప్రత్యేకశైలి ఉంది. సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కూడా వెబ్‌ సిరీ్‌సలపై ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ‘మస్తీస్‌’ వెబ్‌సిరీ్‌సతో ఓటీటీలోకి అడుగు పెట్టారు. వేర్వేరు నేపథ్యాలున్న ఆరుగురు వ్యక్తుల కథ ఇది. ఎనిమిది ఎపిసోడ్‌లుగా ‘ఆహా’లో విడుదలైన ఈ సిరీ్‌సకు చక్కని స్పందనే వచ్చింది. క్రిష్‌ రూపకల్పనలో అజయ్‌ భుయాన్‌ దర్శకత్వం వహించారు.  నవదీప్‌,  బిందు మాధవి, హెబ్బా పటేల్‌, చాందినీ చౌదరి నటించారు. 


పూరి తరహాలో...

ఊర మాస్‌ హీరోయిజం, పంచ్‌ డైలాగ్‌లు, మత్తెక్కించే నాయికలు.. ఈ కాంబినేషన్‌ వినగానే గుర్తొచ్చే దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆయన కథలు ఓటీటీలకు అద్భుతంగా ఉంటాయని అభిమానులు చెబుతుంటారు. ప్రస్తుతం పూరి కూడా వెబ్‌ సిరీ్‌సలు, ఓటీటీల మీద దృష్టి పెట్టినట్లు ఇటీవల ఛార్మి తెలిపారు. తమ ప్రొడక్షన్‌ హౌస్‌లో వెబ్‌ సిరీ్‌సలు చేస్తామని.. దానికి సంబంధించి పూరీ స్ర్కిప్టులు సిద్థం చేస్తున్నారని ఆమె వెల్లడించారు. 40-50 రోజుల్లో సినిమా పూర్తి చేసే టాలెంట్‌ ఉన్న పూరీ.. వెబ్‌ సిరీ్‌సను ఎన్ని రోజుల్లో తీస్తారో.. చూడాలి! 


యాక్షన్‌ డ్రామా ‘ఫ్యామిలీ మ్యాన్‌’...

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌ హిందీలో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! యాక్షన్‌ డ్రామాగా ఆసక్తికరంగా రూపొందిన ఈ సిరీ్‌సలో సమంత అక్కినేని, ప్రియమణి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రలు పోషించారు. మొదటి సీజన్‌కు ఓటీటీలో వినూత్నమైన స్పందన లభించింది. రెండో సీజన్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


తేజ కూడా అదే బాటలో...

దర్శకుడు తేజ కూడా ఓటీటీ బాట పట్టారు. ‘ష్‌.. టోరీస్‌’ పేరుతో ఓ వెబ్‌సిరీ్‌సను ఆయన డైరెక్ట్‌ చేస్తున్నారు. బోల్డ్‌, మోడ్రన్‌ కంటెంట్‌తో ఈ చిత్రం ఉండబోతుందని, మొదటి ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే మిగిలిన ఎపిసోడ్‌ల షూట్‌ మొదలువుతుంది. 


మేర్లపాక ఓటీటీ ఎక్స్‌ప్రెస్‌...

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ ఫేం మేర్లపాక గాంధీ ప్రస్తుతం నితిన్‌ హీరోగా ‘అంధాధూన్‌’ రీమేక్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ పనులతో బిజీగా ఉంటూనే ఓ వెబ్‌ సిరీ్‌సకు కథ సిద్థం చేశారట. ఆయన డైరెక్షన్‌ టీమ్‌లో అసోసియేట్‌గా పని చేస్తున్న ఒకరు ఈ సిరీ్‌సకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ‘ఆహా’ ఓటీటీ కోసం ఈ ిసిరీ్‌సను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అడల్ట్‌ కామెడీ జోనర్‌లో యూత్‌ను ఆకట్టుకునేలా ఉండే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం సమంతను సంప్రదించారని తెలిసింది. 

నో డైరెక్షన్‌... ఓన్లీ పాయింట్‌...

హీరో అభిమానుల మనసు దోచుకోవడంలో దిట్ట దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఆయన తిక్క, లెక్కతో స్టార్‌లతోనే కాదు.. యువ హీరోలతో కూడా సినిమా తీసి హిట్‌ కొట్టగల కెపాసిటీ ఆయనది. ఇప్పుడు అదే కిక్‌తో వెబ్‌ సిరీ్‌సల కోసం ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు హరీశ్‌ శంకర్‌. అయితే ఈసారి ఆయన దర్శకత్వం వహించడం లేదు, కథ కూడా సిద్థం చేయడం లేదు. ఓ పాయింట్‌ అనుకొని... తన టీమ్‌తో కథ సిద్థం రెడీ చేయిస్తున్నారు. కథ సిద్ధమయ్యాక ఆయనెలాగూ మార్పులు చేర్పులు చేస్తారు. అయితే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ కోసం ఆయన చేసే ప్రయోగం ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


డైరెక్టరా.. క్రియేటరా?

ఓటీటీలో తెలుగు వెబ్‌సిరీ్‌సలు ప్రారంభమైన కొత్తలో ఎక్కువగా వినిపించిన పేరు మారుతి. ‘ఆహా’ యాప్‌ కోసం ఆయన వెబ్‌సిరీస్‌ రూపొందిస్తున్నారనే వార్తలు వినిపించాయి. అయితే మారుతి వీటికి దర్శకత్వం వహించే పని పెట్టుకోకుండా నిర్మాణ బాధ్యతలు మాత్రమే తీసుకున్నారట. అయితే ఇప్పటికే రెండు, మూడు కథలు విన్నారని తెలుస్తోంది. ఆసక్తికర కథ దొరికితే వెబ్‌ సిరీ్‌సని డైరెక్ట్‌ చేస్తారా లేక క్రియేటర్‌గా మారతారా అన్నది చూడాలి. 


దృశ్యకావ్యంలా ‘మైదానం’..

చలం ‘మైదానం’ నవల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో చర్చించడానికి భయపడే అంశాన్ని నేపథ్యంగా తీసుకుని చలం రాసిన ఆ నవల ఇప్పటికీ హాట్‌ టాపిక్కే. తాజాగా ఆ నవలకి దృశ్యరూపం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటీటీలో ‘మైదానం’ను వెబ్‌

సిరీ్‌సగా తీసుకురావడానికి యువ దర్శకుడు వేణు ఊడుగుల సిద్థమవుతున్నారు.  ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా పరిచయమై ‘విరాటపర్వం’ తెరకెక్కిస్తున్న ఆయన నిర్మించే ఈ సిరీస్‌ ‘ఆహా’ ఓటీటీలో రాబోతోంది. 


సుధీర్‌ మార్క్‌తో..

సుదీర్‌ వర్మ సినిమా అంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా తన మార్కు చూపించడానికి సుధీర్‌ సిద్థమవుతున్నారు. నవీన్‌ చంద్ర హీరోగా డార్క్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పది ఎపిసోడ్‌లుగా ఓ సిరీస్‌ ప్లాన్‌ చేస్తున్నారాయన. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తయింది. థ్రిల్లర్‌ సినిమాలకు ఓటీటీలో చక్కని ఆదరణ ఉంది. ఈ సిరీస్‌ కూడా ‘ఆహా’లోనే అందుబాటులో ఉంటుందట. 


నలుగురు దర్శకులతో... 

‘లస్ట్‌ స్టోరీస్‌’ హిందీలో ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే! సమాజంలో చర్చించడానికి ప్రజలు భయపడే, మొహమాట పడే అనేక అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ సిరీస్‌ తెలుగులో కూడా రానుంది. నాలుగు భాగాలుగా రూపొందుతున్న దీనికి తెలుగులో నందినీరెడ్డి, సంకల్ప్‌ రెడ్డి, నాగ అశ్విన్‌, తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారని వినికిడి. ఈ నలుగురు పని చేసే తీరు డిఫరెంట్‌గా ఉంటుంది. మరి బోల్డ్‌గా ఉండే ‘లస్ట్‌ స్టోరీ్‌స’ను ఈ నలుగురు దర్శకులు ఎలా తెరకెక్కించారో చూడాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! 

వీళ్లు మాత్రమే కాకుండా సుకుమార్‌,వంశీ పైడిపల్లి, సురేందర్‌ రెడ్డి, రాహుల్‌ రవీంద్రన్‌. సందీప్‌ రెడ్డి వంగా లాంటి దర్శకులు కూడా ఓటీటీ బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు. 





మెట్రో కథలతో...

‘పలాసా 1978’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కరుణకుమార్‌. తాజాగా ‘మెట్రో కథలు’ వెబ్‌ ఫిల్మ్‌ తీశారు. మెట్రో లైఫ్‌లోని నాలుగు విభిన్న కథలను తీసుకుని ఆయన ఈ సినిమా తీశారు. రాజీవ్‌ కనకాల, సనా, నక్షత్ర, తిరువీర్‌, అలీరెజా కీలక పాత్రధారులు. ఇటీవల ‘ఆహా’లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుంది.

- ఆలపాటి మధు

Updated Date - 2020-08-16T05:30:00+05:30 IST