Abn logo
Feb 27 2021 @ 13:52PM

ఘనంగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 163వ సాహిత్య సదస్సు

త్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' 163వ సాహిత్య సదస్సు ఈ నెల 21న వర్చువల్‌గా ఘనంగా జరిగింది. ఈ సాహితీ సదస్సుకు ముఖ్య అతిథిగా పీవీ శేషరత్నం విచ్చేసారు. మాతృ భాషాదినోత్సవం కూడా అదేరోజు కావడం సభికులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల పాడిన "శ్రీతులసి ప్రియ తులసి జయము నీయవే" అన్న గేయంతో సభ ప్రారంభమైంది. ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీమాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మన తెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహారెడ్డి కొన్నిపొడుపు కథలు, జాతీయాలు ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలో భాగస్వాములను చేశారు. 

ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన మహాభారత విరాటపర్వంలోని “ఎవ్వని వాకిటని భమదపంకంబు” అన్నపద్యం యొక్క తాత్పర్యసహిత విశేషాన్ని వివరించారు. “రాజభూషణ రజోరాజిన్” వంటి సమాస ప్రయోగాలు తిక్కనార్యుని కవితా వైభవాన్ని పతాకస్థాయికి ఎలా చేర్చాయో ఉపద్రష్ట వివరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షకకు కొనసాగింపుగా ఫిబ్రవరి మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులు, ఎందరో మహానుభావులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. దీనిలో భాగంగా డా. అరుణ కోల పాలగుమ్మి పద్మ రాజు కథారచనా వైశిష్టాన్నికీర్తించారు. తరువాతి అంశంగా మాడ దయాకర్ పుస్తక పరిచయం చేస్తూ డాక్టర్ కేశవరెడ్డి రచించిన “అతడు అడవిని జయించాడు” అన్న నవల ఎందుకు విశిష్ఠమైనదో, ఎన్నో ఇతర భాషలలో అనువాదం పొందడం వెనుక అర్హతలేమిటో వివరిస్తూ ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు. లెనిన్ వేముల మాతృ భాషదినోత్సవం సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిన కొన్ని పద్యాలను గానం చేయడం జరిగింది. 

ముఖ్య అతిథి పీవీ శేషరత్నంను అన్నపూర్ణ నెహ్రూ సభకు పరిచయం చేశారు. అతిథి గురించి కొన్ని మాటలు పంచుకున్నారు. “ఆంధ్రభూమి దిన పత్రికలో రెండేళ్ల పాటు 'ప్రియదర్శిని మహిళా పేజి' నిర్వహించడముతో పాటు, వీరి పలు నాటకాలు రేడియోలోను, టీవీలోనూ ప్రసారమయ్యయి. ‘అమ్మకథలు - కథా సంకలనము', 'అక్షరం' నవల విశ్వవిద్యాలయ విద్యార్థుల చేపరిశోధనాంశముగా ఎంపిక చేయబడ్డాయి. మరికొన్ని కథలు తెలుగు అకాడెమి వారి కథాకోశంలో చోటుచేసికొన్నమరెన్నోవిశిష్టతలు కలిగి వున్నాయని” తెలిపారు. 

ఈ మాసపు సాహిత్యసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పీవీ శేషరత్నం “ఆకాశవాణి - నా అనుభవాలు ’’ గురించి ప్రసంగములో వివరించారు. ఆకాశవాణి సంస్థతో ఆమెకు ఉన్నసుదీర్ఘ అనుబంధాన్ని, వ్యాఖ్యాతగా రచయిత్రిగా విశేషమైన రీతిలో వివరించి సభికులను ఆకట్టుకున్నారు. జనులందరికీ హితాన్ని విజ్ఞాన విశేషాలనూ, వినోదాన్ని అందించడమే ఆశయంగా కలిగిన ఆకాశవాణి కేవలం బయటకు కనిపించే ఒకరేడియో పెట్టెకాదనీ, విశాలమైన ఒక గొప్ప వ్వవస్థ అనీ నొక్కి చెప్పారు. భాషా, సంస్కృతుల సంరక్షణ సేవలో విశేషపాత్ర కలిగి ఉన్న ఆకాశవాణి తన రచనా జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందీ.. ఏయే సాఫల్యాలకు దారితీసిందీ ఆకర్షణీయంగా సభికులకు వివరించారు. పాత్రల చలనం ద్వారా నవరసాలు వ్యక్తపరచేది దృశ్యనాటకమైతే, కేవలం పాత్రల కంఠస్వరాల ద్వారా నేరసపోషణ సాధించేది ఆకాశ వాణి రంగమని ప్రథానవక్త కొనియాడారు. ఆయా రకాల కార్యక్రమాలలో వ్యాఖ్యాతలు ఏయే విధంగా వాయిస్ మాడ్యులేషన్ మార్చుతారో చేసి వినిపించారు.


ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు లక్ష్మిఅన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పాచి తదితర కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు, స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గము ముఖ్య అతిథికి పీవీ శేషరత్నంను సన్మానించి ఒక జ్ఞాపికను అందజేశారు. నీరజా కుప్పాచి అతిది జ్ఞాపికను అందరికి చదివి వినిపించారు. “నాలుగు దశాబ్దాలు ఆకాశవాణి విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలలోవాచకురాలిగా గళం వినిపించి, మనసు మురిపించడమేకాకుండా పది కథా సంకలనాలు, పన్నెండు నవలలు మరెన్నో నాటికలు రచించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి, న్యూఢిల్లీ ఆకాశవాణి జాతీయ వార్షిక పోటీలలో 'జీవని' నాటకీకరణకు ప్రథమ బహుమతి.. స్వాతి అనిల్ అవార్డు.. 'అక్షరం' నవలకు, 'పట్టుపురుగు' కథకు వంగూరి ఫౌండేషన్ వారి పోటీలలో ‘మాయ సోకని పల్లె' కథకు ప్రథమ బహుమతి మరికొన్ని కథలకు సీపీ బ్రౌన్ అకాడమీ వారి బహుమతులు గెలుచుకున్న ప్రతిభాశాలి అని వివరించారు. చివరిగా సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి గారు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
Advertisement
Advertisement