వ్యాక్సిన్‌పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి

ABN , First Publish Date - 2021-05-11T08:52:35+05:30 IST

వ్యాక్సినేషన్‌పై వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌ ప్రత్యేక అధికారులతో సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

వ్యాక్సిన్‌పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి

నెలకు కోటి వ్యాక్సిన్లు అందిస్తే 6 నెలల్లో ప్రక్రియ పూర్తవుతుంది

ఇప్పుడు నెలకు వస్తోంది 19 లక్షలే

టీకాలు రాష్ట్రం చేతుల్లో ఉండవు

104 వ్యవస్థ మరింత బలోపేతం

కొవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

గ్లోబల్‌ టెండర్‌పై నిర్ణయం తీసుకోండి


అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సినేషన్‌పై వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌ ప్రత్యేక అధికారులతో సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో  సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం లో అనుసరిస్తున్న కొవిడ్‌ నియంత్రణ విధానాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఇతర రాజకీయపక్షాల నేతలు  చేస్తున్న విమర్శలపై ఈ సందర్భంలో పరోక్షంగా జగన్‌ స్పందించారు. ‘‘వ్యాక్సినేషన్‌ ఉత్పత్తి, లభ్యత అనేవి రాష్ట్ర పరిధిలోవి కాదు. ఒకవేళ రాష్ట్రం కొనుగోలు చేయాలనుకున్నా ఎన్ని అమ్మాలో కేంద్రమే నిర్ణయిస్తుంది. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లను అమ్మాలో కంపెనీలకు కేంద్రమే చెబుతుంది. కేంద్ర కోటా మేరకే రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసినా కొందరు వ్యక్తులు, ఒకవర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. కావాలనే ప్రజల్లో ఆందోళనను, భయాన్ని కలిగిస్తున్నారు. దీనిపై వాస్తవ పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి. అందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా అందుతుందన్న భరోసా కల్పించాలి’’ అని అని సీఎం జగన్‌ ఆదేశించారు. వ్యాక్సిన్‌ కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. 


వస్తోంది 19 లక్షలే..

నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, ఈ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయగలమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటున 19 లక్షల డోసులు మాత్రమే వస్తున్నాయని వివరించారు. రాష్ట్రానికి అందిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను తొలిడోస్‌ కింద 43,99,802, రెండో డోస్‌ కింద 18,87,318 ఇచ్చామని అధికారులు తెలిపారు. అదేవిధంగా కొవాగ్జిన్‌ డోస్‌ల్లో తొలిడోస్‌ కింద 9,02,395, రెండో డోస్‌ కింద 2,90,047 అందించామన్నారు. 45 ఏళ్ల పైబడ్డవారు మొత్తం 1,33,07,889 మంది నమోదు చేసుకోగా.. వారిలో తొలిడోసు 41,08,917 మందికి, రెండో డోసు 13,35,744 మందికి ఇచ్చామని అధికారులు వివరించారు. మే నెలలో గడిచిన15 రోజులకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ కలిపి 9,17,850 డోసులు ఇస్తామని కేంద్రం తెలిపిందని, ఇప్పటివరకూ 7,65,360 డోసులు పంపిందని, మరో 1,52,690 డోసులు రావాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.  104కు ఫోన్‌ చేసిన వెంటనే స్పందన ఉండాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వారికి వెంటనే బెడ్‌ కేటాయించాలన్నారు. కోవిడ్‌ బాధితుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  బెడ్‌ అవసరం లేదనుకుంటే కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపాలని, ప్రతి ఆస్పత్రిలోనూ ఆరోగ్య మిత్ర ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 


రెమ్‌డెసివిర్‌పై ఆడిటింగ్‌

వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రద్దీ, తోపులాట కనిపించకూడదని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. టీకాలు ఎవరికి వేస్తారనేది ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రజలకు చెప్పాలన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోసు అందేలా చూడాలన్నారు.  పీఎ్‌సఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు.  రెమ్‌డెసివిర్‌  ఇంజక్షన్లు బ్లాక్‌ మర్కెట్‌కు తరలించకుండా చూడాలని .. వాటి వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆడిటింగ్‌ ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Updated Date - 2021-05-11T08:52:35+05:30 IST