Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అమెరికా రాజకీయాల్లో... మన పద్మం!

twitter-iconwatsapp-iconfb-icon
అమెరికా రాజకీయాల్లో... మన పద్మం!

ఈ ఫొటోలో వంట చేస్తున్నదెవరని ఆశ్చర్యపోతున్నారా? ఆమె పేరు పద్మ కుప్పా. అమెరికాలో మిషిగాన్‌ రాష్ట్ర ప్రతినిధి. అమెరికా ప్రజలు నేరుగా ప్రతి ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొన్న అతి కొద్ది మంది భారతీయుల్లో ఆమె కూడా ఒకరు. వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ చదువుకొని... అమెరికాలో మాస్టర్స్‌ చేసి... ప్రజా సేవ కోసం ఉద్యోగాన్ని వదలుకొన్న పద్మ ప్రస్థానం - మన తెలుగు వారి చొరవకు ప్రత్యక్ష నిదర్శనం. తల్లితండ్రులను చూడటానికి హైదరాబాద్‌కు వచ్చిన పద్మ తన జీవిత ప్రస్థానం గురించి... అమెరికాలో రాజకీయ వ్యవస్థ... దాని పనితీరు గురించి ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఆ విశేషాలలోకి వెళ్తే..


నాన్నగారు కుప్పా శ్రీనివాస శాస్త్రి ఇంగ్లీషు ప్రొఫెసర్‌. అమ్మ ఉష సీసీఎంబీలో డిప్యూటీ డైరక్టర్‌ హోదాలో పనిచేసి రిటైరయ్యారు. నాన్నగారు నా చిన్నతనంలో అమెరికాలో పనిచేయటానికి వెళ్లారు. దీంతో నా బాల్యమంతా అమెరికాలోనే గడిచింది. ఆ తర్వాత మేము హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాం. నేను అప్పటి ఆర్‌ఈసీ (ఇప్పుడు ఎన్‌ఐటీ)లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివా. అప్పట్లో ఆ కోర్సులో అమ్మాయిలు చాలా తక్కువగగా ఉండేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత... చాలామంది మాదిరిగానే నేను కూడా మాస్టర్స్‌ చదువుకోటానికి అమెరికాకు వెళ్లాను. ఆ తర్వాత ఉద్యోగంలో చేరా. అప్పట్లో నేను రకరకాల ఇమిగ్రేషన్‌ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 


దాదాపు అదే సమయంలో నాకు వివాహమయింది. నా భర్త పేరు సుధాకర్‌ తాడేపల్లి. ఆయన కూడా ఇంజనీరే. కొద్దికాలం నూయార్క్‌లో పనిచేసిన తర్వాత సుధాకర్‌కు మిషిగాన్‌లో ఒక ఆఫర్‌ వచ్చింది. అక్కడ అనేక ఆటో పరిశ్రమలు ఉంటాయి. దాన్ని ‘అమెరికా ఆటో కేపిటల్‌’ అని కూడా పిలుస్తూ ఉంటారు. నేను మెకానికల్‌ ఇంజనీర్ని కాబట్టి - నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నేను కూడా అక్కడే ఉద్యోగంలో చేరా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- మొదట్లో నా జీవితం కూడా ఒక సామాన్య ఎన్నారైలాగే గడిచిపోయింది. నేను ఒక పబ్లిక్‌ ఆఫీసు కోసం పోటీ చేస్తానని కానీ... దానిలో గెలిచి ప్రజా ప్రతినిధిని అవుతానని కానీ ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. కొన్ని సంఘటనలు నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. 

అనుకొని సమస్యలు..

మిషిగాన్‌కు వచ్చిన తర్వాత నాకు ఇంటా, బయట పని ఒత్తిడి బాగా పెరిగింది. అంతే కాకుండా మా ఇద్దరు పిల్లలు ‘డే కేర్‌’ ఉండలేకపోయేవారు. తరచూ వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేవి. అమ్మ, నాన్నలకు నా దగ్గరకి వచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో నా కాలికి గాయమై, సర్జరీ చేయాల్సి వచ్చింది. ఎటువంటి సపోర్టు లేకపోవటంతో- నేను ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి, అమెరికాలో సెటిల్‌ అవాలనుకొనేవారు ఇలాంటి కష్టాలు పడక తప్పదు. అయితే చాలా మంది తమ జీవితంతో సంతృప్తి చెందుతారు. మిగిలిన పనులేవీ పెట్టుకోరు. కానీ మానసికంగా, శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయాలి. లేకపోతే మన జీవితానికి ఎటువంటి అర్ధం ఉండదు. అందుకే ఏదో ఒక సామాజిక సేవ చేయాలని అనుకున్నా. దాదాపు ఇదే సమయంలో అమెరికాపై ఉగ్రదాడులు జరిగాయి. దీంతో ఆసియా నుంచి వచ్చిన ప్రజలపై వివక్ష బాగా పెరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. 


ఒక సగటు అమెరికా పౌరుడికి భారత్‌కు, పాకిస్థాన్‌కు, బంగ్లాదేశ్‌కు మధ్య తేడా తెలియదు. వారికి సంబంధించినంత వరకూ అందరూ ఒకటే! దీని వల్ల మన వాళ్లు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడి ప్రజలకు భారతదేశం.. భారతీయ సంస్కృతుల పట్ల అవగాహన లేకపోవటం అనేక సమస్యలకు దారితీస్తోందని అర్థమయింది. ఇలాంటి సమయంలో ఒక రోజు నేను మా పిల్లల స్కూలుకు వెళ్లా. అక్కడ నేను ఇండియన్‌ని అని చెబితే- వారు అమెరికాలో ఉండే ‘నేటివ్‌ ఇండియన్‌’ని అని అర్థం చేసుకున్నారు. నాకు సమస్య అర్థమయింది కాబట్టి వారికి మన సంస్కృతి, సంప్రదాయాల గురించి వారికి అవగాహన కల్పించాలనుకున్నా. స్కూలుకు వెళ్లి అక్కడ పిల్లలకు మన పండగల గురించి చెప్పేదాన్ని. ముగ్గులు ఎలా వేయాలో, మట్టితో ప్రమిదలు ఎలా చేయాలో నేర్పించేదాన్ని. నెమ్మదిగా నాతో పాటుగా అనేక మంది వలంటీర్లుగా మారారు. మేము కేవలం స్కూళ్లలోనే కాకుండా అనేక ఇతర సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాళ్లం.


అలాగే మిషిగాన్‌లో ప్రజల కోసం ఇంటర్‌ ఫెయిత్‌ ఆర్గనైజేషన్‌ ఒకటి ప్రారంభించాం. మన దేశం నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది హిందువులే ఉంటారు. వారి ఆచార వ్యవహారాలు చాలా మందికి తెలియవు. ఇక అమెరికాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలిస్తే- మనల్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాం. దీనికి మంచి ఆదరణ లభించింది. దీని ద్వారా హిందూ- అమెరికన్‌ ఫౌండేషన్‌లో కూడా చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టా. ఆ సమయంలో వీహెచ్‌పీ సంస్థ అమెరికాలో వరల్డ్‌ హిందూ కాంగ్రెస్‌ను నిర్వహించింది. దానికి నేను హాజరయ్యా. ఆ సమావేశానికి భారత్‌ నుంచి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చారు. 


ఆమెను ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ- ‘‘రాజకీయాలు చాలా డర్టీ కదా... మనం వాటిలోకి ఎలా వెళ్లగలం?’’ అని ప్రశ్నించింది. అప్పుడు నిర్మలా సీతారామన్‌- ‘‘మనం మహిళలం. చెత్తను శుభ్రం చేయటం మనకు కొత్త కాదు కదా.. మనం రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడున్న చెత్తను తుడిచేద్దాం’’ అని సమాధానమిచ్చారు. ఆమె ఆలోచన నాకు ఎందుకో చాలా నచ్చింది. నేను చేసిన సేవా కార్యక్రమాల వల్ల మిషిగాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పరిచయమవటం మొదలుపెట్టారు. కొందరైతే - ‘నువ్వు పబ్లిక్‌ ఆఫీస్‌కు ఎందుకు పోటీ చేయకూడదు?’ అని అడిగేవారు. వారు అలా అడుగుతుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించేది. ఎందుకంటే మా ఇంట్లో, మా ఆయనా వాళ్లింట్లో అందరూ చదువుకున్నవారే! ఎవరికీ రాజకీయ వాసనలు లేవు. ‘అలాంటి నేను రాజకీయాల్లోకి రావటమా?’ అనుకొనేదాన్ని. 


అమెరికా రాజకీయాల్లో... మన పద్మం!

అమెరికా రాజకీయం వేరు...

అమెరికాలో డెమొక్రాటిక్‌, రిపబ్లికన్‌ అని రెండే పార్టీలు ఉంటాయి. మన దేశంలో మాదిరిగా వందల పార్టీలు ఉండవు. అక్కడి రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది తాము నమ్మిన ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారటం చాలా అరుదుగా జరుగుతుంది. మిషిగాన్‌  రిపబ్లికన్లకు పెట్టని కోట. చాలా ఏళ్లుగా వారే గెలుస్తున్నారు. నేను సేవా కార్యక్రమాలు చేసే సమయంలో నాకు ఏ పార్టీ పట్ల పెద్ద అభిమానం లేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏదో ఒక పార్టీలో చేరాలి. అది మనం నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి. 2016లో బెట్సే దివోస్‌ అనే వాణిజ్యవేత్త ఎడ్యుకేషన్‌ సెక్రటరీ (విద్యా శాఖ మంత్రి) అయ్యారు. ఆవిడ పెద్దగా చదువుకోలేదు. ఆవిడ పిల్లలు ఎప్పుడూ పబ్లిక్‌ స్కూళ్లలో చదువుకోలేదు. ప్రైవేట్‌ స్కూళ్లకు ఊతంగా నిలిచే రిపబ్లికన్‌ పార్టీ తరపున ఆమె ఎడ్యుకేషన్‌ సెక్రటరీ అయ్యారు. ఆమె నియామకం నాలో అనేక ఆలోచనలు రేకెత్తించింది. అమెరికాను నిర్మించింది మధ్య తరగతి ప్రజలే. భారత్‌, చైనా, బ్రెజిల్‌ - ఇలా అనేక దేశాల నుంచి వచ్చిన కోట్ల మంది వలస ప్రజల కలల ప్రపంచం అది. వారి పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లలేరు. 


పబ్లిక్‌ స్కూళ్లలోనే చదువుకోగలుగుతారు. వారికి అండగా నిలబడాలంటే - పబ్లిక్‌ ఎడ్యుకేషన్‌కు మద్దతు ఇచ్చే పార్టీలో చేరాలనుకున్నా. డెమొక్రాటిక్‌ పార్టీలో చేరా. అప్పటికే నన్ను మిషిగాన్‌లో ఉన్న అనేక మంది ఎన్నికల్లో పోటీ చేయమని అడిగేవారు. ఇంటి బాధ్యతలు, పిల్లల చదువు, సేవా కార్యక్రమాలు- ఈ మూడింటితోనే నా సమయమంతా సరిపోయేది. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పైగా ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఖర్చుతో కూడి పని. ఒక స్టేట్‌ రిప్రజెంటేటివ్‌గా పోటీ చేయాలంటే కనీసం 2.5 లక్షల డాలర్లు (సుమారు రెండు కోట్ల రూపాయలు) ఖర్చు అవుతుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయమని స్నేహితుల ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రతినిధిగా పోటీ చేయాలని నిర్ణయించుకొని... దానికి అవసరమైన క్లాసులకు హాజరుకావటం మొదలుపెట్టాను. రాజకీయ ప్రక్రియకు సంబంధించిన అవగాహనను పెంపొందించే వర్క్‌షాపులకు కూడా వెళ్లేదాన్ని. రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న మిషిగాన్‌లో 2018లో నేను తొలిసారి గెలిచా. 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా నేను విజయం సాధించా.


అనుభవం నేర్పిన పాఠం..

రాజకీయాల్లో మిత్రులతో పాటు శత్రువులు ఉంటారు. అయితే ప్రత్యర్థి పార్టీల వారు మనకు శత్రువులు కావాల్సిన అవసరం లేదు. అందరికీ పనికొచ్చే పని అయితే- వారు కూడా కలిసి వస్తారు. ఈ గుణపాఠం నేర్చుకోవటానికి నాకు రెండేళ్లు పట్టింది. నా మొదటి టర్మ్‌లో నేను ప్రవేశపెట్టిన ఒక బిల్లు కూడా పాస్‌ కాలేదు. మా రాష్ట్ర ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మెజారిటీ ఉండటమే దీనికి కారణం. నేను అనుకున్నవి సాధించాలంటే- రిపబ్లికన్లను ప్రత్యర్థులుగా కాకుండా సైద్ధాంతికపరమైన మిత్రులుగా చూడాలనే విషయాన్ని నేర్చుకున్నా. దీనితో నా రెండో టర్మ్‌లో నేను పోరాడుతున్న అనేక సమస్యలపై బిల్లులను ప్రవేశపెట్టి నెగ్గించుకోగలిగా. ఇక నా భవిష్యత్తు అంటారా? సెనేటర్‌, గవర్నర్‌ వంటి పెద్ద పోస్టులకు పోటీ చేయాలంటే మరింత నెట్‌వర్క్‌, ధనబలం అవసరమవుతాయి. ప్రస్తుతం ప్రజలకు నేను చేస్తున్న సేవను కొనసాగిస్తూనే ఉంటా. నిస్వార్థంగా సేవ చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని గాఢంగా నమ్ముతా! అది నిజం అనడానికి నా జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు లభిస్తాయో వేచి చూడాల్సిందే.’’ 


పారదర్శకంగా

అమెరికాలో ఎన్నికలు చాలా వరకూ పారదర్శకంగా జరుగుతాయి. ఉదాహరణకు నేను పోటీ చేసిన ఎన్నికల్లో నాకు 2.5 లక్షల డాలర్లు ఖర్చు అయింది. ఈ సొమ్మును నా స్నేహితులు, ఇతర శ్రేయోభిలాషులు విరాళాల రూపంలో ఇచ్చారు. ఇదే విధంగా డెమోక్రటిక్‌ పార్టీ కూడా కొంత ఇచ్చింది. ఈ విరాళాలన్నింటికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి సమర్పించాలి. వాటిని ఆడిట్‌ చేస్తారు. ఈ ఆడిటింగ్‌ కూడా కఠినంగా ఉంటుంది. ఈ కోణం నుంచి చూస్తే- ఎన్నికల్లో ఖర్చు పెట్టే పద్ధతి చాలా పారదర్శకమని చెప్పాలి.


మన వాళ్లకు..

కోవిడ్‌ సమయంలో మన వాళ్లు అనేక ఇబ్బందులు గురయ్యారు. చాలా మందికి వీసా గడువులు పూర్తయిపోయాయి. రెన్యూవల్స్‌ కాలేదు. దానితో అనేక ఇబ్బందులకు గురయ్యారు. వీరిలో అనేక మంది నాకు ఫోన్లు చేస్తూ ఉండేవారు. నా స్టాఫ్‌ ద్వారా వీలైనంత మందికి సాయం అందించేదాన్ని. గ్రీన్‌కార్డును పొందటమనేది ప్రస్తుతం మన వాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య. ఏ దేశానికి ఎన్ని గ్రీన్‌కార్డులు ఇవ్వాలనే విషయంలో ఒక పరిమితి ఉంది. దీనిని మించి ఇవ్వరు. అతి తక్కువ మంది ప్రజలున్న వాటికన్‌కు ఎంత పరిమితి ఉంటుందో.. 130 కోట్ల మంది ప్రజలున్న భారత్‌కు అంతే పరిమితి ఉంటుంది. దీని వల్ల కొన్ని దేశాల ప్రజలకు త్వరగా.. మరి కొన్ని దేశాల ప్రజలకు చాలా ఆలస్యంగా గ్రీన్‌కార్డులు లభిస్తాయి. దీనికి సంబంధించిన అంశాలపై ప్రస్తుతం పోరాడుతున్నాం. గ్రీన్‌కార్డులకు సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటోంది. దీని వల్ల భారతీయులకు.. ముఖ్యంగా మన తెలుగువారికి ప్రయోజనం చేకూరుతుంది.


కీలకమైన బిల్లులు ఇవీ!

18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారిని ఆన్‌లైన్‌ నేరాల నుంచి కాపాడటానికి చట్టాలు ఉన్నాయి. అంతకన్నా పెద్ద వయస్సు ఉన్నవారిని కాపాడటానికి నేను ప్రవేశపెట్టిన బిల్లుకు మంచి స్పందన వచ్చింది. దీన్ని మా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. 

మహిళల లైంగిక ఆరోగ్యానికి, శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులపై పన్నులు తొలగించాలని నేను బిల్లును ప్రవేశపెట్టా. దీనిని ఆమోదిస్తే అనేక మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. 

హెచ్‌1బీ, ఎల్‌ 1, జే1లపై ఉన్నవారికి వీసా రెన్యూవల్‌ సమయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందటం చాలా కష్టమవుతుంది. అలాంటి వారికి సాయపడే విధంగా ఒక బిల్లును ప్రవేశపెట్టా.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.