Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 28 Oct 2021 08:48:52 IST

‘ఔట్‌’ అయ్యేనా!

twitter-iconwatsapp-iconfb-icon

వర్సిటీలో రద్దు కాని అక్రమ నియామకాలు

వీసీ, రిజిస్ర్టార్లదే ఇష్టారాజ్యం

ఉన్నత విద్యామండలి ఆదేశాలూ బేఖాతరు

విధులకు హాజరవుతున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది

30న టీయూలోనే ఈసీ సమావేశం

హాజరుకానున్న ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌


డిచ్‌పల్లి(నిజమాబాద్): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలపై చిక్కుముడి వీడడం లేదు. ఈ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించినా వీసీ, రిజిస్ర్టార్‌ తీరులో ఏమాత్రం స్పందన కానరావడంలేదు. పైకి రద్దు చేస్తున్నట్లు ప్రకనటలు గుప్పిస్తున్నా.. సదరు సిబ్బంది విధులకు హాజరవుతుండడం గమనార్హం. ఈ విషయమై ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈసీ సమావేశంలో ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ వర్సిటీలో అక్రమంగా నియమించిన 113 మంది ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను రద్దు చేయాలని వీసీ రవీందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ కనకయ్యలను మందలించినా.. వారు ఎటూ తేల్చకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తోంది. కమిషనర్‌ ఆదేశాలను వీసీ, రిజిస్ర్టార్‌ బేఖాతరు చేస్తూ వర్సిటీలో అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమంగా నియమించిన పోస్టులు రద్దు అవుతాయా? లేదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.


విధులకు హాజరవుతున్న సిబ్బంది..

పరిపాలన భవనంలో ఏఈ ఆఫీస్‌తో పాటు పరీక్షల విభాగం, సెక్యూరిటీ విభాగం, భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌, సారంగాపూర్‌ బీఈడీ కళాశాలలో అటెండర్స్‌, స్కావెంజర్‌ విధులకు హాజరు అవుతున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. నియామకాల కోసం వర్సిటీ అధికారులు లక్షలాది రూపాయలు తీసుకోవడం వల్లే వారు దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రిజిస్ట్రార్‌ కొంత మంది సిబ్బందిని మందలించిన్నట్లు సమాచారం.


సర్వత్రా ఉత్కంఠ..

ఈనెల 30న జరగనున్న పాలక మండలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎజెండాలోని అంశాలు ఆమోదం పొందుతాయాలేవో అని అనుమానాలకు తావిస్తోంది. పాలక మండలి సభ్యులకు 12 గంటల ముందుగానే ఎజెండా పత్రాలు గత సమావేశంలో టీయూ అధికారులు అందించడంతో ఆ ఎజెండా అంశాలను పాలక మండలి సభ్యులు నవీన్‌ మిట్టల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ సభ్యులను మచ్చిక చేసుకోవడానికి యూనివర్సిటీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది వరకే నవీన్‌ మిట్టల్‌  ఎదుట ఈసీ సభ్యులు వీసీ, రిజిస్ట్రార్‌ల పని తీరుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో ఈ నెల 30న జరిగే ఈసీ సమావేశంలో ఎలాంటి గలాటా చేయకుండా వర్సిటీ పరువు కాపాడేందుకు  రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిళ్లు చేయిస్తున్నట్లు సమాచారం.


డీన్‌లతో సమావేశాలు..

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాలపై నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌లో జరిగిన ఈసీ సమావేశంలో వీసీ, రిజిస్ట్రార్‌ లపై  ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ని యామకాలు చేసిన పోస్టులను రద్దు చేయాలని హెచ్చరిం చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కనకయ్య అన్ని విభాగాల డీన్‌ లతో హడావుడిగా సమావే శాలు నిర్వహించడంపై ఆసక్తి నెలకొంది. కాగా అక్రమ నియామకాలపై సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని డీన్‌లను ఆదేశిం చిన్నట్లు సమాచారం.


నియామకాలను రద్దు చేయాలి..: శ్రీనివాస్‌ గౌడ్‌ , విద్యార్థి సంఘ నేత

టీయూలో ఇటీవల ప్రభుత్వ, పాలకమండలి అనుమతులు లేకుండా ఔట్‌ సోర్సింగ్‌లో చేపట్టిన అక్రమ నియామకాలను రద్దు చేయాలి. ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు అమలు చేయాలి. వర్సిటీలో పనిభారం ఉంటే ప్రభుత్వ, పాలక మండలి అనుమతులు తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ ఇలా అక్రమంగా నియామకాలు చేయడం సరికాదు.


ఎజెండాపై చర్చించలేదు..: వసుంధరా దేవి, ఈసీ సభ్యురాలు, టీయూ  

హైదరాబాద్‌లో జరిగిన ఈసీ సమావేశంలో విశ్వవిద్యాలయంలో ఇటీవల ఔట్‌ సోర్సింగ్‌ అక్రమ నియామకాలతోపాటు వర్సిటీ ఎజెండా అంశాలపై వర్సిటీ ఉన్నతాధికారుల ఎదుట చర్చించలేదు. అధి కారికంగా ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల రద్దు ప్రకటిం చకపోవడం బాధాకరం. 30న జరిగే సమావేశంలో ఏ విధంగా చేద్దాం, ఎలా చేద్దాం అనే అంశాలను చర్చించనున్నాం. వర్సిటీలో అఽధికారుల తెగింపు మాకు అర్థం కావడం లేదు. ఈసీ సభ్యులను వర్సిటీ అధికారులు మేనేజ్‌ చేస్తారన్నది అపోహ మాత్రమే.


నియామకాలే చేపట్టలేదు..: డప్పు కనకయ్య, టీయూ రిజిస్ర్టార్‌  

వర్సిటీలో ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలను చేపట్టలేదు. ఇటీవల ఉన్నత విద్యా మండలి కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఎజెండా అంశాలే ప్రస్తావనకు రాలేదు. అక్రమ నియామకాలపై కొందరు ఈసీ సభ్యులు చెప్పిన విషయాల్లో ఎలాంటి వాస్తవం లేదు. 30న కమిషనర్‌తో పాలకమండలి సమావేశంలో వాస్తవాలు బయటపడతాయి. ఈసీ సభ్యులు కూడా సమావేశం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.