ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టయినా న్యాయం చేస్తాం: రమణ

ABN , First Publish Date - 2020-10-24T18:40:05+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు

ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టయినా న్యాయం చేస్తాం: రమణ

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులను, రైతన్నలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే కొన్ని కొన్ని చోట్ల తమకు ప్రభుత్వం వరద సాయం అందట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 


గోడలు బద్దలు కొట్టయినా..

శనివారం నాడు గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు కాలబెట్టుకున్న పొలంను పరిశీలించి, రైతును పరామర్శించారు. సన్నరకం పంట వేసిన  రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఫసల్ భీమాయోజన ప్రీమియంను ప్రభుత్వం కట్టలేదని మండిపడ్డారు. ‘అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతు బంధు’ ద్వారా పేద రైతులకు ఒరిగేదేంలేదన్నారు. రైతులకు న్యాయం చేయడానికి అవసరమైతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టయినా న్యాయం చేస్తామని రమణ చెప్పుకొచ్చారు. కాగా గత నాలుగైదు రోజులుగా తెలంగాణ తెలుగు తమ్ముళ్లు వరద బాధితులను, రైతన్నలను పరామర్శిస్తున్నారు.

Updated Date - 2020-10-24T18:40:05+05:30 IST