చార్మినార్‌ వద్ద మల్టీలెవల్‌ పార్కింగ్‌!

ABN , First Publish Date - 2022-08-18T15:49:49+05:30 IST

చార్మినార్‌ వద్ద మల్టీలెవల్‌ పార్కింగ్‌!

చార్మినార్‌ వద్ద మల్టీలెవల్‌ పార్కింగ్‌!

బస్టాండ్‌ స్థలంలో నిర్మించేందుకు కసరత్తు

కోయంబత్తూరు తరహాలో ఏర్పాటుకు సన్నాహాలు


హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): చార్మినార్‌ వద్ద సందర్శకులు, పర్యాటకుల పార్కింగ్‌ ఇబ్బందులకు త్వరలోనే చెక్‌ పడనుంది. ఒకేచోట వందకు పైగా కార్లు, రెండొందల వరకు ద్విచక్ర వాహనాలు పార్క్‌ చేసే విధంగా మల్టీలెవల్‌ పార్కింగ్‌ను ఏర్పాటు చేయడానికి హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా పార్కింగ్‌ సదుపాయంగా ఉన్న బస్టాండ్‌ స్థలంలోనే మల్టీలెవల్‌ పార్కింగ్‌ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. 


హైదరాబాద్‌ ఐకాన్‌గా నిలిచిన చార్మినార్‌ సందర్శనకు స్థానికులతో పాటు, ఇతర ప్రాంతాల వారూ వస్తుంటారు.  చార్మినార్‌ అందాలను తిలకించడంతో పాటు, షాపింగ్‌,  ఇరానీ చాయ్‌ ఇలా ఎన్నో అనుభూతులను మూటకట్టు కుంటారు. అయితే చార్మినార్‌ వద్దకు వాహనంపై వస్తే పార్కింగ్‌ కోసం పర్యాటకులు, సందర్శకులు నానా తంటాలు పడుతున్నారు. స్థానిక ఫుట్‌పాత్‌ వ్యాపారులు కానీ, వివిధ వాణిజ్య సముదాయాల వ్యాపారులు కానీ సొంత వాహనాలను కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. 


బస్టాండ్‌ స్థలంలో  తాత్కాలిక ఏర్పాట్లు

పార్కింగ్‌ ఇబ్బందులపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. చార్మినార్‌ వద్ద పాదచారుల ప్రాజెక్టు ఏర్పాటు క్రమంలోనే పార్కింగ్‌ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేశారు. బస్టాండ్‌ ప్రాంగణంతో పాటు కాంప్లెక్స్‌ కూల్చేసి పార్కింగ్‌ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. పింఛన్‌ కార్యాలయం వద్ద ఉన్న స్థలాన్ని కూడా పార్కింగ్‌ కోసం అందుబాటులో ఉంచారు. ఈ సదుపాయాలు పర్యాటకులకు సరిపోవడం లేదు. దీంతో ఇటీవల మంత్రి కేటీఆర్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ పాతబస్తీ అభివృద్ధిపై సమీక్షలో మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. అధ్యయనం కోసం హెచ్‌ఎండీఏ అధికారులు కోయంబత్తూరులో అక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన మల్టీలెవల్‌ పార్కింగ్‌ను పరిశీలించి అక్కడి అధికారులతో చర్చించారు. కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి మల్టీలెవల్‌ పార్కింగ్‌ డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌), డిజైన్ల రూపకల్పనకు చర్యలు చేపడుతున్నారు. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలా, లేదా హెచ్‌ఎండీఏ నిధుల ద్వారా ఏర్పాటు చేయాలా అనే దానిపై డీపీఆర్‌ రూపకల్పన పూర్తి అయిన తర్వాత ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.


కోయంబత్తూరులో ఇలా..

కోయంబత్తూరులో మల్టీలెవల్‌ పార్కింగ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టాయి. గ్రౌండ్‌ ప్లస్‌ నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. కార్లను వివిధ అంతస్తుల్లోకి తీసుకెళ్ళేందుకు ఐదు లిఫ్టు సౌకర్యాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో అక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు దీన్ని నిర్మించారు. ఇటీవల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక వాణిజ్య సముదాయాల వ్యాపారులు నెలవారీగా రుసుం చెల్లించి తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తుండగా, సందర్శకులు కూడా వాహనాలకు గంటకు చొప్పున రుసుం చెల్లిస్తున్నారు. 

Updated Date - 2022-08-18T15:49:49+05:30 IST