బంగారు పంటల కోన

ABN , First Publish Date - 2020-06-02T09:11:49+05:30 IST

సాగుకు కోసం కేసీఆర్‌ సర్కారు బడ్జెట్‌లో 15.7శాతం ఖర్చు చేస్తోంది. ఇది 29 రాష్ట్రాల కేటాయింపుల కన్నా ఎక్కువ. 2018 వానాకాలం నుంచి రైతుబంధు

బంగారు పంటల కోన

కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ



రాష్ట్రంలో ఇప్పుడు రైతే రాజు!  

ఎవుసం అంటే గతంలో మాదిరిగా తిప్పలు కాదు.. కుప్పలుగా ధనరాశులను రాల్చే వృత్తి! నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణ.. అందులోని మొదటిది, బంగారు తెలంగాణ సాధనలో కీలకమైన సాగునీటి వనరులపై దృష్టిపెట్టింది. మన చేను, చెలకలను తడపకుండా తలాపున నుంచే పోయే గోదారమ్మకు ఎగువకు పారే తీరును నేర్పింది తెలంగాణ. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అనే ఆ మహాయజ్ఞం ద్వారా పూర్తిచేసి బీడుభూములను నిండా తడుపుతోంది. పంటల పెట్టుబడి కోసం రైతుబంధు, రైతుల్లో ధీమా కోసం రైతుబీమా, సాగుకు 24గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో అన్నదాతలకు కొండంత భరోసానిస్తోంది. రైతు సల్లగుంటేనే సమాజం బాగుటుందనే ఉద్దేశంతో అన్నదాతల సంక్షేమం కోసం ఆరేళ్లలో కేసీఆర్‌ సర్కారు తీసుకున్న చర్యలు గొప్ప ఫలితాలిచ్చాయి. 


రైతు సంక్షేమానికి కేసీఆర్‌ సర్కారు పెద్దపీట

రైతుబంధు, రైతుబీమా పథకాల అమలు

దేశానికి ఆహార కేంద్రంగా రాష్ట్రం

నియంత్రిత సాగు విధానంతో కొత్త పుంతలు


హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సాగుకు కోసం కేసీఆర్‌ సర్కారు బడ్జెట్‌లో 15.7శాతం ఖర్చు చేస్తోంది. ఇది 29 రాష్ట్రాల కేటాయింపుల కన్నా ఎక్కువ. 2018 వానాకాలం నుంచి  రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది తొలుత ఎకారినికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు చెల్లించి.. 2019-20 నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఇస్తోంది. ఈ సాయం పొందే లబ్ధిదారుల్లో 90.5 శాతం చిన్న రైతులే. రైతు బంధు పథకం అమలు స్ఫూర్తితో కేంద్రం పీఎం- కిసాన్‌ పథకానికి రూపకల్పన చేసింది. పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న  రైతులకు రైతుబీమా పథకాన్ని వర్తింపజేశారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ. 5 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు. పంటల రుణ మాఫీ పథకం రైతులకు ఎంతో ఊరటనిస్తోంది.  


ఆయకట్టు పెంపే లక్ష్యంగా ముందడుగు

రాష్ట్రంలో మొత్తంగా 2.76 కోట్ల ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. ఇందులో 1.67 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉంది. ఈ వానాకాలం సీజన్‌లో 1.25 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళిక రచిస్తున్నారు. మరో 42 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తే పూర్తి స్థాయిలో భూమి సాగులోకి వస్తుంది. కొన్ని జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తయితే 100 శాతం లక్ష్యం నెరవేరుతుంది.  రైతులంతా ఒకే పంట పండిస్తే డిమాండ్‌ పడిపోయి నష్టపోతారన్న ఉద్దేశంతో సర్కారు.. నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తోంది. దీనిపై మిశ్రమ  స్పందన వ్యక్తమవుతోంది. 


కొనుగోళ్లలో రికార్డు 

నేరుగా పంట కొనుగోళ్లు చేయడం ద్వారా సర్కార్‌ రైతులకు భరోసాగా నిలస్తోంది. రూ.25వేలకోట్ల విలువైన ధాన్యం సేకరణలో ఇప్పటికే రూ.11వేల కోట్ల ధాన్యం కొన్నది. మక్కలు, కందులు, శనగలు, పొద్దుతిరుగుడును సైతం మద్దతు ధరతో కొంటోంది. ఇంత పెద్ద ఎత్తున పంటలను కొంటున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. 83 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరిస్తే, అందులో 52 లక్షల టన్నులు రాష్ట్రమే సమకూర్చింది. ఆ రకంగా దేశ ఆహార అవసరాలు తీర్చటంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.


అమలుచేసిన మరిన్ని కార్యక్రమాలు

వ్యవసాయానికి నిరాటంకంగా 24 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా; క్షేత్రస్థాయిలో రైతుల భూరికార్డుల ప్రక్షాళన, కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ;  సాదాబైనామాల ద్వారా దీర్ఘకాలికంగా పట్టాలు లేని రైతులకు భూమిహక్కులు;  రాష్ట్రంలో 61,208 మంది రైతులకు 50- 95 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ల పంపిణీ


రైతులు, రైతుసంఘాల డిమాండ్లు

కౌలు రైతులను గుర్తించి, రైతుబంధు, పంటరుణాలు ఇవ్వాలి

పసుపు పంటను టీఎస్‌- మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనాలి

కేసీఆర్‌ హామీ మేరకు దళితులకు 3 ఎకరాలు పంపిణీ చేయాలి

పంటలబీమా పథకాన్ని గ్రామం యూనిట్‌గా అమలుచేయాలి

విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి

పండించిన పంట ఉత్పత్తులను అన్నింటిని మద్దతు ధరకు కొనాలి



Updated Date - 2020-06-02T09:11:49+05:30 IST