హైదరాబాద్: ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులతో (కంపా) చేపడుతున్న అటవీ పునరుద్దరణ పనులు తెలంగాణలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో అటవీ పునరుజ్జీవన పనుల ద్వారా మళ్లీ పచ్చదనం పెరుగుతోంది. రాజధాని హైదరాబాద్ కు అతి సమీపంలో దాదాపుగా పూర్తి పట్టణీకరణ ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలో 29,545 హెక్టార్ల అటవీ ప్రాంతం 84 ఫారెస్ట్ బ్లాకుల్లో విస్తరించి ఉంది. పట్టణీకరణకు సమీపంలో ఉన్న విలువైన అటవీ ప్రాంతాలను రక్షిస్తూ, మళ్లీ పచ్చదనం చిగురించేలా కార్యాచరణను అటవీ శాఖ అమలు చేస్తోంది. తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నగరాలు, కాలనీ వాసులకు ప్రకృతి, పచ్చదనం, స్వచ్చమైన గాలి లభించేందుకు దోహదపడుతుంది.దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యామ్నాయ అటవీకరణ చేపట్టిన ప్రాంతాల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు.
పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్ రంగారెడ్డి జిల్లాలో స్థానిక అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం, కందుకూరు, అమనగల్, శంషాబాద్, మంఖాల్ అటవీ రేంజ్ ల్లో పర్యటించారు. ప్రతీ డివిజన్ లో రేంజ్ ల వారీగా క్షేత్ర స్థాయిలో చేపట్టిన పనుల పురోగతి, నాణ్యతలను పరిశీలించారు. గున్గల్ అటవీ రేంజ్ పరిధిలో రెండు ప్రాంతాల్లో 160 హెక్టార్లలో, గుమ్మడవళ్లి, మాదాపూర్ 105 హెక్టార్లలో, పడ్కల్ రిజర్వు అటవీ ప్రాంతంలో 70 హెక్టార్లలో, కొత్వాల్ గూడ, మల్కారంల్లో 82 హెక్టార్లలో, పల్లెగూడ రిజర్వు ఫారెస్ట్ లో 57 హెక్టార్లలో అటవీ శాఖ కంపా నిధుల ద్వారా ప్రత్యామ్నాయ అటవీకరణ, అటవీ పునరుద్దరణ పనులను చేపట్టారు. గత మూడు, నాలుగేళ్లుగా నాటిన మొక్కల సంరక్షణతో పాటు, ఖాళీలు ఉన్నచోట్ల గ్యాప్ ప్లాంటేషన్ చేపడుతున్నారు.
అన్ని అటవీ ప్రాంతాల చుట్టూ ఆక్రమణల నివారణలో భాగంగా కందకాలు లేదా చైన్ లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు, గట్లపైన గచ్చకాయ చెట్ల పెంపకం, భూసారం పెరిగేలా చర్యలు, చెక్ డ్యామ్ లు, వర్షం నీటి నిల్వ కోసం కందకాల తవ్వకం, నర్సరీల పెంపు, వంద శాతం అటవీ పునరుద్దరణలో భాగంగా మొక్కలు నాటడం, తద్వారా అటవీ సాంద్రత పెంపు చర్యలు అటవీ శాఖ చేపట్టింది.రెండు రోజుల పర్యటనలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్ పనుల పురోగతి, నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేశారు.రంగారెడ్డి జిల్లా పరిధిలో చక్కగా అటవీకరణ పనులు అమలు చేస్తున్న అధికారులు, సిబ్బందిని పిసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు.