కాంస్య తేజం

ABN , First Publish Date - 2022-08-05T06:20:30+05:30 IST

కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌తో వెలుగులోకి వచ్చిన హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌ ఇప్పుడు.. సీనియర్‌ క్రీడల్లో పతకం గెలుచుకొనే స్థాయికి ఎదిగాడు. కోర్టు ఆదేశంతో కామన్వెల్త్‌ క్రీడల భారత బృందంలో చివరి నిమిషంలో స్థానం దక్కించుకున్న శంకర్‌..

కాంస్య తేజం

హైజంప్‌లో తేజస్విన్‌కు మూడో స్థానం

ఈ  ఘనత సాధించిన భారత అథ్లెట్‌గా రికార్డు

బాక్సింగ్‌లో మరో మూడు పతకాలు ఖాయం


యువ అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ చరిత్ర సృష్టించాడు.. కామన్వెల్త్‌ క్రీడల హైజం్‌పలో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డు పుటలకెక్కాడు..కోర్టు జోక్యంతో ఈ గేమ్స్‌ బరిలోకి దిగిన 23 ఏళ్ల ఢిల్లీ అథ్లెట్‌ రజత పతకంతో తన సత్తా నిరూపించుకున్నాడు.. ఇక, బాక్సర్లు జాస్మిన్‌, అమిత్‌ పంగల్‌, సాగర్‌ సెమీ్‌సకు చేరడం ద్వారా మరో మూడు పతకాలు ఖాయం చేశారు..అయితే టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌ క్వార్టర్‌ఫైనల్లో పరాజయం చవిచూసింది.. స్టార్‌ స్ర్పింటర్‌ హిమాదాస్‌ 200 మీటర్ల సెమీఫైనల్లో అడుగుపెట్టింది.. మహిళల హ్యామర్‌త్రోలో మంజూబాల ఫైనల్‌కు చేరింది.. పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో ప్రవేశించింది. 


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌తో వెలుగులోకి వచ్చిన హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌ ఇప్పుడు.. సీనియర్‌ క్రీడల్లో పతకం గెలుచుకొనే స్థాయికి ఎదిగాడు. కోర్టు ఆదేశంతో కామన్వెల్త్‌ క్రీడల భారత బృందంలో చివరి నిమిషంలో స్థానం దక్కించుకున్న శంకర్‌ అంచనాలు నిలబెట్టుకొన్నాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల హైజం్‌పలో..జాతీయ రికార్డు హోల్డర్‌ తేజస్విన్‌ 2.22 మీటర్లు దూకి కాంస్య పతకం అందుకున్నాడు. థామస్‌ (బహమాస్‌), జోయెల్‌ క్లార్క్‌ (ఇంగ్లండ్‌) కూడా 2.22 మీ. జంప్‌ చేసినా.. శంకర్‌ ఒకే ప్రయత్నంలో ఆ దూరం లంఘించడంతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. 2.25 మీ.ల ఎత్తును రెండుసార్లు యత్నించిన శంకర్‌ సఫలం కాలేదు. ఇక రజతం కోసం మూడో ప్రయత్నంలో 2.28మీ. నిర్దేశించుకున్నా అతడు సక్సెస్‌ కాలేకపోయాడు. తేజస్విన్‌ కంటే ముందు కామన్వెల్త్‌ క్రీడల పురుషుల హైజంప్‌లో భారత అథ్లెట్‌ అత్యుత్తమ ప్రదర్శన భీంసింగ్‌ (2.06మీ.) పేరిట ఉంది. 1970 గేమ్స్‌లో భీంసింగ్‌ ఆ ఎత్తును లంఘించాడు. 2018 క్రీడల్లో 2.23 మీ. దుంకిన శంకర్‌ ఆరోస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌ అతడి అత్యుత్తమ ప్రదర్శన 2.27 మీ. కాగా.. అత్యుత్తమం 2.29 మీ. కా.. హమీష్‌ కెర్‌ (న్యూజిలాండ్‌, 2.25మీ.) స్వర్ణం, స్టార్క్‌ (ఆస్ట్రేలియా, 2.25) రజతం దక్కించుకున్నారు. మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్‌ కౌర్‌ (15.69 మీ.) 12వ స్థానంతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో భారత్‌ 5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 18 పతకాలతో ఏడోస్థానంలో ఉంది. 




200 మీ. సెమీస్‌కు హిమ

స్టార్‌ స్ర్పింటర్‌ హిమాదాస్‌ మహిళల 200 మీ. సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 23.42సె. టైమింగ్‌తో ఐదుగురు తలపడిన హీట్‌-2లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ఆరు హీట్లనుంచి 16మంది రన్నర్లు శుక్రవారం జరిగే సెమీ్‌సలో తలపడతారు. జమైకా దిగ్గజం ఎలానీ థాంప్సన్‌ హెరా (హీట్‌-5, 22.80సె.) అత్యుత్తమ సమయం నమోదు చేసింది. 


హ్యామర్‌ త్రో ఫైనల్‌కు మంజు

మహిళల హ్యామర్‌ త్రోలో 33 ఏళ్ల మంజూబాల 59.68 మీ. దూరంతో క్వాలిఫికేషన్‌లో 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఈ విభాగంలో తలపడిన మరో భారత అథ్లెట్‌ సరితా సింగ్‌ (57.48మీ.) 13వ స్థానంతో విఫలమైంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది శనివారం జరిగే ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు.


బాక్సర్ల జోరు

అమిత్‌ పంగల్‌, జాస్మిన్‌, సాగర్‌ తమ విభాగాలలో సెమీ్‌సకు చేరడం ద్వారా పతక రేస్‌లో నిలిచారు. పురుషుల ఫ్లైవెయిట్‌ క్వార్టర్‌ఫైనల్లో స్కాట్లాండ్‌ బాక్సర్‌ లెనాన్‌ ములిగన్‌ను పంగల్‌ చిత్తుచేయగా.. మహిళల లైట్‌వెయిట్‌ క్వార్టర్స్‌ బౌట్‌లో జాస్మిన్‌ 4-1తో ట్రాయ్‌ గార్టన్‌ (న్యూజిలాండ్‌)పై విజయం సాధించింది. పురుషుల సూపర్‌ హెవీవెయిట్‌లో సాగర్‌ 5-0తో కెడ్డీ ఇవాన్స్‌ (సీషెల్స్‌)ను చిత్తు చేశాడు. దాంతో బాక్సింగ్‌లో భారత్‌కు ఓవరాల్‌గా 6 పతకాలు ఖరారయ్యాయి. ఇప్పటికే నిఖత్‌, నీతు, హుసాముద్దీన్‌ సెమీ్‌సలో అడుగుపెట్టిన సంగతి తెలిసింది. అయితే స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బోర్గొహైన్‌కు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. హోరాహోరీగా సాగిన లైట్‌ మిడిల్‌వెయిట్‌ క్వార్టర్‌ఫైనల్లో రోసీ ఎకెల్స్‌ (వేల్స్‌) 3-2తో 24 ఏళ్ల లవ్లీనాపై గెలిచింది. 

Updated Date - 2022-08-05T06:20:30+05:30 IST