రూ.5 లక్షలిస్తేనే పాస్‌ పుస్తకం!

ABN , First Publish Date - 2021-07-23T08:05:40+05:30 IST

భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పాస్‌ పుస్తకం జారీ చేసేందుకు భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్‌ మేడిపల్లి సునీత ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు

రూ.5 లక్షలిస్తేనే పాస్‌ పుస్తకం!

లంచం డిమాండ్‌ చేసిన తహసీల్దార్‌

2 లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం 

భూపాలపల్లి జిల్లా కాటారంలో ఘటన


కాటారం, జూలై 22: భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పాస్‌ పుస్తకం జారీ చేసేందుకు భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్‌ మేడిపల్లి సునీత ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు. మండలంలోని సుందర్రాజ్‌పేటకు చెందిన దివ్యాంగుడైన రైతు హరికృష్ణకు కొత్తపల్లి శివారులోని సర్వే నంబరు 3, 4లలో నాలుగెకరాల 25 గుంటల భూమి ఉంది. పాత పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నా భూమి వివరాలు ధరణిలో నమోదు కాలేదు. రెండు నెలల క్రితం తహసీల్దార్‌ సునీతను కలిసిన హరికృష్ణ. నూతన పట్టాదారు పాస్‌ పుస్తకం ఇప్పించాలని కోరాడు. దీనికి ఆమె రూ.5లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. అప్పటికప్పుడు రూ.50వేలు ఇచ్చిన హరికృష్ణ.. కొద్ది రోజుల అనంతరం తహసీల్దార్‌ను కలువగా మిగతా మొత్తం ఇస్తేనే పని అవుతుందని చెప్పారు. అంత ఇవ్వలేనని హరికృష్ణ బతిమలాడగా... రూ.2.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో హరికృష్ణ 12న ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనమేరకు గురువారం తహసీల్దార్‌కు ఆమె కార్యాలయంలో రూ.2 లక్షలు  ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శుక్రవారం తహసీల్దార్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని వరంగల్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ మఽధుసూదన్‌ చెప్పారు. 

Updated Date - 2021-07-23T08:05:40+05:30 IST