భారత్‌ పోరాటం

ABN , First Publish Date - 2021-08-28T08:34:19+05:30 IST

మూడో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌ మాదిరి కాకుండా ఈసారి కోహ్లీ సేన పట్టువీడకుండా ఇంగ్లండ్‌ బౌలర్లను విసిగిస్తోంది.

భారత్‌ పోరాటం

సెంచరీకి చేరువలో పుజార 

రోహిత్‌ హాఫ్‌ సెంచరీ

రెండో ఇన్నింగ్స్‌ 215/2

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 432 ఆలౌట్‌

లీడ్స్‌: మూడో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌ మాదిరి కాకుండా ఈసారి కోహ్లీ సేన పట్టువీడకుండా ఇంగ్లండ్‌ బౌలర్లను విసిగిస్తోంది. కళ్లు చెదిరే ఆటతీరుతో సరికొత్తగా కనిపించిన పుజార (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్‌) సెంచరీకి చేరువలో ఉన్నాడు. రోహిత్‌ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) అర్ధసెంచరీ చేయగా.. అటు కెప్టెన్‌ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్‌) కూడా క్రీజులో నిలదొక్కుకున్నాడు. పుజార, కోహ్లీ ఇప్పటికే మూడో వికెట్‌కు 99 పరుగులందించారు. దీంతో మూడో రోజు శుక్రవారం భారత్‌ ఆధిపత్యమే కనిపించగా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. భారత్‌ మరో 139 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌ 132.2 ఓవర్లలో 432 పరుగుల వద్ద ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు తొమ్మిది పరుగులు మాత్రమే జత చేయగా.. మొత్తం 354 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. షమికి నాలుగు, బుమ్రా, సిరాజ్‌, జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి. 


రాహుల్‌ మళ్లీ విఫలం

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ త్వరగానే ముగియడంతో భారీ లోటుతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే తొలి సెషన్‌ చివరి బంతికి ఓపెనర్‌ రాహుల్‌ (8) అవుటయ్యాడు. 54 బంతులు ఓపిగ్గా ఎదుర్కొన్న అతడు చక్కటి డిఫెన్స్‌తో క్రీజులో నిలిచాడు. అటు అండర్సన్‌ ప్రమాదకర అవుట్‌ స్వింగర్లతో ఇబ్బందిపెట్టాడు. ఓసారి డీఆర్‌ఎస్‌ ద్వారా ఎల్బీ నుంచి తప్పించుకున్న రాహుల్‌ చివరికి ఓవర్టన్‌ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో బెయిర్‌స్టో సూపర్‌ క్యాచ్‌తో  వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో రోహిత్‌ ఓపికను కనబరిచాడు. ఆఫ్‌సైడ్‌ బంతులను ఏమాత్రం టచ్‌ చేయకుండా వదిలేశాడు. అలాగే పుల్‌ షాట్లు ఆడకుండా నియంత్రించుకున్నాడు. ఓ బౌ న్సర్‌ను మాత్రం కాస్త ఎగిరి థర్డ్‌ మ్యాన్‌ వైపు బాదిన సిక్సర్‌తో జోరు చూపాడు. అలాగే సామ్‌ కర్రాన్‌ వేసిన బంతిని మిడ్‌ వికెట్‌ వైపు ఫోర్‌ కొట్టాడు. 


రోహిత్‌, పుజార పట్టుదల

రెండో సెషన్‌లో రోహిత్‌, పుజార పట్టుదలగా ఆడడంతో వికెట్‌ కోల్పోకుండా 78 పరుగులు సాధించింది. ముఖ్యంగా తన సహజశైలికి విరుద్ధంగా పుజార బ్యాట్‌ ఝుళిపించాడు. వరుసగా మూడు ఓవర్లలో ఒక్కో ఫోర్‌ కొట్టిన అతడు 29వ ఓవర్‌లో రెండు ఫోర్లతో చెలరేగి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడు. అలాగే ప్రమాదకర బంతులను వదిలేస్తూ ఈ ఇద్దరూ వికెట్‌ కాపాడుకున్నారు. మరోవైపు రోహిత్‌ 125 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 


పుజార జోరు

చివరి సెషన్‌ రెండో ఓవర్‌లోనే భారత్‌కు గట్టి ఝలక్‌ తగిలింది. చక్కగా కుదురుకున్న రోహిత్‌ను రాబిన్సన్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. దీనిపై రోహిత్‌ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే పుజార మాత్రం ధాటిని కొనసాగిస్తూనే ఫోర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వా త కూడా వెనక్కి తగ్గకుండా అండర్సన్‌ ఓవర్‌లో వరుస ఫోర్లతో చెలరేగాడు. ఇక తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కూడా 53వ ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించి నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. వెలుతురులేమితో ఆట కాస్త ముందుగానే ముగిసింది. ఈ సెషన్‌లో 103 రన్స్‌వచ్చాయి.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 432 ఆలౌట్‌; 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) రాబిన్సన్‌ 59; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్‌ 8; పుజార (బ్యాటింగ్‌) 91; కోహ్లీ (బ్యాటింగ్‌) 45; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 80 ఓవర్లలో 215/2. వికెట్ల పతనం: 1-34, 2-116. బౌలింగ్‌: అండర్సన్‌ 19-8-51-0; రాబిన్సన్‌ 18-4-40-1; ఓవర్టన్‌ 17-6-35-1; కర్రాన్‌ 9-1-40-0; మొయిన్‌ అలీ 11-1-28-0; రూట్‌ 6-1-15-0.


పంత్‌.. ఇదేం పని!

రెండో రోజు ఆఖరి సెషన్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తన కీపింగ్‌ గ్లోవ్స్‌కు టేప్‌ చుట్టుకుని రావడంతో థర్డ్‌ అంపైర్‌ ఇల్లింగ్‌వర్త్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో వెంటనే ఈ విషయాన్ని ఫీల్డ్‌ అంపైర్లకు తెలిపాడు. దీంతో సెషన్‌ ఆరంభానికి ముందే కెప్టెన్‌ కోహ్లీ చేత ఆ టేప్‌ను తీసేయించారు. పంత్‌ నాలుగు, ఐదో వేలును కలిపినట్టుగా గ్లోవ్స్‌కు టేప్‌ వేసి ఉంది. ఇలా చేస్తే క్యాచ్‌లు పట్టే విషయంలో కీపర్లకు అడ్వాంటేజి ఉంటుంది. 


జార్వో.. ఈసారి బ్యాట్స్‌మన్‌గా

లార్డ్స్‌ టెస్టులో భారత ఫీల్డర్‌గా చెప్పుకొంటూ గ్రౌండ్‌లోకి వచ్చిన జార్వో ‘69’ గుర్తున్నాడుగా.. తను ఈసారి భారత బ్యాట్స్‌మన్‌గా రంగప్రవేశం చేశాడు. రోహిత్‌ శర్మను రాబిన్సన్‌ అవుట్‌ చేయగానే కోహ్లీ కోసం అంతా ఎదురుచూస్తుంటే.. అదిగో అప్పుడే ఈ హీరో హెల్మెట్‌, బ్యాట్‌, ప్యాడ్స్‌తో పాటు ముఖానికి మాస్క్‌ కూడా పెట్టుకుని టిప్‌టా్‌పగా క్రీజులోకి వచ్చాడు. అయితే ఈసారి అంత సులువుగానూ బయటికి వెళ్లలేదు. సెక్యూరిటీ సిబ్బంది దాదాపుగా అతడిని ఈడ్చుకుంటూ వెళితే కానీ మ్యాచ్‌ ముందుకు సాగలేదు.

Updated Date - 2021-08-28T08:34:19+05:30 IST