India-Srilankaతొలి టీ20లో టీమిండియా విజయం

ABN , First Publish Date - 2021-07-26T05:02:36+05:30 IST

వన్డే సిరీస్ విజయం తరువాత ప్రారంభమైన టీ20 సిరీస్‌లో కూడా భారత్ విజయంతో మొదలు పెట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా..

India-Srilankaతొలి టీ20లో టీమిండియా విజయం

కొలంబో: వన్డే సిరీస్ విజయం తరువాత ప్రారంభమైన టీ20 సిరీస్‌లో కూడా భారత్ విజయంతో మొదలు పెట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో(26), మినోద్ భనుక(10) మంచి ఆరంభాన్నించారు. అయితే వీరిద్దరితో పాటు ధనంజయ డిసిల్వ(9) వెంటవెంటనే అవుట్ కావడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. అయితే చరిత్ అసలంక(44) భారత బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి అతడికి ఏ మాత్రం సహకారం లభించలేదు. 16వ  ఓవర్లో అసలంక అవుటైన తరువాత శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కనీసం ఒక్కరు కూడా రెండంకెల స్కోరు కూడా  చేయలేకపోయారు. దీంతో 9 బంతులు మిగిలుండగా 126 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. దీంతో తొలి టీ20లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో వైస్ కెప్టెన్, ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీపక్ చాహర్ 2 వికెట్లతో మెరవగా, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు. నాలుగు వికెట్లతో రాణించిన భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. తొలి బంతికే పృథ్వీ షా వికెట్‌ కోల్పోయింది. దీంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది. అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్(27)తో కలిసి ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధవన్(46) మంచి పార్ట్‌నర్ షిప్ నెలకొల్పాడు. అలాగే సంజు అవుటైన తరువాత సూర్యకుమార్ యాదవ్‌(50)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే అర్థ సెంచరీకి కొద్ది దూరంలో అవుటైనా.. స్కై హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో ఇషాన్ కిషన్(20) సిక్స్, ఫోర్‌తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దుష్మంత చమీరా, వనిందు హసరంగ చెరో రెండు వికెట్లు తీయగా, చమిక కరుణరత్నే ఓ వికెట్ తీశాడు.

Updated Date - 2021-07-26T05:02:36+05:30 IST