కుప్పకూలారు

ABN , First Publish Date - 2021-08-26T10:04:08+05:30 IST

లార్డ్స్‌ టెస్టులో చిరస్మరణీయ విజయంతో టీమిండియా అమాంతం అంచనాలు పెంచేసింది. అందుకు తగ్గట్టుగానే ఇంగ్లండ్‌తో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో కోహ్లీ టాస్‌ నెగ్గి.. బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో...

కుప్పకూలారు

  • భారత్‌ 78 ఆలౌట్‌
  • బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం
  • అదరగొట్టిన అండర్సన్‌ అండ్‌ కో
  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌120/0
  • మూడో టెస్టు



లీడ్స్‌: లార్డ్స్‌ టెస్టులో చిరస్మరణీయ విజయంతో టీమిండియా అమాంతం అంచనాలు పెంచేసింది. అందుకు తగ్గట్టుగానే ఇంగ్లండ్‌తో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో కోహ్లీ టాస్‌ నెగ్గి.. బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఇక తిరుగులేదనుకున్నారంతా. కానీ, ఆ ఆనందం ఆవిరవడానికి ఎంతోసేపు పట్టలేదు. బ్యాట్స్‌మెన్‌ దారుణ వైఫల్యంతో జట్టు కనీసం వంద స్కోరు కూడా చేయలేకపోయింది. టాపార్డర్‌ను కూల్చి వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ (8-5-6-3) భారత జట్టు పతనాన్ని శాసించగా.. క్రెగ్‌ ఓవర్టన్‌ (3/14), రాబిన్సన్‌ (2/16), సామ్‌ కర్రాన్‌ (2/27) మిగతా బ్యాట్స్‌మెన్‌ పనిపట్టారు. ఇంగ్లండ్‌ పేసర్ల దెబ్బకు కనీస భాగస్వామ్యాలు కరువవడంతో.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (105 బంతుల్లో 19), రహానె (54 బంతుల్లో 18) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా.. ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు రావడం గమనార్హం. ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బట్లర్‌ ఐదు క్యాచ్‌లు పట్టడం విశేషం. 


టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలుత బ్యాటింగ్‌ చేసి.. ఏడో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా కోహ్లీసేన నిలిచింది. ఒక ఇన్నింగ్స్‌లో భారత్‌ వంద పరుగులలోపే ఆలౌటవడం గత 9 నెలల్లో ఇది రెండోసారి. గతేడాది డిసెంబరులో అడిలైడ్‌ టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలింది. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా  120 పరుగులతో నిలకడగా ఆడుతోంది. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఓపెనర్లు రోరీ బర్న్స్‌ (52), హసీబ్‌ హమీద్‌ (60) అర్ధ శతకాలతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా 42 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్‌ తొలిరోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 


బ్యాట్లెత్తేశారు: ఇంగ్లండ్‌ బౌలర్లకు భారత బ్యాట్స్‌మెన్‌ దాసోహమన్నారు. లార్డ్స్‌ టెస్టులో ఐదోరోజు పేలవ ప్రదర్శన చేసిన అండర్సన్‌.. ఆరంభం నుంచే కసిగా బౌలింగ్‌ చేశాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (0)ను తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేసి టీమిండియా పతనానికి నాందిపలికాడు. షాట్‌ ఆడే క్రమంలో రాహుల్‌ బ్యాట్‌ను ముద్దాడిన బంతి.. కీపర్‌ బట్లర్‌ చేతుల్లో ఒదిగింది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (1)ను అవుట్‌ స్వింగర్‌తో అండర్సన్‌ అవుట్‌ చేశాడు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న విరాట్‌ కోహ్లీ (7) మరోసారి అండర్సన్‌కే దొరికాడు. కవర్‌ డ్రైవ్‌ చేసే క్రమంలో క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో 21 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్‌ కష్టాల్లో పడింది. అయితే, మరో ఓపెనర్‌ రోహిత్‌.. రహానెతో కలసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 35 రన్స్‌ జోడించారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో రహానెను రాబిన్సన్‌ అవుట్‌ చేయడంతో లంచ్‌ సమయానికి భారత్‌ 56/4తో నిలిచింది. ఆ తర్వాత కూడా భారత బ్యాట్స్‌మెన్‌ తీరు మారలేదు. రాబిన్సన్‌ బౌలింగ్‌లో అనవసరపు షాట్‌ ఆడి రిషభ్‌ పంత్‌ (2) వికెట్‌ పారేసుకున్నాడు. ఇక్కడి నుంచి టీమిండియా పతనం వేగంగా జరిగిపోయింది. 67 పరుగుల స్కోరు వద్ద రోహిత్‌, షమి (0), జడేజా (4), బుమ్రా (0) వికెట్లను చేజార్చుకున్న భారత్‌.. రెండంకెల స్కోరుతోనే తొలి ఇన్నింగ్స్‌ను పేలవంగా ముగించింది. వంద బంతులకు పైగా ఆడి తక్కువ రన్స్‌ చేసిన రోహిత్‌.. సహనం కోల్పోయాడు. ఓవర్టన్‌ బౌలింగ్‌లో పుల్‌షాట్‌ ఆడే క్రమంలో రోహిత్‌ నిష్క్రమించగా.. అదే ఓవర్‌లో షమి కూడా పెవిలియన్‌ చేరాడు. జడేజా, బుమ్రాను కర్రాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఓవర్టన్‌ బౌలింగ్‌లో స్లిప్స్‌లో రూట్‌ క్యాచ్‌ పట్టడంతో సిరాజ్‌ (3) వెనుదిరిగాడు. 


7

టెస్టుల్లో ఆండర్సన్‌కు వికెట్‌ సమర్పించుకోవడం కోహ్లీకి ఇది ఏడోసారి. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధికసార్లు కోహ్లీని అవుట్‌ చేసిన ఆసీస్‌ క్రికెటర్‌ నాథన్‌ లియాన్‌ (7సార్లు)తో సమంగా అండర్సన్‌ నిలిచాడు. 


5

ఈ మ్యాచ్‌లో కీపర్‌ బట్లర్‌ అందుకొన్న క్యాచ్‌లు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఒకే ఫీల్డర్‌ లేదా కీపర్‌ ఐదు క్యాచ్‌ల ఫీట్‌ చేయడం ఇది రెండోసారి. 2014లో భారత్‌తో టెస్టులో హడిన్‌ (ఆస్ట్రేలియా) తొలిసారి ఈ ఘనతను అందుకొన్నాడు. 



స్కోరుబోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రాబిన్సన్‌ (బి) ఓవర్టన్‌ 19, రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 0, పుజార (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 1, కోహ్లీ (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 7, రహానె (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 18, రిషభ్‌ పంత్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 2, జడేజా (ఎల్బీ) కర్రాన్‌ 4, షమి (సి) బర్న్స్‌ (సి) ఓవర్టన్‌ 0, ఇషాంత్‌ (నాటౌట్‌) 8, బుమ్రా (ఎల్బీ) కర్రాన్‌ 0, సిరాజ్‌ (సి) రూట్‌ (బి) ఓవర్టన్‌ 3; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 40.4 ఓవర్లలో 78 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-4, 3-21, 4-56, 5-58, 6-67, 7-67, 8-67, 9-67; బౌలింగ్‌: అండర్సన్‌ 8-5-6-3, రాబిన్సన్‌ 10-3-16-2, సామ్‌ కర్రాన్‌ 10-2-27-2, మొయిన్‌ అలీ 2-0-4-0, ఓవర్టన్‌ 10.4-5-14-3. 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: రోరి బర్న్స్‌ (బ్యాటింగ్‌) 52, హసీబ్‌ హమీద్‌ (బ్యాటింగ్‌) 60; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 42 ఓవర్లలో 120/0; బౌలింగ్‌: ఇషాంత్‌ 7-0-26-0, బుమ్రా 12-5-19-0, షమి 11-2-39-0, సిరాజ్‌ 7-1-26-0, జడేజా 5-3-6-0. 




Updated Date - 2021-08-26T10:04:08+05:30 IST