ఆన్‌లైన్‌ పాఠాలు వినలేని వారికోసం

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

కరోనా భయంతో స్కూళ్లు తెరచుకోకపోవడంతో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. అయితే ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌ తప్పనిసరి. కానీ వీటిని కొనేంత స్థోమత లేని పేద పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేని పరిస్థితి...

ఆన్‌లైన్‌ పాఠాలు వినలేని వారికోసం

కరోనా భయంతో స్కూళ్లు తెరచుకోకపోవడంతో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. అయితే ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌ తప్పనిసరి. కానీ వీటిని కొనేంత స్థోమత లేని పేద పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేని పరిస్థితి. అలాంటి వారికి  జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలోని ఒక పాఠశాల లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి పాఠాలు చెబుతున్న తీరు అభినందనీయం. 


స్కూళ్లు తెరచుకోకపోవడంతో పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంట్లో ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ ఉన్న పిల్లలు ఎంచక్కా ఈ-పాఠాలు వింటున్నారు.  కానీ జార్ఖండ్‌లో డుమ్కా జిల్లాలోని బంకథినీ అప్‌గ్రేడెడ్‌ మిడెడ్‌ స్కూల్లో చదివే 240 నుంచి 246 మంది పేదవిద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావడం లేదు. ఈ విషయం ఆ స్కూలు ప్రిన్సిపాల్‌ శ్యామ్‌ కిషోర్‌ గాంధీ దృష్టికి వచ్చింది. 

దాంతో ఆయన లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి  వారికి పాఠాలు బోధించాలని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఊళ్లో వాళ్లతో మాట్లాడి ఒప్పించారు. ఊళ్లో రచ్చబండ మీద  మైక్రోఫోను ఏర్పాటు చేసి, ఊళ్లో చాలాచోట్ల చెట్ల కొమ్మలకు లౌడ్‌స్పీకర్లు ఏర్పాటుచేశారు. దాంతో పిల్లలు తమ ఇంటి వద్దనే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటున్నారు. ‘‘మా స్కూల్లో కేవలం 42మంది విద్యార్థులకే స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. ఏ ఒక్క విద్యార్థి కూడా తరగతులు మిస్‌ అవకూడదనే ఆలోచనతో ఊళ్లో లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు  చేశాం. వీటి ఏర్పాటుతో ఇప్పుడు పిల్లలు సామాజిక దూరం పాటిస్తూనే, కరోనా భయం లేకుండా ఇంటి వద్దనే ఉండి  పాఠాలు వింటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినప్పటికీ వారంతా ఎంచక్కా రోజూ క్లాసులకు హాజరవుతున్నారు’’ అని సంతోషంగా చెబుతారు ప్రిన్సిపాల్‌ శ్యామ్‌ కిషోర్‌.


వంద శాతం హాజరు

మామూలు రోజుల్లానే ఇప్పుడు కూడా వంద శాతం హాజరవుతున్నారు. ‘‘లాక్‌డౌన్‌ ప్రారంభమైన తొలిరోజుల్లో నేను ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ఫోన్‌ ఉన్న మా స్నేహితుల దగ్గరకు వెళ్లేదాన్ని. స్మార్ట్‌ఫోన్‌లో పాఠాలు వినడం కష్టంగా ఉండేది. టీచర్‌ చెప్పేది సరిగా వినిపించేది కాదు. కానీ ఇప్పుడా సమస్య లేదు. లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసిన రోజు నుంచి పాఠాలు వినడం సులభమైంది. పాఠాలు తొందరగా అర్థమవుతున్నాయి’’ అంటుంది ఏడో తరగతి చదివే మనీషా మరాండీ అనే విద్యార్థిని. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేని పిల్లల కోసం డుమ్కా స్కూలు ప్రిన్సిపాల్‌ చూపిన కొత్త దారిని అంతా ప్రశంసిస్తున్నారు.


Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST