టీచరు ఎమ్మెల్సీ విజేతలు సాబ్జీ, కల్పలత

ABN , First Publish Date - 2021-03-18T09:36:42+05:30 IST

రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను బుధవారం అర్ధరాత్రి ప్రకటించారు. తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గం యూటీఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జీ సొంతం చేసుకోగా, గుంటూరు- కృష్ణా

టీచరు ఎమ్మెల్సీ విజేతలు సాబ్జీ, కల్పలత

‘గోదావరి’లో యూటీఎఫ్‌ భేరి!

వైసీపీ బలపరిచిన గంధంపై సాబ్జీకి 1,534 ఓట్ల ఆధిక్యం

9 మందికి డిపాజిట్లు గల్లంతు

కృష్ణా-గుంటూరు కౌంటింగ్‌ సుదీర్ఘం

ద్వితీయ ఓటుతో గట్టెక్కిన కల్పలత 

మూడోస్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ


అమరావతి,కాకినాడ, గుంటూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను బుధవారం అర్ధరాత్రి ప్రకటించారు. తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గం యూటీఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జీ సొంతం చేసుకోగా, గుంటూరు- కృష్ణా నియోజకవర్గంలో టి.కల్పలత విజయం సాధించారు. గోదావరి జిల్లాల కౌంటింగ్‌ ప్రక్రియ కాకినాడలోని జేఎన్‌టీయూకే కళాశాలలో, కృష్ణా-గుంటూరు లెక్కింపును గుంటూరులోని ఏసీ కాలేజీలో చేపట్టారు. తొలి రౌండ్‌ నుంచీ షేక్‌ సాబ్జీ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం పాత ముప్పర్రు. 1990 నుంచి యూటీఎ్‌ఫలో పనిచేస్తూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి గత 30 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్పలత టీచరు ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. 


‘తొలి’ నుంచీ సాబ్జీదే ఆధిక్యత

ఉభయగోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) తరపున పోటీ చేసిన యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సాబ్జీ విజయం సాధించారు. పీఆర్‌టీయూ, మిత్ర ఉపాధ్యాయ సంఘాలు, పరోక్షంగా వైసీపీ మద్దతిచ్చిన గంధం నారాయణరావుపై 1,534 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో బుఽధవారం ఓట్ల  లెక్కింపు జరిగింది. మొదటి రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి సాబ్జీకి 4,937, గంధం నారాయణరావుకు 3,973 ఓట్లు వచ్చాయి.


రెండో రౌండ్‌లో 6,054 ఓట్లను 10 టేబుళ్లపై లెక్కించారు. ఈ రౌండ్‌ ముగిసేటప్పటికి సాబ్జీకి 3,050, నారాయణరావుకు 2,480 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓటు లెక్కించాల్సిన అవసరం రాలేదు. ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ లేకుండానే సాబ్జీ సునాయసంగా విజయం సాధించారు. వాస్తవానికి పోలైన 16,054 ఓట్లలో విజేత అభ్యర్థికి కోటా ప్రకారం 8,028 ఓట్లు లేదా 50 శాతం ఓట్లు రావాలి. కానీ సాబ్జీకి 7,987 ఓట్లు మాత్రమే వచ్చాయి. కోటా ఫిగర్‌ రాలేదు. అయితే మొత్తం పోలైన ఓట్లలో 363 ఓట్లు చెల్లకపోవడంతో తేలడంతో 50 శాతం మేరకు ఆయనకు 7,845 ఓట్లు వస్తే సరిపోతుంది. కానీ,ఆయనకు 7,987 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. గంధం నారాయణరావు తర్వాతి స్థానంలో చెరుకూరి సుభా్‌సచంద్రబో్‌సకు 706 ఓట్లు, ఇళ్ల సత్యనారాయణకు 300 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో వచ్చాయి. 11 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా తొమ్మిది మంది అభ్యర్థులకు డిజిట్‌ దక్కలేదు. 


రౌండ్‌ నుంచి రౌండ్‌కు ఉత్కంఠ

కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపింది. కల్పలత రెడ్డికి తొలి ప్రాధాన్య ఓట్లు అధికంగా వచ్చాయి. మొత్తం 3,870 ఓట్లతో ఆమె ప్రథమ స్థానంలో నిలిచారు. రెండోస్థానంలో పీడీఎఫ్‌ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు 2,831 ఓట్లు, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ 1,958, ఏపీటీఎఫ్‌ పాండురంగ వరప్రసాదరావుకి 1,490, చందూ రామారావుకి 1,063 తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 12,550 ఓట్లు పోలింగ్‌ కాగా 246 ఓట్లు వివిధ కారణాలతో చెల్లుబాటు కాకుండా పోయాయి.


సాయంత్రానికి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఏ ఒక్క అభ్యర్థికీ అవసరమైన విజయానికి 6,153 ఓట్లు రాలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపుని చేపట్టారు. అందరికంటే తక్కువగా ఓట్లు పోలింగ్‌ అయిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో వివిధ ప్రాధాన్యతల అనంతరం కల్పలత విజయం సాధించినట్టు ప్రకటించారు. ఓట్ల లెక్కింపుని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వివేక్‌యాదవ్‌, పరిశీలకుడు కేవీ రమణ పర్యవేక్షించారు. 

Updated Date - 2021-03-18T09:36:42+05:30 IST