ట్విటర్‌లో టీడీపీ

ABN , First Publish Date - 2020-02-16T08:55:55+05:30 IST

‘‘గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మహరాష్ట్ర, గుజరాత్‌లతో మనం పోటీపడ్డాం. వైసీపీ ప్రభుత్వంలో పీపీఏల రద్దు, వాటాల కోసం

ట్విటర్‌లో టీడీపీ

1.80లక్షల కోట్ల పెట్టుబడులు హుష్‌కాకి

వైసీపీ వేధింపులు, బెదిరింపుల ఫలితమిది: చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ‘‘గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మహరాష్ట్ర, గుజరాత్‌లతో మనం పోటీపడ్డాం. వైసీపీ ప్రభుత్వంలో పీపీఏల రద్దు, వాటాల కోసం బెదిరింపులు, డీలర్‌షి్‌పల కోసం వేధింపులు తట్టుకోలేక గత 9నెలల్లోనే రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయి’’ అని ప్రతిపక్షనేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇటీవల దావో్‌సలో కూడా పారిశ్రామికవేత్తలు ఆంధ్రలో రివర్స్‌ పాలనపై ఆందోళన వ్యక్తంచేశారు.


ఇకనైనా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టి సారించాలి’’ అని ట్వీట్‌ చేశారు. ‘‘గతఏడాది... 2018-19లో అత్యధిక పెట్టుబడులు 11.8శాతం ఆకర్షించి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. 2014-19 మధ్య దేశవ్యాప్తంగా రూ.7,03,103 కోట్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపీకి రూ.70వేల కోట్లు వచ్చాయి. అందుకు ఆర్బీఐ తాజా బులెటిన్‌ వివరాలే ప్రత్యక్ష సాక్ష్యం’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.


ఎన్డీఏలోకి కేసుల మాఫీకేనా!: బుద్దా 

‘‘అత్యధిక ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాం అన్న జగన్‌ ఇప్పుడు కేంద్రం ముందుకు ఎందుకు మోకరిల్లారో మంత్రి బొత్స సమాధానం చెప్పాలి’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు. ‘‘కేసుల మాఫీ కోసమా? బెయిల్‌ రద్దు అవ్వకుండా ఉండేందుకు ఎన్డీఏ తీర్థం పుచ్చుకుంటున్నారా? దేని కోసం ఎన్డీఏలో చేరుతున్నారో? తలవంచి, కాళ్లు పట్టుకుని ఎన్టీఏలో చేరి సాధించబోయేది ఏంటో బొత్స వివరించాలి’’ అని బుద్దా డిమాండ్‌ చేశారు. 


ఎంపీడీవో సరళకు న్యాయం ఎప్పుడు? పంచుమర్తి

‘‘దిశ చట్టం ద్వారా న్యాయం ఎక్కడ? నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మహిళా ఎంపీడీఓ సరళపై దారుణంగా దాడి చేశారు. మహిళ అని చూడకుండా ఇంటికి వెళ్లి మరీ దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన జరిగి నేటికి 4నెలలు అవుతోంది. ఒక మహిళా అధికారికి అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌ ముందు కూర్చొని దీక్ష చేసే పరిస్థితి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం దిశ చట్టం ద్వారా ఎపుడు న్యాయం చేస్తుంది?’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ప్రశ్నించారు. 


ఇప్పుడు ‘టొరే’పైనా అబద్ధాలు: లోకేశ్‌

జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ.. అనే కాన్సెప్ట్‌ జగన్‌ను చూసే పెట్టారేమోనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘కియ విషయంలో... లెటర్‌ చదువుతూ అధ్యక్షా అంటూ ఆర్థికమంత్రి బుగ్గన బుర్రకథ వినిపించారు. చంద్రబాబు హయాంలో కష్టపడి తెచ్చిన టీసీఎల్‌ని వాళ్ల ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు టొరే వంతు. టీడీపీ హయాంలో భూమిపూజ అయిపోయిన కంపెనీ... ఇప్పుడు వాళ్లే తెచ్చినట్లు హడావుడి చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. కియ మోటార్స్‌ను బెదిరించినట్టు దీనిని కూడా బెదరగొట్టి తరిమేయకండి అన్నారు.

Updated Date - 2020-02-16T08:55:55+05:30 IST