సభలో టీడీపీ విజిల్స్‌

ABN , First Publish Date - 2022-03-23T08:19:06+05:30 IST

ఇద్దరు టీడీపీ శాసనసభ్యులు అసెంబ్లీలో విజిల్స్‌ వేశారు. దీంతో సభాపతి వారిని సమావేశాలు ...

సభలో టీడీపీ విజిల్స్‌

ఇదేం పద్ధతంటూ సభాపతి ఆగ్రహం

కల్తీ మద్యంతో చనిపోయినా

 స్పందించకపోవడం పద్ధతా?

మార్షల్స్‌ను పెట్టి సభ

నడపడం ఏం సంప్రదాయం?

నిలదీసిన టీడీపీ సభ్యులు

ఆడకూతురిని అవమానించిన

ఈ సభ సభే కాదు: గద్దె

విపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్‌


అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు టీడీపీ శాసనసభ్యులు అసెంబ్లీలో విజిల్స్‌ వేశారు. దీంతో సభాపతి వారిని సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్‌ చేశారు. కల్తీ మద్యం మరణాలపై న్యాయ విచారణ చేయించాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని వారం రోజులుగా సభలో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కల్తీ మద్యం మరణాలపై న్యాయ విచారణకు పట్టుబట్టారు. పోడియంను చుట్టుముట్టి.. సభాపతి స్థానం వద్దకెళ్లి వాగ్వాదానికి దిగారు. కొంతసేపటికి సభాపతి మార్షల్స్‌ను పిలిచారు. పెద్దసంఖ్యలో వచ్చిన మార్షల్స్‌ తెలుగుదేశం సభ్యులను వెనక్కి పంపారు. అయితే వారు తమ స్థానాల ముందున్న ఖాళీ స్థలంలో నిలబడి బల్లలపై చేతులతో చరుస్తూ శబ్దాలు చేశారు.


స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనగాని సత్యప్రసాద్‌, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్‌, రామరాజులను బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకు.. అంటే ఈ నెల 25 వరకు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా ఎమ్మెల్యేలు బయటకు వెళ్లాలని ఆదేశించారు. వారికి సంఘీభావంగా మిగిలిన టీడీపీ సభ్యులు కూడా వాకౌట్‌ చేశారు.  వాకౌట్‌ చేసిన నిమ్మకాయల చినరాజప్ప, గద్దె రామ్మోహన్‌రావు, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, వేగుళ్ల జోగేశ్వరరావు, పీజీవీఆర్‌ నాయుడు తర్వాత కొంతసేపటికి మళ్లీ సభలోకి వచ్చారు. కల్తీ మద్యంపై న్యాయ విచారణ వేయాలని ఆందోళన చే శారు. ఈ దశలోనే రామ్మోహన్‌రావు, సాంబశివరావు తమతో తెచ్చుకున్న విజిల్స్‌ను ఊదారు. ఈ హఠాత్‌ పరిణామంపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇది పద్ధతేనా.. సంప్రదాయమేనా? కాల్‌ ద మార్షల్స్‌’ అని అన్నారు.


తెలుగుదేశం సభ్యులు స్పందిస్తూ.. ‘కల్తీమద్యంతో వందల మంది చనిపోతే శాసనసభ పట్టించుకోకపోవడం పద్ధతేనా.. సంప్రదాయమేనా’ అని ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం వస్తే చర్చకు అనుమతిస్తామని స్పీకర్‌ అనగా.. వారం నుంచీ పద్ధతి ప్రకారమే వస్తున్నా ఎక్కడ స్పందించారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ దశలో వైసీపీ సభ్యులు మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలను తక్షణం సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉండి సభలో విజిల్‌ వేసేందుకు సిగ్గులేదా అని రామ్మోహన్‌రావును విమర్శించారు. ఒక ఆడకూతురును అవమానించిన ఈ సభా ఒక సభేనా అంటూ ఆయనా నిలదీశారు. వైసీపీ సభ్యులు పద్ధతి, గౌరవం, సంప్రదాయాల గురించి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవాచేశారు. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. ‘చూస్తూ ఊరుకుంటే వేరే సంకేతాలు వెళ్తాయి. తెలుగుదేశం సభ్యులే మగాళ్లా’ అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సభాపతి వారించారు. ‘ఇదేమైనా చేపల బజారా.. అదేం పని? ఇలాంటి సంప్రదాయం సభలో ఎప్పుడైనా ఉందా? ఇది గౌరవ సభ’ అని టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. సాంబశివరావు స్పందిస్తూ.. ‘ఒకవైపు చనిపోతున్నా పట్టించుకోకపోవడం ఏం సంప్రదాయం? మార్షల్స్‌ను పెట్టి సభ నడిపించడం ఏం సంప్రదాయం’ అని ఎదురుప్రశ్నించారు. సభలో వారం నుంచి చేస్తున్న వ్యవహారాలపై ఒకసారి గుండెలమీద చేయి వేసుకుని ఆలోచించాలని తమ్మినేని వ్యాఖ్యానించారు.


‘మీరు కూడా ఒకసారి గుండెలమీద చేయివేసుకుని ఆలోచించండి.. ప్రాణాలు పోతున్నా పట్టకుంటే ఎలా’ అని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు.  వాదోపవాదాలు కొనసాగుతుండగానే రామ్మోహన్‌రావు, సాంబశివరావులను కూడా 25వ తేదీ వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. మిగిలినవారిని బుధవారం వరకు సస్పెండ్‌ చేస్తున్నామన్నారు.

బూతులా.. విజిలా.. ఏది పెద్ద నేరం?

సభలో బూతులు తిట్టడం.. విజిల్‌  మోగించడంలో ఏది పెద్ద నేరమవుతుందని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సభ నుంచి సస్పెండ్‌ చేశాక వారు అసెంబ్లీ ప్రాంగణం బయట మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడారు. ‘నిండు సభలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యల్లేవు. సభలో లేని సభ్యులను మంత్రులు బూతులు తిడితే వారిని సస్పెండ్‌ చేయలేదు. మేం సభను అటెన్షన్‌లోకి తేవాలని విజిల్‌ మోగిస్తే మమ్మల్ని సస్పెండ్‌ చేశారు. ఏది పెద్ద నేరం? ప్రజలు ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. 


ఫైబర్‌నెట్‌ టెండర్లలో అక్రమాలు

శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణ

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో పిలిచిన ఫైబర్‌నెట్‌ టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పక్ష సభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్‌, అబ్బయ్యచౌదరి, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్‌నాథ్‌ ఈ అంశంపై ప్రశ్న అడిగారు. టెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఆ టెండర్లలో పాల్గొనే అర్హతే లేదని.. బ్లాక్‌లిస్ట్‌లో ఉందని చెప్పారు. కానీ ఆ కంపెనీలో ఉన్న వేమూరి హరిప్రసాద్‌ ఆనాటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని.. అందుకే టెరాసాఫ్ట్‌ టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా బ్లాక్‌లిస్ట్‌ నుంచి ఎత్తేశారని ఆరోపించారు. సరిగ్గా టెండర్లకు ఒకరోజు ముందు 2015 ఆగస్టు 6న బ్లాక్‌లిస్ట్‌ నుంచి తీసేయగా.. మర్నాడే ఆ కంపెనీ టెండర్లు దాఖలు చేసిందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సీఐడీ విచారణ త్వరగా చేయిస్తామన్నారు. 

Updated Date - 2022-03-23T08:19:06+05:30 IST