నాటి బిహార్‌లా ఏపీ

ABN , First Publish Date - 2021-03-05T09:40:28+05:30 IST

‘‘ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లేలా రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై

నాటి బిహార్‌లా ఏపీ

రాష్ట్రంలో అభ్యర్థుల కిడ్నాప్‌, బెదిరింపులు

ప్రజల అభిమానమే ఉంటే ఇవన్నీ ఎందుకు?

ప్రశాంత విశాఖలో రౌడీలు, గూండాలతో అరాచకాలు

విజయసాయిరెడ్డి రాకతో పెరిగిన భూదందాలు: లోకేశ్‌


విశాఖపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లేలా రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఇళ్లు, ఆస్తులు, వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారు. బిహార్‌లో గతంలో ఎన్నికల సమయంలో అభ్యర్థులను కిడ్నాప్‌ చేయడం, బెదిరించడం, పాశవికంగా దాడులు చేసిన ఘటనలు చూశాం. అదే మాదిరిగా రాష్ట్రంలో గడచిన నెల రోజుల నుంచి అరాచకకాండ కొనసాగుతోంది. ప్రజల అభిమానం ఉందని అనుకుంటే కిడ్నా్‌పలు, బెదిరింపులు ఎందుకు? వాస్తవంగా చెప్పాలంటే... జగన్‌ పిరికోడు. కాబట్టే తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.


ఎన్నికల ప్రచారం కోసం గురువారం విశాఖపట్నం విచ్చేసిన ఆయన స్థానికంగా టీఎన్‌ఎ్‌సఎఫ్‌ ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖిలోనూ, పాతగాజువాక, పెదగంట్యాడ, నడుపూరు, చినగంట్యాడ, కూర్మన్నపాలెం, అక్కిరెడ్డిపాలెం, భీమిలి, తగరపువలస, అనకాపల్లి ప్రాంతాల్లో రోడ్‌షోల్లోనూ మాట్లాడారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి, మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘‘ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికల వరకు ఏకగ్రీవాల పేరిట అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, దురాగతాలు హద్దు మీరాయి.  ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు. దురదృష్టకరమైన అంశమేమిటంటే... వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాల కంటే పోలీసుల తీరు ఆందోళనకరంగా ఉంది. డీజీపీ వైసీపీ కండువా కప్పుకొని పనిచేస్తున్నారు. రిటైరైన తరువాత రాజ్యసభ సభ్యత్వం వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అనేక పథకాల పేరిట ఈ చేత్తో రూ.100 ఇచ్చి... ఆ చేత్తో రూ.1000 తీసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని గడగడలాడించి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డిని... ఇప్పుడు అదే ఢిల్లీ పెద్దలు గడగడలాడిస్తున్నారు’’ అని లోకేశ్‌ విమర్శించారు.


‘ఒక్క చాన్స్‌... ఒక్క చాన్స్‌ అని అడిగాడని ఓటేస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేశాడు. రెండోసారి అవకాశం ఇస్తే విశాఖపట్నాన్నే అమ్మేస్తాడు. తరువాత రాష్ట్రాన్ని అమ్మేస్తాడు’ అంటూ సీఎం జగన్‌రెడ్డిపై లోకేశ్‌ విరుచుకుపడ్డారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు విశాఖ నగర ప్రజలు అంగీకరించినట్టేనని, ఇప్పుడు చేస్తున్న పోరాటాలన్నీ వృథా అవుతాయని, భవిష్యత్తు తరాల వారికి ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయని లోకేశ్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది దరిద్రపు పాదమని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా వుండే విశాఖ నగరంలో గూండాలు, రౌడీలతో అరాచకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. విశాఖ నగరానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి వచ్చిన తరువాత భూదందాలు, కబ్జాలు పెరిగాయన్నారు. ‘విశాఖ నీ యబ్బ సొత్తా!.. మీ మంత్రుల భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు సొత్తా..!’ అని లోకేశ్‌ నిలదీశారు. ప్రజలపై పన్నులు వేసి తిరిగి  బెదిరిస్తావా? అంటూ ప్రభుత్వంపై విరుకుచుపడ్డారు.

Updated Date - 2021-03-05T09:40:28+05:30 IST