కమీషన్ల కోసమే కరకట్ట పనులు: టీడీపీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-07-04T17:11:14+05:30 IST
కమీషన్ల కోసమే కరకట్ట పనులు చేపట్టారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు.
అమరావతి: కమీషన్ల కోసమే కరకట్ట పనులు చేపట్టారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని, అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి స్వార్థ నిర్ణయంతో 5 కోట్ల మంది ప్రజల జీవితాలు నాశనం అయ్యానన్నారు. 565 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే కేసులు పెడతారా? అంటూ దుయ్యబట్టారు. రూ.250 కోట్లతో చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించి 80 శాతం పూర్తి చేశారన్నారు. వైసీపీ నేతలు అక్రమంగా తోడుకుంటున్న గ్రావెల్, ఇసుక రవాణాకు మార్గం సుగుమం చేసేందుకు కరకట్ట పనులు చేపట్టారని విమర్శించారు. రాజధానికి ఇచ్చిన భూముల్లో 1689 ఎకరాలను బిల్డ్ ఏపీ కింద అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రజల ఆస్తులను అమ్ముకుంటూ చేసేది పరిపాలనా? అంటూ ప్రశ్నించారు. మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల్లో భూకబ్జాలు తప్ప మూడు తట్టల మట్టి కూడా వేయలేదని ఎమ్మెల్యే సాంబశివరావు విమర్శించారు.