సినీ కార్మికులను బలి తీసుకుంటారా? : Anagani

ABN , First Publish Date - 2021-12-31T16:01:32+05:30 IST

సినిమా థియేటర్ల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సినీ కార్మికులను బలి తీసుకుంటారా? : Anagani

అమరావతి: సినిమా థియేటర్ల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ధియేటర్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమను జగన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం బలిపెడుతున్నారన్నారు. తనిఖీల పేరుతో థియేటర్లు మూసివేయటంతో అందులో పనిచేస్తున్న అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. ఉచిత ఇసుక రద్దు చేసి వందలాది మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్నట్టు సినీ కార్మికులను బలి తీసుకుంటారా?  ఆయన అని ప్రశ్నించారు. సినీ రంగాన్ని జగన్ రెడ్డి వేధింపులకు గురి చేస్తుంటే సినీ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు.


‘‘సినిమాల్లో చూపించే మీ హీరోయిజం సినీ పరిశ్రమను వేధింపులకు గురిచేస్తున్న జగన్ సర్కార్‌పై ఎందుకు చూపించటం లేదు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో స్టూడియోలకు గత ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం ఇవ్వకున్నా ఎందుకు  నోరుమెదపలేదన్నారు. తమరు రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారు తప్ప రియల్ హీరోలుగా మారరా? అని ప్రశ్నించారు. కావేరి నది జలాలు సమస్యపై అక్కడి సినీ పరిశ్రమంతా ఏకతాటిపై వచ్చారని,  జల్లికట్టు అంశంపై తమిళ హీరోలంతా స్పందించారని గుర్తుచేశారు.  కానీ ‘‘రాష్ట్రంలోని సమస్యలపై మీరెందుకు స్పందించటం లేదు? మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? మీ సినిమాలు ప్రజలు చూడాలి కానీ, వారి కష్టాలు మీకు పట్టవా?’’ అంటూ సినీ హీరోలపై కూడా అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-12-31T16:01:32+05:30 IST