సుప్రీం ఆదేశాలతో జగన్‌కు భయం పట్టుకుంది: యనమల

ABN , First Publish Date - 2020-09-17T16:31:51+05:30 IST

అవినీతి, ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో జగన్‌కు భయం పట్టుకుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

సుప్రీం ఆదేశాలతో జగన్‌కు భయం పట్టుకుంది: యనమల

అమరావతి: అవినీతి, ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో జగన్‌కు భయం పట్టుకుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ దేశంలోని హైకోర్టుల నుంచి ఈ తరహా కేసుల కార్యాచరణ కూడా సుప్రీంకోర్టు సిద్ధం చేయమందని అన్నారు. ఓ ఆంగ్ల దినపత్రిక వ్యాసం ప్రకారం దేశంలో పెండింగ్‌లో 4 వేల కేసుల్లో 2500 రాజకీయ నేతలవే ఉన్నాయని తెలిపారు. వీటిలో 12 ఛార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో జగన్‌పై దాఖలు చేసినవే అని చెప్పుకొచ్చారు. విచారణకు భయపడిన జగన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని... అందులో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం, ఏసీబీ విచారణలు తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. 


ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై విచారణ అనటం విడ్డురంగా ఉందన్నారు. అది చట్టవ్యతిరేకo కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని అన్నారు. పత్రికా హక్కుల గురించి ప్రకటన ఇచ్చే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి  రెండుసార్లు ఆలోచన చేయాలని.. సొంత మీడియా సాక్షి నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తోందో ఆత్మవిమర్శ చేసుకోవాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు. 

Updated Date - 2020-09-17T16:31:51+05:30 IST