రైతులు దొంగలని మీటర్లు పెడుతున్నారా?

ABN , First Publish Date - 2022-05-18T09:54:29+05:30 IST

‘‘వ్యవసాయానికి కరెంటు వాడుతున్న రైతులంతా దొంగలన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

రైతులు దొంగలని మీటర్లు పెడుతున్నారా?

సోమిరెడ్డి ఫైర్‌


అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘‘వ్యవసాయానికి కరెంటు వాడుతున్న రైతులంతా దొంగలన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. పొలాల్లో మోటార్లకు మీటర్లు పెడితే 30 శాతం కరెంటు ఆదా అవుతుందని మంత్రులు ప్రచారం చేస్తున్నారు. మీటర్లు పెడితే కరెంటు ఎలా ఆదా అవుతుంది? అంటే రైతులు కరెంటు దొంగతనం చేస్తుంటే దానిని అరికట్టడానికి మీటర్లు పెడుతున్నారా? ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతులు మీకు దొంగల్లా కనిపిస్తున్నారా?’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ‘‘అప్పులు తెచ్చుకోవడానికి ఇటువంటి దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకొంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు మీటర్లు పెట్టడానికి నిరాకరించాయి. ఆ మాట చెప్పే దమ్ము లేక వైసీపీ ప్రభుత్వం రైతుల మెడకు ఉరి బిగిస్తోంది’’ అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి కొత్త కనెక్షన్లు ఇవ్వడం నిలుపుచేశారన్నారు. వైసీపీ అసమర్థ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం దండగగా మారి రైతులు ఆత్మహత్యలపాలు కావాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల వేదిక, స్వరాజ్య వేదిక సంయుక్తంగా చేసిన సర్వే నిజం కాదనుకొంటే వాటిపై కేసు పెట్టండి. లేదా ఆ రైతు కుటుంబాలు అన్నింటికీ పరిహారం ఇవ్వండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకొంటూ, చనిపోయిన రైతుల కుటుంబాలను బాధ పెట్టవద్దు’’ అని సోమిరెడ్డి సూచించారు.

Updated Date - 2022-05-18T09:54:29+05:30 IST