ఆ సభ సీఎం జగన్ కళ్లు తెరిపిస్తుంది: Prathipati

ABN , First Publish Date - 2021-12-16T19:57:59+05:30 IST

అమరావతి రైతులు నిర్వహిస్తున్న తిరుపతి సభ జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిపిస్తుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

ఆ సభ సీఎం జగన్ కళ్లు తెరిపిస్తుంది: Prathipati

అమరావతి:  అమరావతి రైతులు నిర్వహిస్తున్న తిరుపతి సభ జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిపిస్తుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయనే రైతులు ప్రాణ సమానమైన భూముల్ని అమరావతికి ఇచ్చారన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు నిర్మిస్తాడా?  అని ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా తన దుర్మార్గపు ఆలోచనలకు స్వస్తి చెప్పి మంచి మనసుతో  కళ్లుతెరుస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రకటనచేస్తే ఈప్రభుత్వానికి మంచిదన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్రకు ప్రజలంతా స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించడమే కాకుండా లక్షలాది రూపాయల చందాలిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే రైతుల పాదయాత్రకు పోలీసులు, అధికారులు అడ్డంకులు సృష్టించారని ఆయన మండిపడ్డారు. పునర్విభజన చట్టంలోని నిబంధన ప్రకారమే శివరామకృష్ణన్ కమిటీని నియమించారన్నారు. సదరు కమిటీ ప్రజాభిసేకరణ చేపడితే, మెజారిటీ భాగం ప్రజలు అమరావతే రాజధానిగా ఉండాలన్నారని చెప్పారు.


రాజధాని 15 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉండటంతో పాటు, ఆ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలు 32 శాతం వరకు ఉన్నారని వెల్లడించారు. కావాలనే జగన్ ప్రభుత్వం అమరావతిపై కులముద్ర వేసి దుష్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఐటీ అభివృద్ధితో పాటు, లులూ గ్రూప్, విశాఖ-చెన్నై పారిశ్రామక కారిడార్ వంటి వాటికి, గత ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు.  రాయలసీమలో కియా పరిశ్రమతో పాటు, సాగు, తాగు నీటిప్రాజెక్ట్‌లు, హెచ్‌సీయల్, కియా వంటి పరిశ్రమల స్థాపన జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటయ్యేలా చేసి, టీడీపీ ప్రభుత్వమే అభివృద్ధి వికేంద్రీకరణకు అంకురార్పణచేసిందని చెప్పుకొచ్చారు. రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణంతో పాటు, అధికారుల వసతి గృహాల నిర్మాణం 70శాతం వరకు పూర్తయిందని తెలిపారు. రాజధానికి రూ.లక్షకోట్లు ఖర్చవుతుందని, 13 జిల్లాలు వెనకబడతాయన్న పాలకుల మాటలు పచ్చి అబద్ధాలన్నారు.  ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదని, అమరావతికి మధ్ధతిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక తప్పుడు కమిటీలతో రాజధానికి వ్యతిరేకంగా పనికిమాలిన నివేదికలు ఇప్పించారని మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో  ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. రెండున్నరేళ్ల పాలన పూర్తైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు, ఓట్ల కోసమే పిచ్చిపిచ్చి ప్రకటనలు చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. 


Updated Date - 2021-12-16T19:57:59+05:30 IST