Abn logo
Feb 14 2020 @ 12:56PM

‘వైసీపీ దుష్ప్రచారం.. ఐటీ దాడుల వెనక అసలు కథ ఇది’

అమరావతి: ఐటీ దాడులపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఖండించారు. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా టీడీపీ నేతల పేర్లు ప్రస్తావనకు రాకపోయినా.. కల్లుతాగిన కోతుల్లా తమ పార్టీకి అవినీతి మరకలను అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ కేసులపై, అవినీతిపై చర్చకు రాగలరా అని ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. అవినీతిలో ఆరితేరిన నేతలు తమ అధినేతను విమర్శించడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు జరిగినా టీడీపీకి అంటగట్టడమేంటని ప్రశ్నించారు. ఎంత సేపూ టీడీపీ నేతలపై విమర్శలు చేస్తుంటారని.. ఆధారాలు లేకుండా ఎలా వ్యాఖ్యానిస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో మొత్తం 2.75లక్షల ఎకరాలని వైఎస్ జగన్ కొట్టేశారని ఆరోపించారు. అలాంటి చక్రవర్తులకు తమ అధినేతను విమర్శించే స్థాయి లేదన్నారు. జగన్ మొత్తం 16 కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఈ విషయాలపై వైసీపీ నేతలు నోరు మెదపరని విమర్శించారు.  


2012 నుంచి జగన్‌పై కోర్టు అక్షింతలు వేస్తున్నా.. అక్రమాస్తుల కేసులో జగన్ గైర్హాజరవుతున్నారన్నారు. ఇంత అవినీతి ముఖ్యమంత్రిని పెట్టుకుని తమపై బురదజల్లడమేంటన్నారు. లేని అవినీతి మరకలు సృష్టిస్తున్నారన్నారు. 35 వారాలు కోర్టు కెళ్లకుండా సాకులు వెతుక్కుంటున్నారన్నారు. నిస్సిగ్గుగా ఇవాళ కూడా కోర్టుకు హాజరకాకుండా ఢిల్లీ వెళ్లారన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐటీ దాడులపై టీడీపీ నేతలు స్పందించడం లేదంటూ విమర్శలు చేస్తున్న నేతలు.. తాము మాట్లాడితే ఎదుర్కొనే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. సవాల్ విసిరితే జాబు చెప్పలేరని విమర్శించారు. చంద్రబాబుపై దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 26 విచారణలు జరిపి.. ఏమీ చేయలేకపోయారన్నారు. 2006 పేజీలతో విజయమ్మ సుప్రీం కోర్టుకు వెళితే.. అవన్నీ నిరాధారమైనవని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయం మర్చిపోయారా.. దేశంలో ఎక్కడా జగన్ లాంటి నేతను చూడలేదన్నారు. 


Advertisement
Advertisement
Advertisement