జగన్ ముందుకు వస్తే ప్రత్యేక హోదా కోసం కలిసి నడుస్తాం: Nakka Anandbabu

ABN , First Publish Date - 2022-02-20T17:57:46+05:30 IST

సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే టీడీపీ పక్షాన ప్రత్యేక హోదా కోసం కలిసి నడుస్తామని ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.

జగన్ ముందుకు వస్తే ప్రత్యేక హోదా కోసం కలిసి నడుస్తాం: Nakka Anandbabu

విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే టీడీపీ పక్షాన ప్రత్యేక హోదా కోసం కలిసి నడుస్తామని ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హోదా పదేళ్లు కావాలన్న బీజేపీ పెద్దలు కూడా మాట్లాడాలని అన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని జగన్ చెప్పారని, ఈ మూడేళ్లలో సీఎం చేసిందేమిటో... చెప్పాలని డిమాండ్ చేశారు. మెడలు వంచినోళ్లు వంచినట్లే ఉంటూ మోదీ దగ్గర సాగిలపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులు తొలగించుకునేందుకు దించిన మెడను ఎత్తడం మానేశారన్నారు. ఈ వైసీపీ నాయకులా... మా గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. టీడీపీ నాడు బయటకు వచ్చి ఎలా పోరాడిందో అందరికీ తెలుసన్నారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలని అన్నారు. 


విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా ఏపీకి న్యాయం జరగలేదన్నారు. గాయం తీవ్రత తగ్గకపోగా.. పుండు మీద కారం జల్లిన చందంగా మోదీ ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. మొన్న మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలిగిందన్నారు. 2014లో మాతో కలిసి ప్రచారం చేసి.. ఏపీకి న్యాయం చేస్తాం అన్నారని గుర్తుచేశారు. అధికారాన్ని అనుభవిస్తూ ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు. మోదీకి ఇది సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిస్తే ఏపీకి న్యాయం జరుగుతుందని చంద్రబాబు భావించారని...అందుకే కలిసి ప్రభుత్వంలో చేరి ముందుకు నడిచామని తెలిపారు. ఆ తర్వాత మోదీ మోసం తెలుసుకుని పొత్తు నుండి బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-02-20T17:57:46+05:30 IST