కాపులకు చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-07-05T18:52:11+05:30 IST

కాపులకు చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత: కళా వెంకట్రావు

కాపులకు చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత: కళా వెంకట్రావు

అమరావతి: కాపు సామాజికవర్గంపై ఏడాది కాలంగా నిర్లక్ష్యం, నిర్లిప్తతను నిరసిస్తూ టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. కాపులకు చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత అని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపించే తరహాలో బడ్జెట్ లెక్కలు ఉన్నాయని...బడ్జెట్ మొత్తం అబద్దాలే తప్ప అద్భుతాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. అధికారం కోసం సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లపై ప్రసంగాలు అదిరిపోయేలా ఇచ్చి.. వాస్తవంలో చేస్తున్నదేంటి అని నిలదీశారు. సంక్షేమ పథకాలు, నామినేటెడ్ పదవుల్లో అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా అని లేఖలో పేర్కొన్నారు. కాపులకు రాజకీయ, సామాజిక, ఆర్ధిక గుర్తింపు తెలుగుదేశంతోనే సాధ్యమైందని తెలిపారు. రెండు దశాబ్దాల క్రితమే ఐదు రాజ్యసభ, ఐదు లోక్‌సభ సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. 


కాపు యువతకు స్వయం ఉపాధి రుణాలు ఏమయ్యాయని...స్కిల్ డెవలప్ సెంటర్లు, ఉచిత కోచింగ్ సెంటర్లు ఏమయ్యాయని...కాపు కార్పొరేషన్ నుండి అమ్మఒడికి రూ.568 కోట్లు మళ్లించడం సంక్షేమమా అని ప్రశ్నించారు. బలిజల పార్లమెంటు స్థానమైన రాజంపేటను సొంత సామాజిక వర్గానికి కేటాయించలేదా అని ఆయన నిలదీశారు. 5% రిజర్వేషన్లపై కేంద్రం వద్ద ఎందుకు మాట్లాడలేకపోతున్నారని అడిగారు. కాపు నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం వాస్తవం కాదా అని... కాపు మహిళలు 25 లక్షలుంటే 2.35 లక్షల మందికే కాపు నేస్తం మోసం కాదా అని మండిపడ్డారు. పెన్షన్, రేషన్‌ను కూడా కార్పొరేషన్ నిధులుగా చూపడం దివాళాకోరు తనమని వ్యాఖ్యానించారు. కులాల మధ్య కుంపట్లు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ‘‘మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాన్నారు కానీ వంచనా కళలో మిమ్మల్ని మించిన వారు లేరనిపించుకున్నారు.  వంచించడం, వేధించడం మాని విజ్ఞతతో పాలిస్తారని ఆశిస్తున్నాం’’ అని కళా వెంకట్రావు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-05T18:52:11+05:30 IST