రెండేళ్లలో వస్తా.. రెట్టింపు హింసిస్తా వైసీపీ నేతలూ ఖబడ్దార్‌

ABN , First Publish Date - 2022-01-07T08:18:23+05:30 IST

వైసీపీ నాయకులు మా పార్టీ కార్యకర్తలను చాలారకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తాను. ఒకటీ రెండు కాదు.. 20 సార్లు రెట్టింపుగా..

రెండేళ్లలో వస్తా.. రెట్టింపు హింసిస్తా వైసీపీ నేతలూ ఖబడ్దార్‌

  • నా కార్యకర్తలపై చేయిపడితే నాపై వేసినట్లే
  • ప్రాణం అడ్డుపెట్టి కాపాడుకుంటా
  • విభజన కంటే జగన్‌ వల్లే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం
  • మళ్లీ కుప్పం నుంచే గెలుస్తా కుప్పం పర్యటనలో బాబు

టీడీపీ కార్యకర్తలపై చేయిపడితే నాపై పడినట్లే. ప్రాణం అడ్డుపెట్టి కాపాడుకుంటాను. నేను నమ్ముకున్న స్థానిక నాయకులు సరిగా పనిచేయకే కుప్పంలో ఓడిపోవాల్సి వచ్చింది. స్థానిక ఎన్నికల ఫలితాలు బాధించాయి. ఇక నుంచి 3 నెలలకోసారి కుప్పం వచ్చి ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటాను.

చంద్రబాబు


కుప్పం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నాయకులు మా పార్టీ కార్యకర్తలను చాలారకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తాను. ఒకటీ రెండు కాదు.. 20 సార్లు రెట్టింపుగా హింసిస్తాను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించా రు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం కుప్పం, రామకుప్పం మండలాల్లోని 8 గ్రామాల్లో పర్యటించారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఆయన పర్యటించడం ఇప్పుడే. టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. గురువారం అర్ధరాత్రి వరకు రోడ్‌ షోలు నిర్వహించారు. ‘అమ్మకు అన్నం పెట్టని.. చెల్లిని అవసరానికి ఉపయోగించుకుని వదిలేసిన వ్యక్తి జగన్‌. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎన్నో విధ్వంసాలు సృష్టించారు. విభజన కంటే ఆయన సీఎం కావడం వల్లే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగింది. రాజధాని అమరావతిని కాపాడుకుంటే రూ.2 లక్షల కోట్ల సంపదను కాపాడుకున్నట్లే’ అని ఈ సందర్భంగా తెలిపారు.


‘మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓడిపోయినప్పుడు.. మీ నాయకుడిని చూడాలని ఉంది.. అసెంబ్లీలో ఆయన బాధ పడుతుంటే చూడాలని ఉందని మా నాయకుడు అచ్చెన్నాయుడికి సీఎం జగన్‌ చెప్పి పంపించారు. 2014లో జగన్‌ కూడా ఓడిపోయారు. కానీ నేనలా మాట్లాడలేదు. జగన్‌ పుట్టకముందే ప్రభుత్వాలు పేదవారి కోసం పక్కాగృహాలను కట్టించి ఇచ్చాయ ని.. ఇప్పుడు ఎవడబ్బ సొమ్మని ఆయన వారి నుంచి రూ.పదేసి వేలు వసూలు చేస్తున్నాడని చంద్రబాబు నిలదీశారు. రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తానని.. వచ్చిన నెలలోనే ఓటీఎస్‌ డబ్బులు కట్టకుండా మాఫీ చేస్తానన్నారు.


‘నేను నమ్ముకున్న స్థానిక నాయకులు సరిగా పనిచేయకపోవడంతో కుప్పంలో ఓడిపోవాల్సి వచ్చింది. కుప్పం ఫలితాలు నన్ను బాధించాయి. ఇక నుంచి 3 నెలలకోసారి కుప్పం వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటాను. కుప్పాన్ని సరిచేస్తా. కుప్పంలోనే పోటీ చేస్తా. ఇక్కడే గెలుస్తా. పార్టీలో కోవర్టులుంటే గుర్తించి బయటకు పంపిస్తా. బాగా పనిచేసే వారికి ప్రమోషన్‌ ఇస్తా’ అన్నారు.


హౌసింగ్‌ బిల్లులకు లంచం అడుగుతున్నారు

చంద్రబాబుకు వలంటీర్‌  ఫిర్యాదు

హౌసింగ్‌ బిల్లు మంజూరు చేసేందుకు అధికారులు రూ.15 వేలు లంచం అడుగుతున్నారని చంద్రబాబుకు ఓ వలంటీర్‌  ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి నారాయణపురం తండాలో జరిగిన రచ్చబండలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ‘నీలాంటి మంచోళ్లు కూడా వలంటీర్లుగా ఉన్నారు. రేపు నిన్ను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. అయినా అధైర్యపడకు నేనున్నా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.


వన్‌సైడ్‌ లవ్‌ కూడదు..

రామకుప్పం మండలం వీర్నమల తాండాలో రోడ్‌షో, బహిరంగ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదా అని చంద్రబాబును ఓ కార్యకర్త ప్రశ్నించారు. దానికి ఆయన చమత్కారంగా బదులిచ్చారు. ‘ఇద్దరు ప్రేమించుకుంటే అది పెళ్లి వరకు వెళ్తుంది. వన్‌ సైడ్‌ లవ్‌ పనికిరాదు కదా! మనం జనసేనను ప్రేమిస్తున్నాం. జనసేన కూడా కలిసి రావాలి కదా’ అని వ్యాఖ్యానించారు. అలాగే.. స్థానిక నాయకత్వాన్ని మార్చాలని పలువురు ప్రజలు బహిరంగంగా కోరారు. పార్టీని ప్రక్షాళన చేసేందుకే వచ్చానని, ఇక నుంచి మూడు నెలలకోసారి కుప్పం వస్తానని ఆయన మాటిచ్చారు.


బీసీలను అవమానించారు

టీడీపీ బీసీ నేతల విమర్శలు

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘‘బీసీలకు సంక్షేమం ఆపేశారు. పథకాలు మధ్యలోనే నిలిపేశారు. రిజర్వేషన్లను కుదించి బీసీల రాజకీయ నాయతక్వంపై గొడ్డలివేటు వేశారు. సలహాదారులు, నామినేటెడ్‌ పదవులు, ఇతర చైౖర్మన్ల పదవుల కేటాయింపు విషయంలో అర్హత, అనుభవం ఉన్న బీసీలకు కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలను అవమానించారు’’ అని తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్య నాయకుల సమావేశం విమర్శించింది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటై 40 ఏళ్లయిన సందర్భంగా ఆ పార్టీ బీసీ ముఖ్య నేతలు గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యా రు. ‘‘బీసీల ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో బీసీలను రాజకీయంగా, సామాజికంగా మరింత ముందుకు తీసుకెళ్లేలా అందరి అభిప్రాయాలు సేకరిస్తాం. బీసీల ఐక్యత, సంక్షేమం, అభ్యున్నతికి టీడీపీ 40 ఏళ్లుగా చేసిన కృషి అనిర్వచనీయం. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు టీడీపీతోనే సాధ్యమైంది’’ అని సమావేశం అభిప్రాయపడింది. వైసీపీ తీరు ను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతపై చర్చించింది. ఆ దిశగా 8తీర్మానాలు చేసింది.

Updated Date - 2022-01-07T08:18:23+05:30 IST