జగన్‌.. ఆ సీట్లో కూర్చోడానికి సిగ్గుందా?

ABN , First Publish Date - 2021-12-05T08:28:20+05:30 IST

‘కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు గేటు పాడైతే మరమ్మతు చేయలేని చేతగాని ప్రభుత్వ నిర్వాకం నలభై మంది ప్రాణాలు తీసింది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు..

జగన్‌.. ఆ సీట్లో కూర్చోడానికి సిగ్గుందా?

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు నిర్వహించలేని మీ నిర్వాకంతో అమాయకులు బలయ్యారు

షెకావత్‌ వ్యాఖ్యలపై మౌనమెందుకు?: చంద్రబాబు ఆగ్రహం

కనీసం వరద నీటి అంచనాలోనూ విఫలం

ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏమైంది?

గేట్లకు గ్రీజు పెట్టలేనివాళ్లకు 3 రాజధానులా? 


అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు గేటు పాడైతే మరమ్మతు చేయలేని చేతగాని ప్రభుత్వ నిర్వాకం నలభై మంది ప్రాణాలు తీసింది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రాజెక్టు గేట్లను సరిగా నిర్వహించలేని చేతగానితనం ఇప్పుడు ప్రపంచంలోని ఇంజనీర్ల మధ్య చర్చగా మారి దేశం పరువు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇవే వ్యాఖ్యలు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సాక్షాత్తూ పార్లమెంటులో చెప్పారని బాబు గుర్తు చేశారు. ‘‘కేంద్రం ఇంత మాట అన్న తర్వాత ఈ ముఖ్యమంత్రికి ఇంకా ఆ సీట్లో కూర్చోవడానికి సిగ్గుందా?’’ అని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలపై బాధ్యత ఉంటే కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని, చెప్పలేకపోతే ఆ పదవిలో ఉండటానికే ముఖ్యమంత్రి అనర్హుడని బాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంపై గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించారు. గేట్లకు గ్రీజు పెట్టడం చేతగానివాళ్లు మూడు రాజధానులు కడతామని హడావుడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘19వ తేదీ తెల్లవారు జామున అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయి ఐదారు గ్రామాల్లో బీభత్సం జరిగింది. అదే రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సొంత జిల్లాలో జరిగిన ప్రమాదాన్ని.. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యతను ఈ ముఖ్యమంత్రి గాలికి వదిలిపెట్టి కుప్పం ఎన్నికల్లో ఓడిపోయినందుకు నా మొహం చూడాలని అనిపిస్తోందని అసెంబ్లీలో వేళాకోళాలు ఆడుతూ కూర్చున్నారు.


ఇదేనా సభ్యత?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన చెయ్యేరు నదిలో వందల సంఖ్యలో లారీలు, ప్రొక్లెయిన్లు పెట్టి ఇసుక తోడుతున్నారని, అవి బయటకు రావడానికి ఇబ్బంది అవుతుందన్న కారణంతో ఇసుక మాఫియా కోసం ప్రాజెక్టు గేట్లు సకాలంలో మొత్తం ఎత్తకుండా ఉంచేశారని చంద్రబాబు విమర్శించారు. ఈ కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయిందని తాను వెళ్లినప్పుడు బాధిత గ్రామాల ప్రజలు చెప్పారన్నారు. కాగా ఎవరి హయాంలోనో పేదలు కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు.. ఏ అధికారంతో డబ్బులు వసూలు చేస్తారని సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన నెలలోనే అందరికీ ఉచితంగా పట్టా ఇస్తామన్నారు.   

Updated Date - 2021-12-05T08:28:20+05:30 IST