మేం 1800 కొన్నాం
ABN , First Publish Date - 2020-07-03T09:15:43+05:30 IST
మేం 1800 కొన్నాం
- మీలాగా అప్పుడు షో చేయలేదు...
- అంబులెన్సులు మొదటిసారి పెట్టినట్లు విపరీత ప్రచారం
- కరోనా కాలంలో ప్రజలకేం చేశారు?..
- కేంద్రం బియ్యం, పప్పు ఇస్తోంది.. కుటుంబానికి కనీసం 5 వేలివ్వాలి
- అచ్చెన్నాయుడి పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు
- అతి చేస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు
- అమర్‌రాజాకు తండ్రి భూములిస్తే కొడుకు రద్దు చేశాడు
- సొంత కంపెనీ కోసం సీఎం అధికార దుర్వినియోగం
- టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం
- అమరావతి జేఏసీ పిలుపునకు మద్దతు
కరోనా కష్ట కాలంలో కేంద్రం తన వంతు బాధ్యతగా ప్రజలకు బియ్యం, పప్పు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
‘ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడిని తీసుకెళ్లి కరోనా చికిత్సలు జరుగుతున్న ఆస్పత్రిలో పెట్టారు. దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో ఉన్న ఉత్సాహం ప్రజలను ఆదుకోవడంలో లేదు.’
‘కొందరు అధికారులు అతిగా మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తమ తప్పుడు పనులకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో జగన్ కేసుల్లో ఇలాగే కొందరు అధికారులు జైలుపాలయ్యారు.’
‘ఏడాది నుంచి అంబులెన్సులను పక్కన పెట్టారు. పెద్ద ఘనకార్యం సాధించినట్లు కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించారు.’
అమరావతి, జులై 2 (ఆంధ్రజ్యోతి): కరోనా కాలంలో ఆదాయాలు తగ్గిపోయి.. ప్రజలు ఆర్ధికంగా నష్టపోతే వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిలదీశారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం తన వంతు బాధ్యతగా ప్రజలకు బియ్యం, పప్పు ఇస్తోంది. వివిధ వర్గాల ప్రజలను ఆదుకోవడానికి రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. కరోనా సమయంలో రాష్ట్రానికి రూ.8 వేల కోట్ల సాయం చేసినట్లు కేంద్ర ఆర్ధికమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఏమీ చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కనీసం తన వంతుగా ఇంటికి రూ.ఐదు వేల సాయం తక్షణం ఇవ్వాలి. రాష్ట్రాల రుణ పరిమితిని కేంద్రం పెంచింది. దానిని వాడుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలి’ అని సూచించారు.
కరోనాను అదుపు చేయడంలోనూ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ‘పొరుగు రాష్ట్రాల్లో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ మొత్తం దక్షిణాదిలో గ్రామీణ జిల్లాల్లో వైరస్ కేసులు మన వద్దే ఎక్కువ ఉన్నాయి. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వైరస్ వ్యాపించినట్లు మరే రాష్ట్రంలో, జిల్లాల్లో వ్యాపించలేదు. చివరకు హైకోర్టును కూడా మూయాల్సిన పరిస్ధితి తెచ్చారు. పరీక్షల ఫలితాల్లో జాగ్రత్త తీసుకోవడం లేదు. వైసీపీ నేతలు అడ్డగోలు కార్యక్రమాలతో తామే వైరస్ వ్యాప్తికి సూపర్ స్ర్పెడర్లుగా మారుతున్నారు’ అని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..
రాజకీయ కక్షలకు ఇదా సమయం?
‘ఈ సమయంలో కూడా రాజకీయ కక్షలు మానడం లేదు. నాలుగు రోజులాగి అరెస్టులు చేయలేరా? ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడిని తీసుకెళ్లి కరోనా చికిత్సలు జరుగుతున్న ఆస్పత్రిలో పెట్టారు. దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో ఉన్న ఉత్సాహం ప్రజలను ఆదుకోవడంలో లేదు. కేవలం ఒక లేఖను సాకుగా చూపించి అచ్చెన్నను వేధిస్తున్నారు. కొందరు అధికారులు అతిగా మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తమ తప్పుడు పనులకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదు.’
వేధింపులే ఎజెండా..
‘రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి వేధింపులే ఎజెండాగా జగన్ ప్రభుత్వం పని చేస్తోంది. అమర్‌రాజా కంపెనీ రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లింపుదారు. 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఆ కంపెనీకి రాజశేఖరరెడ్డి భూములు ఇస్తే వాటిని కొడుకు రద్దు చేశారు. సొంత కంపెనీ సరస్వతి ఇండస్ట్రీ్‌సకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. నీళ్లు, భూములు ఇచ్చుకున్నారు. ఇతరులకు మాత్రం వేధింపులు బహుమానంగా ఇస్తున్నారు. ఇళ్ల స్ధలాలకు భూముల కొనుగోలు పేరుతో ప్రతి జిల్లాలో కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారు. గురజాలలో దళిత యువకుడిని పనిగట్టుకొని హైదరాబాద్ నుంచి పిలిపించి మరీ హత్య చేశారు.’
నేనూ ఆందోళనలో పాల్గొంటా..
‘రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జేఏసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు టీడీపీ మద్దతిస్తోంది. నేను కూడా రైతులకు సంఘీభావంగా ఉండవల్లిలో నా నివాసం నుంచి నిరసనలో పాల్గొంటాను. జేఏసీ పిలుపునకు అందరూ స్పందించాలి.’
800 రాజకీయ దాడులు..
‘ఈ ఏడాదిలో 800 రాజకీయ దాడులు జరిగాయి. 12 మంది టీడీపీ వారిని చంపేశారు. కోడెల సహా ఏడుగురు వీరి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో 54 మంది రైతులు మరణాలపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. భవన నిర్మాణ కార్మికులు అరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదొక పాలనా? 90 శాతం హామీలు పూర్తి చేశామని చంకలు గుద్దుకొంటున్నారు. వాగ్దానం ప్రకారం పేదల పింఛను రూ. మూడు వేలు చేశారా?’
రంగుల పిచ్చి
‘విజయసాయిరెడ్డికి పుట్టిన రోజు కానుకగా ఆయన అల్లుడి కంపెనీకి అంబులెన్సుల కాంట్రాక్టు ఇచ్చారు. ఇందులో రూ.300 కోట్ల అవినీతి చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పుడే మొదటిసారి అంబులెన్సులు పెట్టినట్లుగా పెద్ద ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో 1800 అంబులెన్సులు కొన్నాం. సంచార వైద్యశాలలు పెట్టాం. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు పెట్టాం. చనిపోయిన వారిని గౌరవప్రదంగా ఇంటికి చేర్చడానికి మహా ప్రస్ధానం వాహనాలు పెట్టాం. గిరిజన ప్రాంతాల కోసం ద్విచక్ర అంబులెన్సులు ప్రవేశపెట్టాం. అవసరమైనప్పుడు ఆక్సిజన్ ఇవ్వడానికి...గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స ఇవ్వడానికి అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను అంబులెన్సుల్లో పెట్టాం.
శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి మనిషి చనిపోయిన సందర్భాల వరకూ ఆదుకునే ఏర్పాట్లు చేశాం. మేం షో చేయలేదు. పని చేశాం. అంబులెన్సులకు ప్రపంచమంతా ఒక రంగు ఖరారై ఉంది. రంగుల పిచ్చి పట్టి దానిని కూడా ఉల్లంఘించారు. చిన్న పరిశ్రమలకు రూ.900 కోట్ల బకాయిలు రెండు దఫాలుగా ఇచ్చి ఐదుసార్లు ప్రకటనలు వేయించుకున్నారు. వీరి రంగుల పిచ్చికి రూ.1,300 కోట్లు వృఽథాగా తగలబెట్టాల్సి వచ్చింది. రంగుల కోసం రెండుసార్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడంపై సుప్రీం కోర్టుకు వెళ్లమంటే మాత్రం వెళ్లలేదు.’
వీళ్లు తప్పితే ఎవరూ లేరా?
‘ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కుతున్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పంచారు. ఒకరు తన కేసుల్లో సహ నిందితుడు.. మరొకరు తన బాబాయి.. ఇంకొకరు తన ఆఫీసులో పనిచేసే వ్యక్తి. వీళ్లు తప్ప మరొకరు లేరా? డీజీపీ కార్యాలయంలో ఒక వ్యక్తిని పెట్టి రోజూ ఎవరెవరిపై కేసులు పెట్టాలో డైరెక్షన్స్ ఇప్పిస్తున్నారు. ఇదే మాదిరిగా మేమూచేసి ఉంటే మీరు సోదిలో ఉండేవారా? మీరు ఎంత వేధించినా పోరాడతాం.’