వైసీపీ దుర్మార్గాలకు తిరుపతి ప్రజలు బుద్ధిచెప్పాలి: చంద్రబాబు పిలుపు

ABN , First Publish Date - 2021-01-16T20:48:58+05:30 IST

వైసీపీ దుర్మార్గాలపై ప్రజా తీర్పునకు తిరుపతి ఉప ఎన్నిక తొలి పరీక్షలాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

వైసీపీ దుర్మార్గాలకు తిరుపతి ప్రజలు బుద్ధిచెప్పాలి: చంద్రబాబు పిలుపు

అమరావతి: వైసీపీ దుర్మార్గాలపై ప్రజా తీర్పునకు తిరుపతి ఉప ఎన్నిక తొలి పరీక్షలాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి పార్లమెంట్ టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి ఉప ఎన్నిక ద్వారా ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.


వైసీపీ దుర్మార్గాలపై ప్రజల్లో తిరుగుబాటు

‘గత 20 నెలలుగా వైసీపీ దుర్మార్గాలను ఎక్కడికక్కడ నిగ్గదీశాం. బాధిత వర్గాల ప్రజలకు అండగా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులను నిరసించాం. వీరోచిత పోరాటం చేసేవాళ్లకే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. అనపర్తి, విశాఖ ఈస్ట్, గురజాల, తంబళ్లపల్లి, పొద్దుటూరు ఉదాహరణ. వైసీపీ దుర్మార్గాలపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. అన్నివర్గాల ప్రజలు కసిగా వస్తున్నారు. మొన్న రామతీర్థం పర్యటనకు హాజరైన ప్రజలు.. నిన్న భోగిమంటలకు హాజరైన ప్రజలు.. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో భోగిమంటల్లో వైసీపీ రైతు వ్యతిరేక జీవోల దగ్ధం చేశారు’ అని వెల్లడించారు. 



2 రోజుల్లో డీజీపీ మాట మార్చారు

‘దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు. 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారు. ఈ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదు, ఉన్మాదుల పని, పిచ్చోళ్ల పనిగా భోగిరోజున డీజీపీనే చెప్పారు. ఇప్పుడు డీజీపీ మళ్లీ కనుమ రోజున మాటమార్చి దీనిని ప్రతిపక్షాలకు అంటగడుతున్నారు. 17మంది టీడీపీ, నలుగురు బీజేపీ వాళ్లను అరెస్ట్ చేసినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎవరైతే దాడులు చేశారో వాళ్లను వదిలేసి, వాటిని నిలదీసిన వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రులపై చర్యలు లేవు. విగ్రహాల తలకొట్టడం, వనదేవతలను కాలితో తన్నడం తమ మత ప్రచారంలో భాగమని ప్రచారకులే చెబుతుంటే ఏం చేస్తున్నారు..? క్రిస్టియన్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు చేయిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.


ఇప్పుడింకో జగన్నాటకం..

‘ఇప్పుడింకో జగన్నాటకం గోపూజ డ్రామా ప్రారంభించారు. ఎన్నికల ముందు రిషికేష్ వద్ద నదిలో మునకేసి జగన్ డ్రామా జనం మరిచిపోలేదు. కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి కేసు ఎలా చేశారో చూశాం. సొంత బాబాయిని రాక్షసంగా హత్య చేస్తే గుండెపోటుగా ప్రచారం చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. దానిని కూడా టీడీపీకి అంటించాలని కుట్రలు చేశారు.  మొన్న రామతీర్థం దుర్ఘటనలో సూరిబాబుపై ఆరోపణలు చేశారు. ఒప్పుకోవాలని భౌతికంగా హింసించారు. దాడులు, విధ్వంసాలను నియంత్రించడం చేతగాక టీడీపీపై బురద జల్లుతున్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడింది వైసీపీ వాళ్లు. దాడులు, విధ్వంసాన్ని బైటపెట్టింది టీడీపీ. దేవాలయాలపై దాడులు చేసిన వైసీపీ వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా..? దేవుడిపై భక్తితో ఈ దాడులను బైటపెట్టినవాళ్లపై కేసులు పెడ్తారా..? విధ్వంసాలు చేసిన వైసీపీ వాళ్లపై కేసులు లేవా..? రామతీర్థం వెళ్లామని నాపై, అచ్చెన్నాయుడిపై, కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెడతారా..? మాకన్నా గంట ముందు వెళ్లి రెచ్చగొట్టిన విజయసాయి రెడ్డి, వైసీపీ నాయకులపై కేసులు పెట్టరా..?’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.



Updated Date - 2021-01-16T20:48:58+05:30 IST