దళిత ఆడబిడ్డల మానానికి.. ప్రాణానికి రక్షణలేదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-15T21:58:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులతో

దళిత ఆడబిడ్డల మానానికి.. ప్రాణానికి రక్షణలేదు: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. మాట్లాడే హక్కు లేదు. ప్రాథమిక హక్కులనే కాదు.. జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారు. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే అమరావతి భములపై ఆరోపణలు. తెలుగుదేశంపై రాజకీయ కక్షతోనే అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ. 


ఇదే చివరి అవకాశం తమ దోపిడీకి అన్న ఆరాటంతో వైసీపీ బరితెగించింది. ప్రజల సహనానికి హద్దులు దాటిపోయాయి. వైసీపీ దుర్మార్గాలపై ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చింది. ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైంది. అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. ప్రతిపక్షాన్ని అణిచేయాలని పోలీసులు చూడరాదు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రయత్నించకూడదు. పార్టీలకు అతీతంగా పోలీసు వ్యవస్థ పనితీరు ఉండాలి. బాధిత వర్గాలకు అండగా పోలీసు వ్యవస్థ ఉండాలి. జంగారెడ్డిగూడెంలో నలుగురు ఎస్సీ యువకులపై దాడిని ఖండిస్తున్నాం. ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ధార్మిక సంస్థలు, ఆలయాలపై దాడులు పెరగడం బాధాకరం. అంతర్వేది సహా అన్ని ఆలయాల్లో దాడులపై సీబీఐ విచారణ జరపాలి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కోడెల వర్థంతి జరపాలి. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టాలి. సీఎన్జీపై 10 శాతం పన్ను పెంచి ఆటో డ్రైవర్లపై భారం మోపారు. ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి రూ.20 వేలు లాక్కోవడం హేయం’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2020-09-15T21:58:52+05:30 IST