ఇసుక, మట్టి, మద్యం, మైన్స్‌.. అన్నింటా అవినీతి

ABN , First Publish Date - 2020-05-29T09:05:02+05:30 IST

ఇసుక, మట్టి, మద్యం, మైన్స్‌ సహా దేనినీ వైసీపీ నేతలు వదిలిపెట్టడం లేదని, అవినీతి ఆకాశాన్నంటుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఇసుక, మట్టి, మద్యం, మైన్స్‌.. అన్నింటా అవినీతి

  • రాష్ట్రాన్ని పిండుకుంటున్నారు
  • కొన్ని పథకాలు అందుకోసమే
  • పాత బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు
  • కరోనా పేరిట ధరల భారీ పెంపు
  • భూములు తక్కువ ధరకు కొని
  • ప్రభుత్వానికి ఎక్కువకు అమ్మకం
  • కాంట్రాక్టులన్నీ 3-4 కంపెనీలకే
  • ముందే పర్సంటేజీల వసూలు
  • బిల్డ్‌ ఏపీ పేరుతో కబ్జా ఏపీ
  • జలగలా జగన్‌!
  • బాబు ధ్వజం


‘పసుపు పండుగ’ ముగిసింది. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ... వేలాదిమంది కార్యకర్తలు, నేతలు వెబినార్‌ ద్వారా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. గురువారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ‘వైసీపీ సర్కారు అవినీతి’పై  తీర్మానం ప్రవేశపెట్టారు. దేనినీ వదలకుండా దోచుకుంటున్నారంటూ జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏడాది పాలనతో అంతా అనర్థమేనని నేతలు విమర్శించారు. 


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ఇసుక, మట్టి, మద్యం, మైన్స్‌ సహా దేనినీ వైసీపీ నేతలు వదిలిపెట్టడం లేదని, అవినీతి ఆకాశాన్నంటుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జలగ మాదిరిగా జగన్‌ ఈ రాష్ట్రాన్ని పట్టుకుని పిండుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అవినీతిపై గురువారం మహానాడులో జరిగిన చర్చలో ఆయన పాలుపంచుకున్నారు. ‘అవినీతి కోసమే కొన్ని పఽథకాలు రూపొందిస్తున్నారు. వాటికి అందమైన పేర్లు పెడుతున్నారు. ఇందులో మద్య నిషేధం ఒకటి. పాత బ్రాండ్లు ఉంటే పొరుగు రాష్ట్రాలతో పోలికలో ధరలు తెలుస్తాయని వాటిని మొత్తం ఎత్తివేసి కొత్త బ్రాండ్లు తెచ్చిపెట్టారు. కరోనా పేరు చెప్పి వాటి రేట్లు ఇంకా పెంచారు.


వాటి ధరలు ఎంత పెరిగితే వాటి ద్వారా జగన్‌ రెడ్డి ట్యాక్స్‌ ఇంకా అంత వసూలవుతుంది. ఈ ప్రభుత్వానికి నిజంగా మద్యనిషేధం పెట్టాలనే ఆసక్తి ఉంటే ఈ కొత్త బ్రాండ్లు ఎందుకు వచ్చాయి? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో గెలాక్సీ గ్రానైట్‌ గనుల కుంభకోణం చోటు చేసుకుంటే గట్టిగా పోరాడి వాటిని కాపాడామని.. కానీ ఈ ప్రభుత్వం మొత్తం గనుల యజమానులందరినీ బెదిరించి గనులన్నీ స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి తన ఇంట్లో ఒక సలహాదారును పెట్టుకున్నారు. ఏ గని నుంచి ఎంతెంత ఆదాయం వస్తుందో చెప్పడం ఆయన ఉద్యోగం. రాష్ట్రంలో అనేక గనుల యజమానులను బెదిరించి నోటీసులు జారీ చేయించి వాటిలో వాటాలు తీసుకున్నారు. గనుల యజమానులు వ్యాపారం చేసి వీరికి వాటాలు చెల్లించాలి. చివరకు క్రషర్లు కూడా కొట్టేశారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను ఇప్పుడు వ్యాపారంగా మార్చేశారు.


నదుల నుంచి తీసిన ఇసుకలో సగం మాత్రమే స్టాక్‌ పాయింట్లకు చేరుతోంది. మిగిలింది బయటకు వెళ్లిపోతోంది. స్టాక్‌ పాయింట్లలో కూడా విపరీతమైన ధరలకు ఇసుక అమ్ముతున్నారు. నిర్మాణ రంగాన్ని చంపి వీళ్లు జేబులు నింపుకొంటున్నారు’ అని దుయ్యబట్టారు. మారుమూల ప్రాంతాల్లోని భూములు కూడా వదిలి పెట్టడం లేదన్నారు. ‘తక్కువ ధరకు భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు  అమ్మడం కొత్త వ్యాపారం. విశాఖ వంటి చోట్ల బెదిరించి విలువైన భూములు లాక్కుంటున్నారు. ఆరోగ్య సేతు యాప్‌ తయారు చేసిన సాంకేతిక నిపుణుడి భూములు కూడా కొట్టేశారు. సామాన్యులను సైతం వదిలిపెట్టకుండా అసైన్డ్‌ భూములు కూడా లాక్కుంటున్నారు. ఆవ భూములు, మడ భూములు వేటినీ వదిలిపెట్టడం లేదు.


ఇదేమిటని ప్రశ్నిస్తే.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడతారా అని ఎదురుదాడి చేస్తున్నారు’ అని విమర్శించారు. వైఎస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన కాంట్రాక్టులను తాను రద్దు చేయలేదని, ముందు పనులు సాగాలన్న ఉద్దేశంతో వీలైనంత వరకూ పాతవారితోనే పనులు చేయించానని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం వస్తూనే పాత పనులు రద్దు చేసి తమకు కావలసిన 3-4 కంపెనీలు పెట్టుకుని వాళ్లకే ఆ పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. పైగా పర్సంటేజీలు కూడా ముందే తీసుకుంటున్నారని చెప్పారు. ‘నాగార్జున సాగర్‌ కుడి కాలువకు గోదావరి జలాలు తరలించే పనిని ముందు రద్దు చేసి.. తర్వాత అదే కంపెనీకి అదే పని మళ్లీ అప్పగించారు.


దీని ఉద్దేశం ఏమిటి? బిల్డ్‌ ఏపీ పేరుతో కబ్జా ఏపీ మొదలుపెట్టారు. కరోనా సమయంలో ఎవరి వద్దా డబ్బులు లేని సమయంలో భూముల వేలం పెట్టి.. జేబులు నిండుగా ఉన్న వైసీపీ నేతలే వాటిని కొట్టేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇంత రాజకీయ, పాలనానుభవం ఉన్న నా వంటి వారు కూడా ఆశ్చర్యపోయే రీతిలో అవినీతి పథకాలు డిజైన్‌ చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఎంత ఎదురుదాడి చేసినా వదిలిపెట్టేది లేదని, ప్రజల ఆస్తులు కాపాడటానికి గట్టిగా పోరాడతామని తేల్చిచెప్పారు.


తిరుపతి నుంచి మహానాడును వీక్షిస్తున్న పార్టీ కార్యకర్తలు


తిరుపతిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలాభిషేకం చేస్తున్న నేతలు

Updated Date - 2020-05-29T09:05:02+05:30 IST