టీసీఎస్‌ లాభాలకు కరోనా కత్తెర

ABN , First Publish Date - 2020-07-10T05:43:11+05:30 IST

దేశీయ కార్పొరేట్‌ రంగంలో లాక్‌డౌన్‌ ప్రభావిత త్రైమాసిక ఫలితాల సీజన్‌ మొదలైంది. ఈ సీజన్‌కు బోణీ చేసిన టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు.. అంచనాలకు తగ్గట్టు నిరాశజనకంగానే నమోదయ్యాయి...

టీసీఎస్‌ లాభాలకు కరోనా కత్తెర

  • క్యూ1లో 13.8 శాతం క్షీణత..  రూ.7,008 కోట్లకు పరిమితం 
  • ఆదాయం రూ.38,322 కోట్లు..  రూ.5 మధ్యంతర డివిడెండ్‌  

దేశీయ కార్పొరేట్‌ రంగంలో లాక్‌డౌన్‌ ప్రభావిత త్రైమాసిక  ఫలితాల సీజన్‌ మొదలైంది. ఈ సీజన్‌కు బోణీ చేసిన టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు.. అంచనాలకు తగ్గట్టు నిరాశజనకంగానే నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆర్థిక పనితీరుపై కరోనా సంక్షోభం స్పష్టమైన ప్రభావం చూపింది. 


ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) టీసీఎస్‌ నికర లాభం 13.8 శాతం తగ్గి రూ.7,008 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.8,131 కోట్లుగా నమోదైంది. సమీక్షా కాలానికి టీసీఎస్‌ ఆదాయం రూ.38,322 కోట్లకు పరిమితమైంది. అంతకు ఏడాది క్రితం ఆర్జించిన  రూ.38,172 కోట్ల రాబడితో పోలిస్తే 0.4 శాతం వృద్ధి చెందింది. కరోనా సంక్షోభంతో ప్రపంచ దేశాల వ్యాపారాలన్నీ ప్రభావితమయ్యాయి. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ దేశీయ ఐటీ కంపెనీలపై కరోనా ప్రభావం కొంత మేర కన్పించింది. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంపైన మాత్రం ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటుందని ఐటీ కంపెనీలు ముందుగానే అంచనా వేశాయి. టీసీఎస్‌ తాజా ఆర్థిక గణాంకాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్‌ క్యూ1 ఆర్థిక ఫలితాల్లోని మరిన్ని ముఖ్యాంశాలు..


  1. స్థిర కరెన్సీ విలువ ప్రకారం, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6.3 శాతం క్షీణించింది
  2. వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు నమోదైన స్థూల లాభం రూ.9,048 కోట్లు. కాగా, స్థూల లాభం మార్జిన్‌ 23.6 శాతంగా ఉంది 
  3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.5 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది
  4. ఈ మార్చి 31 నాటికి 4,48,464గా నమోదైన కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్‌ 30 నాటికి 4,43,676కు తగ్గింది. 
  5. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ 690 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. జనవరి-మార్చిలో కుదుర్చుకున్న 890 కోట్ల డాలర్ల డీల్స్‌తో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 


కేవలం 1శాతమే వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌!

ప్రస్తుతం ఒక శాతం సిబ్బంది మాత్రమే కంపెనీకి చెందిన ఆయా కార్యాలయాల నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌) పని చేస్తున్నారని టీసీఎస్‌ వెల్లడించింది. ఈ త్రైమాసికంలో ఈ వాటాను క్రమంగా పెంచుతామని తెలిపింది. 


అలా చేస్తే అమెరికాకే నష్టం 

విదేశీ విద్యార్థులను వెళ్లగొట్టడం అమెరికాకే నష్టమని టీసీఎస్‌ మానవ వనరుల విభాగ గ్లోబల్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ అన్నారు. అక్కడి విశ్వవిద్యాలయాల్లో పట్టాలు పుచ్చుకున్న ప్రతిభావంతులపై ఆధారపడుతున్న అమెరికా టెక్నాలజీ దిగ్గజాలకు దీర్ఘకాలంలో  ఇది సవాలుగా పరిణమించనుందన్నారు. అంతేకాదు, ఆ దేశంలో టెక్నాలజీ అభివృద్ధిపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్‌1-బీ వీసాలను నిలిపివేయడం దురదృష్టకరమని, అనుచిత నిర్ణయమని మిలింద్‌ పేర్కొన్నారు.


మళ్లీ వృద్ధి పథంలో.. 

త్రైమాసిక ప్రారంభంలో అంచనా వేసినట్లుగానే కరోనా సంక్షోభం కంపెనీకి చెందిన అన్ని విభాగ సేవలపై ప్రభావం చూపింది. మెరుగైన వృద్ధి నమోదు చేసుకోగలిగిన లైఫ్‌సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మాత్రం ఇందుకు మినహాయింపు. కరోనా ప్రభావం దాదాపు ముగిసినట్లేనని కంపెనీ భావిస్తోంది. మళ్లీ వృద్ధి పథాన్ని వెతకడం ప్రారంభించాలి. 

-  రాజేష్‌ గోపీనాథన్‌, టీసీఎస్‌ సీఈఓ, ఎండీ

Updated Date - 2020-07-10T05:43:11+05:30 IST