- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన
- గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రారంభం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హరిత భవనాలపై వెంటనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, హోటళ్లు, గృహాలు అన్నింటినీ పర్యావరణ అనుకూల హరిత భవనాలుగా నిర్మించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కొత్త భవనాలనే కాక.. ఇప్పటికే ఉన్న భవనాలను కూడా హరిత భవనాలుగా తీర్చిదిద్దాలన్నారు. ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2020’ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) దీన్ని నిర్వహిస్తోం ది. నీటిని, ఇంధనాన్ని ఆదా చేసే హరిత భవనాలను రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, హరిత భవనాలకు స్థానిక ప్రభుత్వాలు పన్ను రాయితీలు కల్పించాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ కూడా హరిత భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కోరారు. రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతున్నందున రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోందన్నారు. భవిష్యత్తులో గృహాల గిరాకీ పెరగనున్నందున నీటిని, ఇంధనాన్ని ఆదా చేసే పర్యావరణ అనుకూల గృహాల నిర్మాణాలు కీలకమని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు, ఐజీబీసీ, సీఐఐ సభ్యులు కలిసి పని చేయాలని అన్నారు.
2022 నాటికి..
భారత్‌లో హరిత భవనాల నిర్మాణం పుంజుకుంటోందని ఐజీబీసీ చైర్మన్ వీ సురేశ్ తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ డిజైన్, ఉత్పత్తులు, ఎక్వి్‌పమెంట్, టెక్నాలజీలను విరివిగా వినియోగించే విధంగా చేయడమే గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. 2022 నాటికి 10 బిలియన్ చదరపు అడుగుల హరిత భవనాల నిర్మాణాన్ని లక్ష్యం గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ 6,055 భవనాలను ఐజీబీసీ రేటింగ్ వ్యవస్థలకు అనుగుణంగా నిర్మించారని తెలిపారు.