టార్గెట్‌ అయ్యన్న

ABN , First Publish Date - 2022-06-20T07:53:44+05:30 IST

రాష్ట్రంలో బుల్‌డోజర్‌ రాజకీయం తెరమీదికి వచ్చింది. రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ప్రజావ్యతిరేక..

టార్గెట్‌ అయ్యన్న

మాజీ మంత్రి ఇంటిపైకి జేసీబీ

తెల్లవారుజామున వందల మంది బలగాలతో ముట్టడి

విద్యుత్‌ సరఫరా నిలిపివేసి వెనుక ప్రహరీ కూల్చివేత

వంట గది కూల్చివేతకూ యత్నం.. అడ్డుకున్న పాత్రుడి కుటుంబం.. నోటీసులు ఇవ్వలేదని నిలదీత

పంట కాలువ గట్టు 2 సెంట్లు ఆక్రమించుకున్నారని అభియోగం

భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు

వీరిని చూసి వెళ్లిపోయిన జేసీబీ డ్రైవర్‌ 

వేరే డ్రైవర్‌ కోసం అధికారుల యత్నం

ఎవరూ రాకపోవడంతో నిలిపివేత

నేడు ఇంటి స్థలం సర్వేకు అంగీకారం


నర్సీపట్నం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుల్‌డోజర్‌ రాజకీయం తెరమీదికి వచ్చింది. రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ సర్కారుపై తరచుగా విమర్శలు చేస్తున్న టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున జేసీబీతో అధికారులు విరుచుకుపడ్డారు. పంట కాలువ గట్టును రెండు సెంట్ల మేర ఆక్రమించుకున్నారనే అభియోగంపై అయ్యన్న ఇంటి వెనుక ఉన్న ప్రహరీని కూల్చేశారు. అదేవిధంగా వంట గదిని కూలగొట్టేందుకు సిద్ధం కావడంతో అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఉదయం నుంచి పొద్దుపోయే వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


ఏం జరిగింది?

నర్సీపట్నం మునిసిపాలిటీ శివపురం రెవెన్యూ పరిధిలోని 276 సర్వే నెంబర్‌లో జల వనరుల శాఖకు చెందిన రావణాపల్లి రిజర్వాయర్‌ పంట కాలువ ఉంది. ఈ కాలువ గట్టుకు చెందిన రెండు సెంట్ల మేర భూమిని అయ్యన్న ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారనేది అధికారుల వాదన. అయితే.. దీనికి సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అయ్యన్న కుటుంబం చెబుతోంది. ఇదిలావుంటే.. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, ఆర్డీఓ గోవిందరావు వంద మందికి పైగా పోలీసులతో అయ్యన్న ఇంటిని చుట్టుముట్టారు. వచ్చీ రావడంతోనే ఇంటి వెనుక భాగంలో గోడను జేసీబీతో కూల్చివేశారు. ఆ సమయంలో శివపురం పరిసరాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించారు. విషయం గ్రహించిన అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి, రెండో కుమారుడు రాజేశ్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ అధికారులను నిలదీశారు. గోడ కూల్చివేతపై అయ్యన్న కుమారుడితో పాటు ఇంట్లో ఉన్న వంటమనిషి వెంకాయమ్మ పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఆమెను స్టేషన్‌కు తరలించారు. విజయ్‌ను బలగాలు అడ్డుకున్నాయి. ఈ విషయం తెలిసి తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున అయ్యన్న ఇంటికి చేరుకొని గోడ కూల్చివేతను తీవ్రంగా ప్రతిఘటించడంతో జేసీబీ డ్రైవర్‌ పరారయ్యాడు. ఆర్డీఓ గోవిందరావు, నర్సీపట్నం కమిషనర్‌ కనకారావులు వేరొక డ్రైవర్‌ కోసం ప్రయత్నించినా ఎవరూ ముందుకురాలేదు. దీంతో కూల్చివేత నిలిపేశారు. 


నేడు సర్వే

ఆర్డీఓ గోవిందరావు, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావులు ఆదివారం మధ్యాహ్నం మండల సర్వేయర్‌ ద్వారా అయ్యన్న ఇంటి గోడ నిర్మించిన ప్రదేశంలో సర్వే చేయించేందుకు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలు పల్లా శ్రీనివాస్‌, గండి బాబ్జీ, స్థానిక నేతలు అభ్యంతరం చెప్పారు. టౌన్‌ప్లానింగ్‌ నుంచి బ్లూ ప్రింట్‌ తెచ్చిన తర్వాత ఒకరోజు గడువు ఇచ్చి సర్వే చేయాలని అధికారులను కోరారు. ఈ విషయమై అధికారులు, టీడీపీ నేతల మధ్య సాయంత్రం వరకు చర్చలు సాగాయి. చివరకు టీడీపీ నేతల ప్రతిపాదనకు అధికారులు అంగీకరించి సోమవారం ఉదయం పది గంటలకు సర్వే చేయాలని నిర్ణయించారు. 


దారులు మూసి.. దాడులు

ఆదివారం అర్ధరాత్రి నుంచే వందలాది మంది పోలీసులు, విశాఖపట్నం నుంచి రిజర్వు పోలీసు బలగాలు, అనకాపల్లి పోలీసులు అయ్యన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. కూల్చివేత విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వివిధ మండలాల నుంచి పెద్దఎత్తున అయ్యన్నఇంటి వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న ఇంటికి వెళ్లేందుకు ఉన్న రెండు మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో చేసేదిలేక కొద్దిసేపటి తర్వాత వారిని అనుమతించారు. 


తరలివచ్చిన శ్రేణులు

నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిని కూల్చివేస్తున్నారన్న సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. జేసీబీ టైర్లలో గాలి తీసేశారు. ఉదయం ఆరు గంటల సమయంలో గోడ కూల్చివేసిన ప్రదేశంలో కొద్దిసేపు టెంట్‌ వేసి నిరసన తెలిపారు. ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, అభిమానులు అయ్యన్న ఇంటి వద్దకు చేరుకోవడం, మీడియా అక్కడకు రావడంతో అధికారులు మెల్లగా జారుకున్నారు. 


దొంగల్లా వచ్చారు అయ్యన్న భార్య పద్మావతి

నోటీసు ఇవ్వకుండానే దొంగల మాదిరిగా రాత్రిపూట వచ్చి గోడ కూల్చేశారని అయ్యన్న సతీమణి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎవరికి ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. ‘‘ఎవరినైనా హత్య చేసిందా? గోడ కూల్చే ముందే నోటీసు ఇవ్వాలి కదా. గోడ కొట్టిన తర్వాత సర్వే చేయడమేంటి. మహానాడులో ప్రజల కోసం అయ్యన్న గళమెత్తినందుకు ఇల్లు కూల్చేస్తారా?. అయ్యన్న గొంతు నొక్కాలని చూస్తున్నారు. సమాజంలో మాట్లాడే హక్కు కూడా లేదా? ప్రజల గురించి మాట్లాడితే తప్పేంటి. బీసీ నాయకుడి కుటుంబం రోడ్డున పడాలని అనుకుంటున్నారా.. రాష్ట్రంలో అందరినీ చంపేస్తున్నారు. అయ్యన్నపాత్రుడి కుటుంబాన్ని చంపేస్తారా? జగన్‌ చేస్తున్నది ముమ్మాటికీ తప్పే. 40 ఏళ్ల రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు చూడలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


న్యాయస్థానంలో తేల్చుకుంటాం: విజయ్‌ 

ఇంటి నిర్మాణానికి అన్ని హక్కు పత్రాలు ఉన్నాయని అయ్యన్న కుమారుడు విజయ్‌ అన్నారు. నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చేసిన ఏఎస్పీ, ఆర్డీఓ, ఎమ్మార్వోలపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. జరిగిన నష్టాన్ని అధికారుల జేబు నుంచి చెల్లించేలా చేస్తామన్నారు. 40 ఏళ్లుగా నిజాయితీగా బతికిన ఒక మాజీ మంత్రినే ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంటి నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.  



Updated Date - 2022-06-20T07:53:44+05:30 IST