టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు..!

ABN , First Publish Date - 2020-03-26T21:14:27+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సును వరుసగా 152వ నెల డల్లాస్‌లో ఘనంగా నిర్వహిచారు

టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు..!

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సును వరుసగా 152వ నెల డల్లాస్‌లో ఘనంగా నిర్వహిచారు. కరోనా వైరస్ కారణంగా మొదటిసారిగా ఈ సదస్సును ఆన్‌లైన్‌లో నిర్వహించారు. కార్యక్రమం ఏర్పాట్లను అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు పర్యవేక్షించారు. కాగా.. సదస్సును ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పటికీ భాషాభిమానులు, సాహితీ ప్రియులు, సాహితీ వేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేశారు. మొదట ప్రార్థనా గీతంతో సదస్సును ప్రారంభించారు. అనంతరం డా. నరసింహా రెడ్డి ఊర్మిండి మాట్లాడారు. సిరిసంపదల్లో భాగంగా కొంగుబంగారం, గోరోజనం, గోడచేర్పు, కుండోదరుడు వంటి జాతీయాల నేపథ్యం గురించి ఆయన వివరించారు. సత్యం ఉపద్రష్ట మాట్లాడుతూ.. చమత్కార కవిత్వం గురించి వివరించారు. 


కాగా.. ఆన్‌లైన్‌లో సాహిత్య సదస్సును నిర్వహించడాన్ని లెనిన్‌ అభినందించారు. సంస్కృతం అనగానే ఆధ్యాత్మిక సాహిత్యం, జ్యోతిష్యం, మంత్రాలని చాలా మంది అనుకుంటారనీ.. అయితే సంస్కృతంలో ఆధ్యాత్మిక సాహిత్యం ఎంతుందో లౌకిక సాహిత్యం, గణిత సాహిత్యం కూడా అంతే ఉందన్నారు. ఇకపోతే లలితానంద్ మాట్లాడుతూ.. కరోనా పేరు మీద ధిక్కారం పేరుతో కవిత చదివి వినిపించారు. డా. ఉమాదేవి భాగవతంలోని శ్లోకాన్ని చదివి వినిపించారు. ఇదిలా ఉంటే.. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణ రావు.. తెలుగు కథా పరిణామంపై చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా తెలుగు కథా పరిణామ క్రమాన్ని ఆయన వివిరించారు. చివరగా.. రమణ రావు సతీమణి సుభద్ర..లలిత గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. 


సుమారు మూడు గంటలపాటు జరిగిన కార్యక్రమాన్ని తిరుమల రెడ్డి కంభం కల్పించిన జూం ద్వారా ప్రత్యేక్ష ప్రసారం చేశారు. దీంతో అమెరికా నలమూలల నుంచి ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. సదస్సులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భాషాభిమానులకు, సాహిత్య ప్రియులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. రమణ రావుకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ధన్యవాదాలు తెలిపింది. కాగా.. కార్యక్రమంలో పూర్వాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, రాయవరం భాస్కర్, సురేష్ కాజా, ప్రసాద్ తోటకూర, కిరణ్మయి గుంట, చిన సత్యం వీర్నపు, రవి పట్టిసం, శశకళా పట్టిసం, రాజా రెడ్డి, పీవీ రామారావు, విష్ణు ప్రియ, జగదీశ్వరన్ పూదూరు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-26T21:14:27+05:30 IST