Abn logo
Oct 28 2020 @ 00:06AM

అంతరిస్తున్న జంతువులపై సినిమా తీస్తా!

ప్రకృతి ప్రేమికుడు అయిన తండ్రి నుంచి కెమెరా అందుకుంది ఐశ్వర్యా శ్రీధర్‌. ఆ రోజు నుంచి ప్రకృతిని తన కెమెరా కన్నుతో అద్భుతంగా ఆవిష్కరించడం మొదలెట్టింది. ఈ ఏడాది వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ పోటీల్లో అవార్డు సాధించలేకపోయినా, ఆమె తీసిన ఫొటో అందరి ప్రశంసలు పొందింది. వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న మహారాష్ట్రకు చెందిన ఐశ్వర్య ప్రస్థానమిది...


ఈ ఏడాది నేచురల్‌ హిస్టరీ మ్యూజియమ్‌కు వచ్చిన 49వేల ఎంట్రీలలో ఐశ్వర్య ఫొటో ఒకటి. వేల సంఖ్యలో మిణుగురు పురుగులు వాలడంతో వెలుగులు విరజిమ్ముతుున్న చెట్టు ఫొటో అది. ఈ ఫొటోను ఆమె గత ఏడాది జూలైలో భండార్డార కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు తీసింది. ‘లైట్స్‌ ఆఫ్‌ ప్యాషన్‌’ టైటిల్‌తో ఈ ఫొటోను ఐశ్వర్య పోస్ట్‌ చేసింది. ఆమె ఫొటోను మ్యూజియం సభ్యులు ‘అత్యంత ప్రశంసనీయమైన ఫొటో’గా ప్రకటించారు. ‘ఇన్‌వర్టిబ్రేటా (వెన్నెముక లేని జీవుల) ప్రవర్తన’ అనే విభాగంలో ఐశ్వర్య ఫొటో అందరి ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ప్రపంచ పర్యటనలో కూడా ఐశ్వర్య తీసిన ఫొటోకు చోటు కల్పించారు. ‘‘వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ అవార్డు కమిటీ వర్చ్యువల్‌ అవార్డుల ప్రదానంలో నా పేరు పిలవడం, నేను తీసిన ఫొటోను మెచ్చుకోవడంతో నా కల నిజమైంది’’ అంటుందీ యంగ్‌ ఫొటోగ్రాఫర్‌.  


ప్రణాళిక లేకుండానే...

ఐశ్వర్య తన వద్ద ఉన్న కెనాన్‌ 1 డిఎక్స్‌ మార్క్‌ 2 కెమెరాతో ‘లైట్స్‌ ఆఫ్‌ ప్యాషన్‌’ ఫొటోను తీసింది. ‘గత ఏడాది ట్రెక్కింగ్‌ సమయంలో నేను మిణుగురు పురుగులను ఫొటో తీయాలనుకున్నా. కానీ ఫలానా ఫ్రేమ్‌లో తీయాలి అని అనుకోలేదు. ఒక చెట్టు మీద మిణుగురు పురుగులు వాలి ఉండడం గమనించాను. వెంటనే నా కెమెరా కళ్లకు పనిచెప్పాను. అయితే మొదటి ఫొటో సరిగా రాలేదు. దాంతో ఆ చెట్టుతో పాటు ఆకాశం, నక్షత్రాలు కనిపించేలా ఫొటో తీశాను. ఆ ఫొటో ఎంతో అధ్భుతంగా వచ్చింది. ఐశ్వర్యకు ఫొటోగ్రఫీ మీద ఇష్టం పెరగడానికి కారణం ప్రకృతి పరిశోధకుడు అయిన వాళ్ల నాన్న. తండ్రితో కలిసి ఐశ్వర్య తరచూ రాయ్‌ఘడ్‌ సమీపంలోని కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లేది. అలా ఆమెకు తెలియకుండానే ప్రకృతితో అనుబంధం ఏర్పడింది.


పధ్నాలుగు ఏళ్లకే ఐశ్వర్య ‘శాంక్చ్యుయరీ ఆసియా యంగ్‌ నేచురలిస్ట్‌’ అవార్డు సాధించింది. సమాజంలో మార్పు కోసం పాటుపడుతున్న యవతకు ఏటా ప్రకటించే ‘ప్రిన్సెస్‌ డయానా’ అవార్డు గత ఏడాది ఐశ్వర్య గెలుచుకుంది. పిళ్లై కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌, కామర్స్‌ అండ్‌ సైన్స్‌లో మాస్‌మీడియా గ్రాడ్యుయేషన్‌ చేసిన ఐశ్వర్య ఆరుతడి నేలల పర్యవేక్షణ చేయడం మీద డాక్యుమెంటరీ తీసింది కూడా. గత ఏడు నెలలుగా ఆమె ఫ్లెమింగోలను ఫొటోలు తీసే పనిమీద ఉంది. అంతేకాదు పరిశోధకులు, పర్యావరణవేత్తలు, సినిమా దర్శకులు, ఫొటోగ్రాఫర్లను ఇంటర్వ్యూ చేసి, డిస్కవరీ ఛానల్‌లో ‘నేచర్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ పేరుతో డిజిటల్‌ సిరీస్‌ కూడా నిర్వహించింది. ‘‘మొదట్లో నేను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో చేరి, వన్యప్రాణి సంరక్షణ విధానాల్లో మార్పు తేవాలనుకున్నా. అయితే ఫొటోగ్రఫీ మీద నా ప్యాషన్‌ తగ్గలేదు. ఫొటోలతో కూడా మార్పు తేవచ్చు అనుకున్నా. అంతరించిపోయే దశలో ఉన్న ప్రైమేట్స్‌ (కోతుల జాతులు) మీద సినిమా తీయాలనే ది నా లక్ష్యం. అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో జనవరిలో కొంత షూట్‌ చేశాను. కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాక మళ్లీ షూటింగ్‌ మొదలెడతాను’’ అంటున్న ఐశ్యర్య వనప్రాణి ఫొటోగ్రాఫర్‌గా మరిన్ని అద్భుతాలు చేయాలనుకుంటోంది.

Advertisement