సవాల్‌ను స్వీకరించి భట్టీ ఇంటికెళ్లిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-09-17T16:32:59+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.

సవాల్‌ను స్వీకరించి భట్టీ ఇంటికెళ్లిన మంత్రి తలసాని

హైదరాబాద్‌ : డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరూ సవాళ్లు కూడా విసురుకున్నారు. భట్టీ సవాల్ స్వీకరించిన మంత్రి కొద్దిసేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకున్నారు. లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు, హైదరాబాద్‌ అభివృద్ధిని చూపాలని భట్టి సవాల్‌ విసిరారు. ఇందుకు స్పందించిన మంత్రి భట్టిని తీసుకెళ్లి చూపిస్తానన్నారు. భట్టి ఇంటి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లను చూసేందుకు జియాగూడకు తలసాని, భట్టి విక్రమార్క ఒకే కారులో బయల్దేరారు.


మరోవైపు.. భట్టీ ఇంటికి కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, విక్రమ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కుసుమ కుమార్‌లు ఇప్పటికే భట్టీ ఇంటికి చేరుకున్నారు. మంత్రి వెంట జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు ఉన్నారు. కాగా ఇళ్ల పరిశీలన అనంతరం ఇరువురు కలిసి మీడియా మీట్ నిర్వహించనున్నారని సమాచారం.


అసలు నిన్న ఏం జరిగింది!?

‘‘హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందికి ఇచ్చారు? నాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు? మళ్లీ ఎన్నికలు వస్తున్నందునే ఇళ్లను పంపిణీ చేస్తామని అంటున్నారు’’ అని భట్టి విమర్శించారు. ఇందుకు మంత్రి తలసాని స్పందించారు. రేపు తాను స్వయంగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనను తీసుకెళ్లి డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణాలను చూపిస్తానని చెప్పారు. దాంతో, లక్ష ఇళ్లను చూపిస్తానంటే రావడానికి తాను సిద్ధమేనని భట్టి జవాబిచ్చారు. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు.

Updated Date - 2020-09-17T16:32:59+05:30 IST