తహసీల్దార్ల దిగ్బంధం

ABN , First Publish Date - 2020-02-20T09:44:33+05:30 IST

రాజధాని నిర్మాణానికి రైతులిచ్చిన భూములను పేదలకు నివేశన స్థలాలుగా ఇచ్చేందుకు వాటిని సర్వే చేయడానికి వచ్చిన తహసీల్దార్లను, రెవెన్యూ సిబ్బందిని అమరావతి ప్రాంత రైతులు...

తహసీల్దార్ల దిగ్బంధం

  • భూముల సర్వేకు రావడంపై
  • అమరావతి రైతుల ఆగ్రహం
  • రాజధానిని అభివృద్ధి చేయకుండా
  • మా భూములు నివేశన స్థలాలకా?
  • మాకే ఇవ్వలేదు.. పేదలకిస్తామంటారా?
  • అధికారులపై రైతుల ఆగ్రహం


తాడికొండ/మంగళగిరి క్రైమ్‌, ఫిబ్రవరి 19: రాజధాని నిర్మాణానికి రైతులిచ్చిన భూములను పేదలకు నివేశన స్థలాలుగా ఇచ్చేందుకు వాటిని సర్వే చేయడానికి వచ్చిన తహసీల్దార్లను, రెవెన్యూ సిబ్బందిని అమరావతి ప్రాంత రైతులు అడ్డగించారు. వారు ముందుకు కదలకుండా నాలుగు గంటలపాటు కారుముందు రాస్తారోకో చేశారు. ‘తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన భూములను రాజధానికి ఇచ్చాం. మాకే ఇంత వరకూ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించలేదు. రాజధాని అభివృద్ధి చేయకుండా మా భూములను పేదలకు నివేశన స్థలాలు ఎలా ఇస్తారు’ అని అధికారులను నిలదీశారు. వీటిపై సర్వే చేయడానికి వస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. తమకు ప్లాట్లు అప్పగించిన తర్వాత.. మిగులు భూములు ఉంటే అప్పుడు పేదలకు ఇవ్వాలని సూచించారు.


రైతులకు, సీఆర్‌డీఏ అధికారులకు మధ్య ఒప్పందం ఉందని.. రెవెన్యూ అధికారులకు రాజధాని భూములతో ఎలాంటి సంబంధమూ లేదని తెగేసిచెప్పారు. రాజధాని పరిధిలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామంలో 103, 106 సర్వే నంబర్లలో భూముల సర్వేకు దుగ్గిరాల, పెదకాకాని మండల తహసీల్దార్లు మల్లేశ్వరి, రమేశ్‌నాయుడు,  సర్వేయర్లు శ్రీనివాసరావు, విజయ్‌కుమార్‌ వచ్చారు. ఇది తెలుసుకున్న గ్రామ రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. తహసీల్దారు మల్లేశ్వరి కారు దిగలేదు. కారు దిగి తమకు సమాధానం చెప్పాలని రైతులు పట్టుబట్టినా ఆమె స్పందించలేదు.


దీంతో రైతులు రోడ్డుపై కారుకు అడ్డంగా బైఠాయించారు. రాజధాని నిర్మాణానికి తాము పంట పొలాలు ఇస్తే.. పేదల నివేశన స్థలాల కోసం వాటిని కేటాయించడమే కాకుండా కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు సర్వేకు రావడం ఏమిటని మండిపడ్డారు. ఇకపై రాజధాని ప్రాంతంలో పంట భూములను సర్వే చేయాలనుకుంటే ముందుగా ఆయా గ్రామాల రైతులకు సమాచారం అందించాకే అడుగుపెట్టాలని, లేకుంటే ఇలాగే అడ్డుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రైతులు రాస్తారోకో చేశారు.


మా శవాల మీదుగా వెళ్లాలి..

సర్వే విషయం తెలిసి యర్రబాలెం, పెనుమాక, మందడం, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులు, జేఏసీ నాయకులు హుటాహుటిన పెద్ద సంఖ్యలో కృష్ణాయపాలెం తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తుగ్లక్‌ సీఎం డౌన్‌డౌన్‌... తుగ్లక్‌ పాలన నశించాలి.... ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్తత నెలకొనడంతో మంగళగిరి, తుళ్లూరు డీఎస్పీలు దుర్గాప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, మంగళగిరి పట్టణ, రూరల్‌ సీఐలు శ్రీనివాసులరెడ్డి, శేషగిరిరావు, తుళ్లూరు సీఐ శరత్‌బాబు, ట్రాఫిక్‌ సీఐ నాగేశ్వరరావు భారీ సంఖ్యలో తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో మంగళగిరి తహసీల్దారు జీవీ రామ్‌ప్రసాద్‌ అక్కడకు వచ్చారు. కృష్ణాయపాలెం లో ప్రభుత్వ పోరంబోకు భూములను, డొంక భూములను సర్వే చేయడానికే రెవెన్యూ అధికారులు వచ్చారని  సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.


ఇతర మండలాల పేదలకు రాజధాని గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ముందుగానే రెవెన్యూ అధికారులు ఒప్పంద పత్రాలు తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని పలువురు రైతులు ప్రస్తావించగా.. అలాంటిదేమీ లేదని ఆయన తెలిపారు. పలువురు మహిళలు మాట్లాడుతూ 4 గంటల సేపు అధికారిని అడ్డగిస్తేనే పోలీసులు, ఇతర అధికారులు వచ్చి నిరసనలు విరమించాలని చెబుతున్నారని.. 64 రోజుల నుంచి తాము ఆందోళనలు చేస్తూ లాఠీ దెబ్బలు తింటుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గ్రామ సభలు నిర్వహించకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధానిలో సర్వేల పేరుతో అధికారులు వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎవరైనా వస్తే తమ శవాల మీదుగా వెళ్లాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.





Updated Date - 2020-02-20T09:44:33+05:30 IST