ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్.. చివరి బంతికి సిక్స్ కొట్టి తమిళనాడుకు ట్రోఫీ అందించిన షారూఖ్ ఖాన్

ABN , First Publish Date - 2021-11-22T22:06:56+05:30 IST

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో కర్ణాటకను చిత్తు చేసిన తమిళనాడు ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్.. చివరి బంతికి సిక్స్ కొట్టి తమిళనాడుకు ట్రోఫీ అందించిన షారూఖ్ ఖాన్

న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో కర్ణాటకను చిత్తు చేసిన తమిళనాడు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరింతంగా సాగిన ఈ మ్యాచ్‌ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతికి ఐదు పరుగులు సాధించాల్సిన వేళ తమిళనాడు బ్యాటర్ షారూఖ్ ఖాన్ సిక్సర్ కొట్టి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించిపెట్టాడు. తమిళనాడుకు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం గమనార్హం.


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. తమిళనాడు బౌలర్ సాయి కిషోర్ కర్ణాటకను దారుణంగా దెబ్బకొట్టాడు. అయితే, చివర్లో అభినవ్ మనోహర్, ప్రవీణ్ దూబే క్రీజులో నిలదొక్కుకుని బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డుపై పరుగులు అమాంతం పెరిగాయి.


37 బంతులు ఎదుర్కొన్న అభినవ్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేయగా, దూబే 25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. కరుణ్ నాయర్, జె.సుచిత్ చెరో 18 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సాయి కిషోర్ మూడు వికెట్లు తీసుకోగా, వారియర్, సంజయ్ యాదవ్, టి.నటరాజన్ చెరో వికెట్ తీసుకున్నారు. 


అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తమిళనాడు తడబడి చివరికి విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ టీ20లోని అసలైన మజాను అందించింది. చివరి ఓవర్‌కు 16 పరుగులు అవసరం కాగా, ప్రతీక్ జైన్ వేసిన తొలి బంతిని సాయి కిషోర్ బౌండరీకి తరలించాడు. దీంతో ఐదు బంతులకు 12 పరుగులు అవసరమయ్యాయి. రెండో బంతికి ఒక పరుగు రాగా, మూడో బంతికి వైడ్ రూపంలో ఓ పరుగు, ఓ బంతి కలిసొచ్చింది. 


ఆ తర్వాతి బంతికి మరో పరుగు వచ్చింది. దీంతో చివరి మూడు బంతుల్లో విజయానికి 9 పరుగులు అవసరం. నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది. దీంతో తమిళనాడు పని అయిపోయిందని అందరూ భావించారు. అయితే, కర్ణాటకను దురదృష్టం వెంటాడింది. ఐదో బంతిని కూడా వైడ్ విసిరిన ప్రతీక్ తమిళనాడుకు ఒక పరుగుతోపాటు అదనంగా మరో బంతిని ఇచ్చాడు.


అదనంగా వచ్చిన ఐదో బంతికి షారూఖ్ రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా, ప్రతీక్ వేసిన బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన షారూఖ్ ఖాన్ జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న షారూఖ్ ఫోర్, మూడు సిక్సర్లతో 33 పరుగులు చేశాడు.


జట్టుకు కప్పు అందించిపెట్టిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎన్.జగదీశన్ 41, హరినిషాంత్ 23, కెప్టెన్ విజయ్ శంకర్ 18 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కేసీ కరియప్ప 2, ప్రతీక్ జైన్, విద్యాధర్ పాటిల్, కరుణ్ నాయర్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2021-11-22T22:06:56+05:30 IST