స్వీడన్ నుంచి వచ్చి.. కోయంబత్తూరులో బిచ్చమెత్తుకుంటున్న కోటీశ్వరుడు

ABN , First Publish Date - 2020-02-21T22:14:14+05:30 IST

లక్షల కోట్లున్నా అతనికి మానసిక ప్రశాంతత కోరవడింది.

స్వీడన్ నుంచి వచ్చి.. కోయంబత్తూరులో బిచ్చమెత్తుకుంటున్న కోటీశ్వరుడు

కోయంబత్తూరు: విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన 'బిచ్చగాడు' సినిమా గుర్తుంది కదా. అనారోగ్యం పాలైన తన తల్లికోసం కోటీశ్వరుడైన హీరో బిక్షాటన చేయడం మనం ఈ చిత్రంలో చూశాం. తన తల్లి ఆరోగ్యం కుదుటపడాలంటే ఏం చేయాలని ఓ స్వామీజీని హీరో అడగడం... ఆయన సూచన మేరకు 40 రోజులకు పైగా బిచ్చమెత్తుకోవడం మూవీలో చూపించడం జరిగింది. అచ్చం ఈ సినిమా స్టోరీనే తలపించేలా ఓ విదేశీ కరోడ్‌పతి భారత్ వచ్చి మరీ భిక్షాటన చేస్తున్నాడు.


అయితే, ఇక్కడ ఆ కోటీశ్వరుడికి గానీ, అతని తరపు వాళ్లకు గానీ ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవు. కానీ, లక్షల కోట్లున్నా అతనికి మానసిక ప్రశాంతత కోరవడింది. దాంతో భారత యాత్రకు వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత దాన ధర్మాలు చేయడం, ఇతర పుణ్య కార్యాలు కూడా చేసి చూశాడు. అయినా అతనికి మానసిక ప్రశాంతత దొరకలేదు. దీంతో ఒక గురువు సూచన మేరకు బిక్షాటనకు దిగాడు. అర్ధనగ్నంగా రోడ్డుపై చేతులు జోడించి బిచ్చమెత్తుకుంటున్నాడు.


వివరాల్లోకి వెళ్తే... స్వీడన్‌కు చెందిన కిమ్ అనే వ్యాపారవేత్తకు లక్షల కోట్లున్నాయి. కాలు కదపకుండా పనులన్నీ చక్కబెట్టే పనివాళ్లు ఉన్నారు. రాజభవనం లాంటి ఇళ్లు.. విలాసవంతమైన జీవితం. కానీ అవేవీ కిమ్‌ను సంతృప్తి పరచలేకపోయాయి.  దాంతో లక్షల కోట్లను వదులుకొని మానసిక ప్రశాంతత కోసం భారత యాత్రకు వచ్చాడు. కొన్నినెలల క్రితం కోవైలోని ఈషా యోగా కేంద్రానికి వచ్చి పేదలకు సహాయం చేయడం ప్రారంభించాడు. అయినా మానసిక ప్రశాంతత దొరకలేదు. 


దీంతో తనకు సరైన మార్గం సూచించాలని ఈషా కేంద్రం గురువును అడిగాడు. ఆయన బిచ్చమెత్తుకోవాలని సూచించారు. దీంతో గురువు చెప్పిన మార్గంలోనే కిమ్ అన్నీ వదిలేసి కోయంబత్తూరు వీధుల్లో బిక్షాటనకు దిగాడు. రోడ్డుపై అర్ధనగ్నంగా నిలబడి రెండు చేతులు జోడించి బిచ్చమెత్తుకుంటున్నాడు. ఇక కరోడ్‌పతి అయిన ఓ పారిశ్రామికవేత్త ఇలా నడిరోడ్డుపై అది దేశం కాని దేశం వచ్చి బిక్షాటన చేయడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ వార్త కాస్తా బయటకు రావడంతో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. 

Updated Date - 2020-02-21T22:14:14+05:30 IST