సూత్ర గ్రంథాలు

ABN , First Publish Date - 2022-06-17T08:04:14+05:30 IST

ఉపనిషత్తుల తరువాత వెలువడిన మొత్తం గ్రంథాలను ‘వేదాంగం’గా సంప్రదాయికులు పిలుస్తారు.

సూత్ర గ్రంథాలు

ఉపనిషత్తుల తరువాత వెలువడిన మొత్తం గ్రంథాలను ‘వేదాంగం’గా సంప్రదాయికులు పిలుస్తారు. వీటిని వేదాలలో భాగంగా చూపినప్పటికీ... స్పష్టంగా ఇవి వేదాంత కాలానికి చెందినవి. సూత్రగ్రంథాలు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం... వీటన్నిటినీ కలిపి ‘వేదాంగాలు’ అంటారు. ఈ సాహిత్యంలో అత్యధిక భాగం సూత్ర గ్రంథాలే. ‘సూత్రం’ అంటే ‘నూలుపోగు’ అని అర్థం. ‘తేలికగా అర్థం చేసుకోవడం’ అని దీని ఉద్దేశం. ఇవి బ్రాహ్మణాలతో ముడిపడి ఉంటాయి. వాటిలో ముఖ్యంగా శ్రౌత సూత్రాలు... అంటే గృహ్య సూత్రాలు... కుటుంబాల్లో జరిగే నామకరణాలు, ఉపనయనాలు, సీమంతం, వివాహం, అపరకర్మలు లాంటి గృహ కర్మలకు సంబంధించినవి. ఈ సూత్రాలను అనేకమంది రచించారు. వీటిలో హిరణ్య కౌశిక గృహ్య సూత్రాలు, ఆపస్తంభ గృహ్య సూత్రాలు, పారస్కర గృహ్య సూత్రాలు, బోధాయన, పరాశర, అశ్వలాయన గృహ్య సూత్రాలు ప్రధానమైనవి. ఇక, సుల్వ సూత్రాలు... యజ్ఞ వేదిక నిర్మాణ కొలతలు నిర్ణయించేవి. వీటిని జామెట్రీ, గణిత శాస్త్రాలకు ప్రారంభ రూపాలుగా భావించవచ్చు.  అలాగే ధర్మ సూత్రాలు... పాలకులు, సమాజం లోని వివిధ వర్ణాల ప్రజలు అనుసరిం చవలసిన ధర్మాలను ప్రబోధిస్తాయి. ఈ సూత్ర గ్రంథాలలో అత్యధిక భాగం బుద్ధుని తర్వాత కాలానికి... అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాలకు చెందినవి.


పి.బి.చారి, 9704934614

Updated Date - 2022-06-17T08:04:14+05:30 IST